డివోషనల్ టచ్ ఇక అక్కడ వర్కవుట్ కాదా?
ఇప్పుడు మన డివోషన్ టచ్ సినిమాల పరిస్థితి కూడా అలాగే తయారవుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రీసెంట్‌గా విడుదలైన `అఖండ 2`నే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.;
ఏదైనా మితంగా తింటేనే ఆహారం..అదే అతిగా తింటే విషమంటారు. కొంత మందేమో ఎక్కదు అంటారు. ఇప్పుడు మన డివోషన్ టచ్ సినిమాల పరిస్థితి కూడా అలాగే తయారవుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రీసెంట్‌గా విడుదలైన `అఖండ 2`నే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రూపొందిన డివోషన్ టచ్ ఉన్న యాక్షన్ డ్రామా `అఖండ 2`. డివోషనల్ అంశాలకు దేశ భక్తిని, సనాతన ధర్మాన్ని జోడీంచి మూవీని తెరెకెక్కించారు.
భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా మూవీగా రిలీజైన `అఖండ 2`కు ఇక్కడే అంతంత మాత్రం ఆదరణ లభిస్తుండగా ఉత్తరాదిలో మాత్రం అది కూడా దక్కడం లేదు. దేశ భక్తి, డివోషనల్ మూవీస్‌కి బ్రహ్మరథం పట్టిన బాలీవుడ్ ప్రేక్షకులు `అఖండ 2`ని మాత్రం పక్కన పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో దక్షిణాదికి చెందిన డివోషనల్ మూవీస్ విషయంలో ఉత్తరాది ప్రేక్షకుల మైండ్ సెట్ మారిందనడానికి ఇది సంకేతమా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
బాహుబలి తరువాత దక్షిణాది చిత్రాలపై ఉత్తరాది ప్రేక్షకులు ఆసక్తిని చూపించడం మొదలు పెట్టారు. ఇదే క్రమంలో విడుదలైన కేజీఎఫ్, పుష్ప వంటి సినిమాలకూ బ్రహ్మరథం పట్టి కాసుల వర్షం కురిపించారు. ఆ తరువాత యాక్షన్‌తో పాటు డివోషనల్ అంశాలని జోడించిన సినిమాలని కూడా భారీ స్థాయిలో ఆదరించడం మొదలు పెట్టారు. కన్నడ యమూవీ `కాంతార`. తెలుగు మూవీ `హనుమాన్`లు ఇదే ఫార్ములాతో రూపొంది ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించాయి.
అయితే తాజాగా ట్రెండ్ మారింది. అక్కడి ప్రేక్షకుల్లోనూ మార్పు వచ్చనట్టుగా కనిపిస్తోంది. `కాంతార 2`, మిరాయ్ సినిమాలే ఇందుకు నిదర్శనం. వీటికి ఉత్తరాదిలో ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదనే చెప్పాలి. ఇక రీసెంట్‌గా విడుదలైన `అఖండ 2` పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ సినిమాలో డివోషనల్ అంశాలతో పాటు దేశ భక్తి ప్రధానంగా సాగినా అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాని పెద్దగా పట్టించుకోవడం లేదు. కారణం డివోషనల్ అంశాలు నచ్చకపోవడం వల్ల కాదు. దాన్ని సరైన పద్దతిలో తీయలేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అంతే కాకుండా `అఖండ 2` తరహాలో యాక్షన్ టచ్‌తో సాగే సినిమాల విషయంలో ఉత్తరాది ప్రేక్షకులు విసుగెత్తిపోయారనే సంకేతాల్ని అందించింది. తాజా పరిణామాల్ని దృష్టిలో పెట్టుకుని ఇకపై దక్షిణాది మేకర్స్ డివోషనల్ టచ్ ఉన్న యాక్షన్ సినిమాలు కాకుండా కంటెంట్ ప్రధానంగా సాగే సినిమాలపై దృష్టిపెడితే ఉత్తరాది ప్రేక్షకులు ఎప్పటిలాగే బ్రహ్మరథం పడతారు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తారు.