మ‌రోసారి 12వేల కార్మికుల‌కు సీసీసీ సాయం

Update: 2020-06-19 04:30 GMT
మ‌హ‌మ్మారీ క‌ల్లోలం రోజురోజుకు హైద‌రాబాద్ ని ఒణికిస్తోంది. మెట్రోన‌గ‌రంతో ముడిప‌డి ఉన్న బ‌తుకులు బిక్కుబిక్కుమంటూనే ఉన్నాయి. ఇక్క‌డ జీవ‌నోపాధి కోసం వ‌చ్చిన ఎంద‌రో క‌నీస ఉపాధి క‌రువై తిండికి లేక తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ముఖ్యంగా అసంఘ‌టిత రంగం అయిన సినీరంగంలో వేలాది కార్మికులు రోడ్డున ప‌డ్డారు. అయితే ఈ క‌ష్ట‌కాలంలో ప‌లువురు టాలీవుడ్ సినీప్ర‌ముఖులు స్పందించి స‌హాయం అందించిన సంగ‌తి తెలిసిందే.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఎంతో చొరవ తీసుకొని కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)ని ఏర్పాటు చేసి తెలుగు చిత్ర పరిశ్రమలోని దాదాపు 12000 మంది సినీ కార్మికులకు రోజువారీ నిత్యావసరాలు అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు ద‌ఫాలుగా నిత్యావ‌స‌రాల్ని స‌ర‌ఫ‌రా చేశారు. ఇప్పుడు మూడోసారి కూడా స‌ర‌ఫ‌రా చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ఈ సంద‌ర్భంగా సినీప‌రిశ్ర‌మ‌కు చిరు ఓ వీడియో సందేశం పంపారు. ``లాక్ డౌన్ ఎత్తివేసినా ఇంకా ఫిల్మ్ షూటింగులు ప్రారంభం కాలేదు. ఇది రోజువారీ కూలీలందరి జీవనోపాధిని ప్రభావితం చేసింది. ఇది ఎప్ప‌టివ‌ర‌కూ ఉంటుందో అర్థం కావ‌డం లేదు. మ‌రోసారి సీసీసీ త‌ర‌పున సినీకార్మికుల‌కు నిత్యావ‌స‌రాల్ని పంపిణీ చేయ‌బోతున్నాం`` అని తెలిపారు. ``ఇదివ‌ర‌కూ ఇంటింటికి వెళ్లి అందించ‌డం వ‌ల్ల ఆల‌స్య‌మైంది. ఈసారి లాక్ డౌన్ లేదు కాబ‌ట్టి అన్ని అసోసియేష‌న్ల‌కు నిత్యావ‌స‌రాల్ని అంద‌జేశాం. ప్ర‌తి ఒక్క‌రూ వెళ్లి వాటిని తీసుకోవాలి``... అని చిరు ఆ వీడియోలో కోరారు.

అన్ని రోజులు ఒకేలా ఉండవని .. మ‌హ‌మ్మారీ తీవ్ర‌త త‌గ్గితే తిరిగి షూటింగులు ప్రారంభ‌మై య‌థా స్థితికి వ‌చ్చేస్తామ‌‌ని ఆయ‌న‌ ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని చిరు అన్నారు.
Tags:    

Similar News