బ్రహ్మి పంచులతో అల్లాడించేశాడు

Update: 2018-03-21 08:59 GMT
సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఎంతటి చమత్కారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎన్నో వేదికల మీద తనదైన శైలిలో వినోదం పండించారు. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ‘ఎమ్మెల్యే’ ఆడియో వేడుకలో మాట్లాడుతూ కూడా బ్రహ్మి తన పంచ్ పవర్ మరోసారి చూపించాడు. వేదిక ఎక్కీ ఎక్కగానే సుమ మీద పేలిపోయే పంచ్ విసిరాడు బ్రహ్మి. ‘‘నా చిన్నప్పట్నుంచి చూస్తున్నా.. ఇప్పటికీ అలాగే ఉంది’’ అని బ్రహ్మి అనడంతో సుమ చేతులెత్తి దండం పెట్టేసింది.

తర్వాత మణిశర్మ గురించి మాట్లాడుతూ.. ‘‘ఆయన గురించి మాట్లాడేంత’’.. అన్న బ్రహ్మి కొంచెం ఆగాడు. సుమ వైపు చూస్తూ.. ‘‘ఆయన గురించి మాట్లాడేంత వయసు నాకు లేదని ఆమె వెనుక నుంచి ప్రాంప్టింగ్ ఇస్తోంది.. కానీ మణిశర్మ గురించి మాట్లాడేంత వయసు కాదు.. వాయిస్ నాకు లేదు. ఎందుకంటే సంగీతం గురించి నాబోటి వాడికి ఏం తెలుస్తుంది’’ అనడంతో అందరిలోనూ నవ్వులు పూశాయి. ఇక రామజోగయ్య శాస్త్రి గురించి మాట్లాడుతూ.. ‘‘ఆయన తెలివి తేటలతో కాదు.. తెలుగు తేటలతో కవిత్వం రాస్తారు’’ అన్నాడు బ్రహ్మి.

ఈ సందర్భంలోనే ఎమ్మెస్ నారాయణను గుర్తు చేసుకుంటూ.. తాను ఏదైనా గెటప్ వేసుకుని ఎలా ఉందిరా అని అడిగితే.. తనవైపు చూడకుండానే ‘బాగుంది’ అనేవాడని.. అదేంట్రా చూడకుండానే అలా అన్నావు అంటే.. చూసినా కూడా అలాగే అనాలి కదా అనేవాడని బ్రహ్మి చెప్పి అందరినీ నవ్వించాడు. కొన్ని రోజుల కిందట ‘గాయత్రి’ ఆడియో వేడుకలోనూ బ్రహ్మి ఇలాగే నవ్వించాడు. గత కొన్నేళ్లుగా బ్రహ్మి కామెడీ తెరమీద అనుకున్న స్థాయిలో పండట్లేదు కానీ.. ఇలాంటి వేదికలెక్కినపుడు మాత్రం బ్రహ్మి తనదైన శైలిలో పంచులతో కడుపుబ్బ నవ్వించేస్తున్నాడు.

Tags:    

Similar News