రాజా సాబ్ కు సర్కార్ షాక్ ఇస్తుందా.. ఆ పర్మిషన్ డౌటేనా?
జనవరి 8వ తేదీనే ఈ సినిమా ప్రీమియర్స్ వేయబోతున్నామని ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.;
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'రాజా సాబ్' సినిమాపై మెల్లగా హైప్ అంతకంతకూ పెరిగుతోంది. రిలీజ్ కి చాలా తక్కువ సమయం ఉండడంతో మేకర్స్ గ్యాప్ లేకుండా ప్రమోట్ చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. అయితే రీసెంట్ గా జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ ఫ్యాన్స్ కు ఒక అదిరిపోయే న్యూస్ చెప్పారు.
జనవరి 8వ తేదీనే ఈ సినిమా ప్రీమియర్స్ వేయబోతున్నామని ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. నిర్మాత ప్రకటన చేయడం వరకు బాగానే ఉంది కానీ, అసలు దీనికి తెలంగాణ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే పర్మిషన్ దొరకడం అంత ఈజీగా అనిపించడం లేదు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు రాజా సాబ్ కు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.
గతంలో పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా సమయంలో రెండు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ కు అనుమతులు వచ్చాయి. కానీ ఆ తర్వాత సీన్ మారింది. టికెట్ రేట్లు ఇష్టారాజ్యంగా పెంచేసి ప్రీమియర్స్ వేస్తామంటే కుదరదని హైకోర్టు అక్షింతలు వేసింది. రీసెంట్ గా బాలయ్య 'అఖండ 2' విషయంలో కూడా ఇదే జరిగింది. ప్రభుత్వం జీవో ఇచ్చినా, కోర్టు దాన్ని తప్పుబట్టింది. దీంతో ప్రీమియర్స్, రేట్ల పెంపు విషయంలో గందరగోళం ఏర్పడింది.
దీనికి తోడు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు రీసెంట్ గా చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. అధికారులు తెలియక పర్మిషన్లు ఇస్తున్నారని, ఇకపై రేట్లు పెంచమని గానీ, స్పెషల్ షోలు అడగమని గానీ తమ దగ్గరకు రావద్దని తేల్చిచెప్పారు. సినిమా అనేది సామాన్యుడి వినోదం అని, దాన్ని భారంగా మార్చకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి టైమ్ లో రాజా సాబ్ టీమ్ ప్రీమియర్స్ ప్లాన్ చేయడం సాహసమే.
నిర్మాత విశ్వప్రసాద్ మాత్రం చాలా నమ్మకంతో అనౌన్స్ చేశారు. బహుశా ప్రభుత్వం నుంచి ఏమైనా హామీ లభించిందేమో తెలియదు. కానీ ఒకవేళ పర్మిషన్ రాకపోతే మాత్రం ఫ్యాన్స్ కు అది పెద్ద డిసప్పాయింట్మెంట్ అవుతుంది. హైదరాబాద్ లో ఎర్లీ ప్రీమియర్స్ పడితే ఆ కిక్ వేరుగా ఉంటుంది, కలెక్షన్స్ కూడా భారీగా పెరుగుతాయి. కానీ సర్కార్ రూల్స్ దీనికి అడ్డుపడేలా ఉన్నాయి.
ఏదేమైనా జనవరి 8న ప్రీమియర్స్ ఉంటాయా లేదా అనేది ప్రభుత్వం చేతిలోనే ఉంది. ప్రభాస్ రేంజ్ సినిమా కాబట్టి ఏమైనా మినహాయింపు ఇస్తారా, లేక పేదల ప్రభుత్వం అనే పాలసీకే కట్టుబడి ఉంటారా అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే రాజా సాబ్ ప్రీమియర్స్ వ్యవహారం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా నడుస్తోంది.