అల్లు అర్జున్- అట్లీ మూవీలో దివ్యభారతి.. ఒక ఫోటోతో క్లారిటీ!

సాధారణంగా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన అమ్మాయికి పాపులారిటీ లభించాలి అంటే.. ఒక మంచి పాత్ర ఆమెకు దక్కాలి.;

Update: 2026-02-02 08:13 GMT

సాధారణంగా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన అమ్మాయికి పాపులారిటీ లభించాలి అంటే.. ఒక మంచి పాత్ర ఆమెకు దక్కాలి. ఒకవేళ ఆ పాత్రలో ఆమె అద్భుతంగా ఒదిగిపోయిందంటే మాత్రం ఓవర్ నైట్ లోనే స్టార్ అవుతుంది. ఇక అలాంటి పాత్ర దొరకలేదు అంటే మాత్రం ఆమె సంవత్సరాల తరబడి ఇండస్ట్రీలోనే ఆ క్రేజ్ కోసం కొనసాగాల్సి ఉంటుంది. అయితే ఇలాంటివి జరగకుండా కేవలం ఒక స్టార్ తో ఆమె ఫోటో దిగి షేర్ చేసినా చాలు ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది అనడంలో సందేహం లేదు. సరిగ్గా ఇలాంటి ఉదాహరణ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ఇండస్ట్రీలోకి యంగ్ బ్యూటీగా అడుగుపెట్టిన దివ్యభారతి ప్రస్తుతం జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ హీరోగా నటిస్తున్న గోట్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. అయితే ఈమెకు పెద్దగా గుర్తింపు లేదు కానీ మొదటిసారి ఈమె అల్లు అర్జున్ తో కలిసి దిగిన ఒక ఫోటో నెట్టింట వైరల్ అవ్వడంతో ఈ దివ్య భారతి కాస్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

పైగా అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్లో వస్తున్న A22xA6 మూవీలో ఈమెకు అవకాశం లభించిందని.. అందుకే అల్లు అర్జున్ తో కలిసి ఫోటో దిగింది అంటూ నెట్టింట చర్చ జోరుగా మొదలైంది. ఇప్పటికే ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.పైగా జాన్వీ కపూర్ , మృణాల్ ఠాగూర్, రష్మిక మందన్న లాంటి హీరోయిన్స్ నటిస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. దీనికి తోడు ఇప్పుడు కొత్త హీరోయిన్లను కూడా ఈ సినిమాలో తీసుకోబోతున్నారు అంటూ వార్తలు రాగా.. అదే సమయంలో అల్లు అర్జున్ తో కలిసి దివ్యభారతి షేర్ చేసిన ఫోటో కొత్త అనుమానాలకు దారితీసింది. దీంతో ఈమె కాస్త ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అలా బలమైన పాత్ర పడకపోయినా సెలబ్రిటీలతో ఫోటోలు దిగి నెట్టింట షేర్ చేసిన చాలు వైరల్ అయిపోతామని నిరూపించింది ఈ ముద్దుగుమ్మ.

ఇక పాపులారిటీ సంగతి పక్కన పెడితే.. అల్లు అర్జున్ సినిమాలో దివ్యభారతి నటిస్తోంది అంటూ వస్తున్న వార్తలు నిజమైతే ఆమె కెరియర్ అమాంతం మారిపోతుంది. కానీ ఇలా వస్తున్న వార్తలలో నిజం లేదు. విషయంలోకి వెళ్తే ప్రస్తుతం అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో భాగంగా దుబాయ్ కి వెళ్లారు. అక్కడి నుంచి కొన్ని ఫోటోలను కూడా పంచుకున్నారు. మరోవైపు దివ్యభారతి కూడా తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో భాగంగా దుబాయ్ కి వెళ్ళింది. అక్కడ ఒక హోటల్లో ఈమె కేక్ కట్ చేస్తూ తీసుకున్న ఫోటోలను , వీడియోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.

అయితే సడన్గా అల్లు అర్జున్ ను ఆమె కలవడంతో ఆయనతో కలిసి దిగిన ఫోటోని ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యాక్సిడెంటల్ గా జరిగిన ఈ కలయిక ఆమెను ఈ సినిమాలో భాగం కాబోతోంది అనేలా రూమర్ క్రియేట్ చేసింది. మొత్తానికైతే ఈ సినిమాలో దివ్యభారతి నటించకపోయినా ఈ ఒక్క ఫోటో విపరీతమైన క్రేజ్ అందించింది అనడంలో సందేహం లేదు. మొత్తానికైతే అల్లు అర్జున్ సినిమాలో దివ్యభారతి అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు అని చెప్పవచ్చు.

Tags:    

Similar News