నరకం ఏంటో చూసాను ..అది చిన్న విషయం కాదు
విక్కీ మాట్లాడుతూ.." ఈ సన్నివేశాల షూటింగ్ ప్రారంభించిన తర్వాత మూడవ రోజే నేను గాయపడ్డాను. దాంతో నెలన్నర విరామం తీసుకోవాల్సి వచ్చింది.;
ఒకప్పటితో పోల్చుకుంటే ఈమధ్య కాలంలో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. అందుకే సెలబ్రిటీలు ఎంతటి కష్టాన్నైనా అనుభవించక తప్పడం లేదు. ముఖ్యంగా సినిమాలలో పాత్రలు రియలిస్టిక్ గా ఉండడానికి సెలబ్రిటీలు పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక సినిమా షూటింగ్ సమయంలో ఒక హీరో ఏకంగా 12 రోజులపాటు నరకం చూసానని, ముఖ్యంగా గాయాల కారణంగా ఒకటిన్నర నెల సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది అని, కానీ తన కష్టానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
ఆయన ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఛావా. ఈ ఏడాది విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో రష్మిక మందన్న శంభాజీ మహారాజ్ భార్య పాత్రలో తమ అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శంభాజీ మహారాజ్ ను బంధించి చిత్రహింసలు పెట్టే సన్నివేశం సినిమాలో ఎంత కీలకంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఆ సన్నివేశం చేసేటప్పుడు పడ్డ టార్చర్ గురించి విక్కీ పంచుకున్నారు.
విక్కీ మాట్లాడుతూ.." ఈ సన్నివేశాల షూటింగ్ ప్రారంభించిన తర్వాత మూడవ రోజే నేను గాయపడ్డాను. దాంతో నెలన్నర విరామం తీసుకోవాల్సి వచ్చింది. పైగా ఈ సన్నివేశం కోసం వేసిన సెట్ కూడా తీసేసాము. రెండు నెలల గ్యాప్ తీసుకొని మళ్లీ సెట్ చేసి.. దానిపై 12 రోజులు షూటింగ్ జరిపారు. నిజానికి ఇలాంటి సన్నివేశాలు రూపొందించడం అంత సులభం కాదు. ప్రతి ఒక్కరు 100% కష్టపడ్డారు. శంభాజీ మహారాజ్ గురించి ప్రపంచానికి చెప్పాలని అంత కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా ఆ 12 రోజులు నరకం ఏంటో మాకు తెలిసింది" అంటూ విక్కీ తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి
విక్కీకౌశల్ విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడిగా పేరు సొంతం చేసుకున్న తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డుతో పాటు మూడు ఫిలింఫేర్ అవార్డులు అలాగే అనేక ప్రశంసలు అందుకున్నారు. 2019లో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో కూడా స్థానం సంపాదించుకోవడం జరిగింది. 1988 మే 16న బొంబాయి మహారాష్ట్రలో జన్మించిన ఈయన 2021లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ తో ఏడడుగులు వేశారు. ఈ ఏడాది పండంటి కొడుకుకు జన్మనిచ్చారు. ఒకవైపు తండ్రిగా ప్రమోషన్ పొందిన ఈయన.. మరొకవైపు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.