నాకు ఆ ట్యాగ్ చాలు.. స్టార్ డమ్ పై అడివి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రీసెంట్ గా టీజర్ లాంచ్ మీట్ లో సినిమా విశేషాల కంటే శేష్ చెప్పిన ఒక సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.;
టాలీవుడ్ లో అడివి శేష్ అంటేనే ఒక స్పెషల్ బ్రాండ్. రొటీన్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ, కంటెంట్ బేస్డ్ థ్రిల్లర్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు 'డెకాయిట్' సినిమాతో మరో కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు. రీసెంట్ గా టీజర్ లాంచ్ మీట్ లో సినిమా విశేషాల కంటే శేష్ చెప్పిన ఒక సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హీరోలకు ఉండే బిరుదుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా మన ఇండస్ట్రీలో హీరోలకు ట్యాగ్స్ ఉండటం చాలా కామన్. మెగాస్టార్, పవర్ స్టార్, ఐకాన్ స్టార్, రెబల్ స్టార్.. ఇలా ప్రతి హీరోకి వారి ఇమేజ్ కు తగ్గట్టుగా పేరు ముందు ఒక బిరుదు ఉంటుంది. ఫ్యాన్స్ కూడా తమ హీరోని ఆ ట్యాగ్ తో పిలుచుకోవడానికే ఇష్టపడతారు. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే హీరోలు కూడా తమకంటూ ఒక యునీక్ టైటిల్ ఉండాలని కోరుకుంటారు. అది వారి స్టార్ డమ్ కు నిదర్శనంగా భావిస్తారు.
ఇదే విషయంపై 'డెకాయిట్' టీజర్ లాంచ్ లో అడివి శేష్ కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. వరుస హిట్లు కొడుతున్నారు కదా, మీకంటూ ఒక ప్రత్యేకమైన ట్యాగ్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా అని అడిగారు. దీనికి శేష్ ఇచ్చిన సమాధానం అక్కడ ఉన్నవారందరినీ ఆకట్టుకుంది. తను స్టార్ డమ్ వెంట పడే రకం కాదని, టైటిల్స్ కంటే కంటెంట్ ముఖ్యం అని తన మాటలతో మరోసారి క్లియర్ గా చెప్పేశాడు.
ఆ ప్రశ్నకు శేష్ చాలా కూల్ గా స్పందిస్తూ.. "నాకు చిన్నప్పుడే మా పేరెంట్స్ ఒక ట్యాగ్ ఇచ్చారు. అదే 'అడివి శేష్'. అంతకు మించి నాకు వేరే ట్యాగ్స్ ఏమీ అవసరం లేదు" అని సింపుల్ గా తేల్చి చెప్పేశాడు. హీరోగా తన పేరు ముందు ఎలాంటి స్టార్ అని తగిలించుకోవడం తనకు ఇష్టం లేదని, తన అసలు పేరే తనకు పెద్ద బ్రాండ్ అని ఆయన ఉద్దేశం. ఈ ఆన్సర్ తో అక్కడున్న ఫ్యాన్స్ విజిల్స్ వేశారు.
అంతటితో ఆగకుండా శేష్ మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు. తనకు స్టార్ ట్యాగ్స్ కంటే ఆడియెన్స్ రియాక్షన్ ముఖ్యమని అన్నారు. ఇప్పుడున్న వాళ్లే కాదు, భవిష్యత్తులో మనవళ్లు, మనవరాళ్లు తన సినిమాలు చూసినా కూడా 'వావ్' అని ఆశ్చర్యపోవాలట. ప్రేక్షకుల నోటి నుంచి వచ్చే ఆ 'వావ్' అనే మాటే తనకు అసలైన ట్యాగ్ అని, దాని కోసమే తాను కష్టపడతానని చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడారు. అడివి శేష్ మాటలు చూస్తుంటే ఆయన ఫోకస్ అంతా సినిమా క్వాలిటీ మీదే ఉందని అర్థమవుతోంది.