ఆంఖే 2: ఇలియానా వెర్సెస్ గౌరంగ్

Update: 2016-08-20 04:17 GMT
ఆంఖే 2: ఇలియానా వెర్సెస్ గౌరంగ్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిపోయిన ఇలియానా.. తాజాగా విడుదలైన రుస్తుం సినిమాతో మంచి పేరునే సంపాదించుకుంది. ఆ సినిమా తర్వాత ఆంఖే సీనిమాకి సీక్వెల్ గా వస్తున్న ఆంఖే - 2 లో చేస్తుందని వార్తలొచ్చాయి. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఇలియానా హాజరు కాలేదు, కానీ ఆమె ఈ సినిమాలో నటిస్తుందని చిన్న ఏవీ కూడా వేసి చూపించారు. దీంతో ఇలియానా - చిత్ర నిర్మాత గౌరంగ్ లు ఈ సినిమాలో ఇలియానా నటిస్తుందా లేదా అనే విషయంలో భిన్నంగా స్పందించారు. ఇప్పుడు బాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్.

"ఆంఖే"కి సీక్వెల్‌ గా అనీస్ బజ్మీ దర్శకత్వంలో గౌరంగ్ దోషీ నిర్మిస్తున్న చిత్రం "ఆంఖే - 2" ప్రారంభోత్సవం ముంబైలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ  మధ్యకాలంలో ఏ సినిమా ప్రారంభోత్సవం ఇంత భారీగా జరగలేదనేది బాలీవుడ్ జనాల టాక్.. దీంతో ఈ సినిమా గురించి తెగ డిస్కషన్ జరుగుతున్నాయి. అయితే ఇంతలోనే ఏమయ్యిందో తెలియదు కానీ.. ఇప్పటివరకూ ఈ సినిమా ప్రారంభోత్సవం - దాని గొప్పతనం గురించి మాట్లాడుకున్న వాళ్లందరూ ఇప్పుడు ఆ విషయం మానేసి - ఇలియానా - చిత్రనిర్మాత గౌరంగ్ గురించి మాట్లాడుకుంటున్నారు! ఈ సినిమా చేస్తానని తాను కమిట్ కాలేదని ఇలియానా అంటుంటే.. ఆమె మాట మారుస్తోందని, అది అబద్దం అని గౌరంగ్ ఆరోపిస్తున్నారు.

ఏమిటి ఈ రచ్చ అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. ఇద్దరూ రెండు రకాలుగా స్పందిస్తున్నారు. ఆంఖే - 2 సినిమాలో తాను నటించడంలేదని, తన అనుమతి లేకుండా తన పేరుని ప్రకటించడమే కాకుండా, వీడియో క్లిప్పింగ్స్‌ ని కూడా ప్రదర్శించడం ఆగ్రహానికి గురి చేసిందని ఇలియానా సన్నిహితులు చెబుతున్నారు. కేవలం సినిమా పబ్లిసిటీ కోసం తన పేరు వాడుకుంటున్నారని ట్విట్టర్ ద్వారా ఇలియానా స్పందించింది. ఇలియానా ట్వీట్ పై స్పందించిన గౌరంగ్... తాను రెండు రోజుల ముందే ఇలియానాను కలిసి.. సినిమాలైన్ - తన క్యారెక్టర్ చెప్పానని - ఆమెకు తెగ నచ్చేసిందని, వారంలో మరో సైన్ చేయాల్సి ఉందని చెప్పాడు. పైగా ఈ సినిమాకు ప్రత్యేకంగా పబ్లిసిటీ అవసరం లేదని, దానికోసం ఇలియానా పేరును వాడుకోవాల్సిన పరిస్థితుల్లో తానులేనని స్పష్టం చేస్తున్నారు.

ఇలా ఇలియానా - గౌరవ్ లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మరి.. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్‌ స్టాప్ పడుతుందో.. లేక మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. కాగా.. ఇలియానా ఈ సినిమా చేయకపోయినా పర్లేదు.. తనకు ఆల్ ది బెస్ట్ అని గౌరంగ్ చివరిగా స్పందించడం కొసమెరుపు.
Tags:    

Similar News