నాగ‌చైత‌న్య కోసం ఒక లైలా..!

పూజా ఓకే అయితే ఒక లైలా కోసం త‌ర్వాత చైత‌న్య‌తో ఇది రెండో అవ‌కాశంగా భావించాల్సి ఉంది.

Update: 2024-04-29 15:30 GMT

నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం తండేల్ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కార్తికేయ 2 ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ అత్యంత భారీగా విడ‌ద‌ల కానుంది. 20 డిసెంబర్ 2024న థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతుంది. ఇది పాన్ ఇండియాలో అన్ని ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలోను విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నాగ‌చైత‌న్య మొద‌టిసారి ఒక మ‌త్స్య‌కారుడిగా పూర్తి మాస్ అవ‌తార్‌లో క‌నిపించ‌నున్నారు. అత‌డి లుక్ తో పాటు భాష యాస‌, వేష‌ధార‌ణ ప్ర‌తిదీ ఆస‌క్తిని క‌లిగించాయి.

శ్రీకాకుళంలోని మత్స్యకార సమాజం నిజ జీవితంలోని అనుభవాల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. చైతన్య పాత్ర, ఒక మత్స్యకారుడు.. అతను ప్రమాదవశాత్తూ పాకిస్తానీ జలాల్లోకి ఇరుక్కుపోయాక‌... ఆ దేశంలో బంధీ అవుతాడు. అత‌డి రాక కోసం ఎదురు చూపులు చూసే అమ్మాయిగా సాయిప‌ల్ల‌వి న‌టిస్తోంది. దాయాది దేశం పాక్ బందిఖానాలో అతడి పోరాటాల చుట్టూ కథ తిరుగుతుంది. జింగ్ వీల్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నాగ చైతన్య నిజ జీవిత క‌థ‌తో ప్రేరణ గురించి మాట్లాడారు. ఇది 2018లో జరిగిన ఒక వాస్తవ సంఘటన నుండి తీసుకున్న క‌థాంశమ‌ని తెలిపారు. అతని పాత్ర ప్రయాణం, పాకిస్తానీ జైలులో కటకటాల వెనుక ఏడాదిన్నర గడిపిన స‌మ‌యంలో ఏం జ‌రిగింద‌నేది తెర‌పై క‌నిపిస్తుంది. ఈ కథకు కేంద్ర బిందువుగా ల‌వ్ ఎలిమెంట్ కూడా ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని తెలిపారు. ఈ చిత్రం ఒక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా.. గొప్ప భావోద్వేగాలతో మాస్ అంశాల‌తో ఆక‌ట్టుకుంటుంది.

Read more!

 

పూజా హెగ్డే క‌థానాయిక‌...

తండేల్ నిర్మాణంలో ఉండగానే చైతు విరూపాక్ష సినిమాతో పేరు తెచ్చుకున్న కార్తీక్ దండుతో మరో ప్రాజెక్ట్ కి పచ్చజెండా ఊపేశాడు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఇందులో క‌థ‌నాయిక ఎవ‌ర‌నేది ఇప్ప‌టివ‌ర‌కూ స‌స్పెన్స్. తాజా స‌మాచారం మేర‌కు పూజా హెగ్డే ఈ చిత్రంలో నటించవచ్చని ఇటీవలి పుకార్లు సూచిస్తున్నాయి. అక్టోబర్ 2024లో చిత్రీకరణ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే పూజా ఈ చిత్రంలో న‌టిస్తుందా లేదా? అన్న‌దానిపై అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. పూజా ఓకే అయితే ఒక లైలా కోసం త‌ర్వాత చైత‌న్య‌తో ఇది రెండో అవ‌కాశంగా భావించాల్సి ఉంది. ఈ చిత్రానికి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌నుంది.

Tags:    

Similar News