నిర్మాత కం న‌టిగా రెండు ప‌డ‌వ‌ల ప‌య‌నం

Update: 2021-08-12 06:14 GMT
ఓవైపు గ‌ర్భిణిగా ఉన్నా బెబో క‌రీనా క‌పూర్ ప‌లు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తో పాటు అమీర్ ఖాన్ `లాల్ సింగ్ చ‌ద్దా` కీల‌క షెడ్యూల్ లో పాల్గొన‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప‌ని ప‌ట్ల త‌న శ్ర‌ద్ధ‌ను ఈ ఇన్సిడెంట్ చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ రెండవ బిడ్డకు స్వాగ‌తం ప‌లికారు క‌రీనా. బెబో క‌రీనాక‌పూర్ ఆ ఎగ్జ‌యిటింగ్ ఎమోష‌న‌ల్ మూవ్ మెంట్స్ కి సంబంధించిన అనుభ‌వాల్ని అనుభూతుల్ని అక్ష‌ర‌బ‌ద్ధం చేసి పుస్త‌కంగా మ‌లిచిన‌ సంగ‌తి తెలిసిన‌దే. మొద‌టి బిడ్డ‌కు థైమూర్ అలీఖాన్ అని పేరు పెట్టుకున్న బెబో రెండో బిడ్డ‌కు జ‌హంగీర్ (జ‌హ్‌) అని నామ‌క‌ర‌ణం చేశారు. ప్ర‌స్తుతం బెబో షూటింగుల‌పైనే ఫోక‌స్ పెట్టి బిజీగా ఉన్నారు.

క‌రీనా న‌టిస్తున్న లాల్ సింగ్ చ‌ద్దా చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌లో ఉంది. మ‌రోవైపు నిర్మాణానంత‌ర ప‌నుల్ని వేగంగా పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు అమీర్ ఖాన్ స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఈ చిత్ర‌బృందంతో ఇంత‌కుముందు తెలుగు హీరో నాగ‌చైత‌న్య జాయినైన సంగ‌తి తెలిసిందే. చైతూ ఇందులో కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు. ఇక బెబో కరీనా కపూర్ ఖాన్ మొదటిసారిగా సినిమా నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు. త‌న‌ తొలి సినిమా నిర్మాణం కోసం స్నేహితురాలు ఏక్తా కపూర్ తో క‌లిసి ప‌ని చేయ‌నున్నారు. స్కామ్ 1992 ఫేమ్ హన్సల్ మెహతా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా నిర్మాణంలో భాగ‌స్వామిగా కొన‌సాగుతూనే.. కరీనా కపూర్ కూడా ఇందులో కీలక పాత్రను పోషిస్తుంది.

బ్రిట‌న్ లో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందిస్తున్న థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. క‌థానుసారం ఈ సినిమా షూటింగ్ బ్రిట‌న్ లో జరుగుతుంది. ఏక్తా కపూర్ - హన్సల్ మెహతా లాంటి ట్యాలెంటుతో కలిసి ప‌ని చేయ‌డాన్ని కరీనా అదృష్టంగా భావిస్తోంది. ``ఇది నాకు చాలా `ఫస్ట్‌`లను సూచిస్తుంది`` అంటూ లాజిక‌ల్ గా వ్యాఖ్యానించారు బెబో. తాజా చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఏక్తా కపూర్ - కరీనా ఇంతకు ముందు `వీరే ది వెడ్డింగ్` చిత్రానికి క‌లిసి ప‌ని చేశారు.




Tags:    

Similar News