చిరు ఫారిన్‌, చరణ్ వైజాగ్‌.. ఆచార్య నుండి బయటకు

Update: 2022-05-03 15:34 GMT
చిరంజీవి.. చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా భారీ అంచనాల నడుమ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమాకు ఉన్న ఓ మోస్తరు బజ్ కారణంగా మొదటి మూడు రోజులు యావరేజ్ వసూళ్లను దక్కించుకుంది. వీక్ డేస్ మొదలయ్యాక ఆచార్య సినిమా పరిస్థితి క్లారిటీ వచ్చేసింది. రంజాన్ సెలవు రోజు అయిన మంగళవారం కూడా సినిమాను చూసేందుకు జనాలు థియేటర్లకు రాకపోవడంతో ఆచార్య పనైపోయిందని తేలిపోయింది.

ఆచార్య సినిమా ఫలితం తేలిపోయిన తర్వాత కూడా ఇంకా ప్రమోషన్ చేసుకుంటూ కూర్చుంటే బాగోదనే ఉద్దేశ్యంతో చిరంజీవి మరియు చరణ్ ఇద్దరు కూడా దాని నుండి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నారు. చిరంజీవి ఇటీవలే సురేఖ గారితో ఫారిన్ ట్రిప్ వెళ్లారు. ఆయన అమెరికా వెళ్లినట్లుగా మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. హాలీడే ట్రిప్‌ కు వెళ్తున్నట్లుగా ఆయన స్వయంగా వెళ్లడించారు.

ఇక చరణ్ విషయానికి వస్తే ఆచార్య హ్యాంగోవర్ నుండి వెంటనే ఆయన బయట పడ్డాడు. సినిమా ప్రమోషన్ కోసం చాలా రోజులు కేటాయించిన ఆయన రేపటి నుండి వైజాగ్ లో శంకర్ దర్శకత్వంలో సినిమా షూటింగ్‌ లో జాయిన్ అవ్వబోతున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పలు షెడ్యూల్‌ పూర్తి అయ్యింది. తాజాగా మరో షెడ్యూల్‌ కోసం చరణ్ వైజాగ్‌ వెళ్లాడు.

ఇప్పటికే ఏపీలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ చేశారు. ఇప్పుడు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నారు. చరణ్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. దిల్‌ రాజు ఈ సినిమా ను భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నాడు.

శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు మరియు తమిళంలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తామంటూ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

చరణ్ ఈ సినిమా షూటింగ్‌ ను సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ వరకు పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాను చరణ్ చేయబోతున్నాడు.
Tags:    

Similar News