మహమ్మారి భయంతో సినీనిర్మాతలు వెనకడుగు వేస్తున్నారా..?

Update: 2020-06-22 05:15 GMT
కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ఇక సినీ పరిశ్రమ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. థియేటర్స్ అన్నీ మూసివేయబడ్డాయి. షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆపివేశారు. మళ్లీ మంచి రోజులు అంటే సినిమా థియేటర్‌లోకి వచ్చేది ఎప్పుడో చెప్పడం ఎవరితరం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ నిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. నిజం ఏంటంటే.. ఈ కరోనా మహమ్మారి వలన తీవ్రంగా దెబ్బతిన్న సినిమా పరిశ్రమలోని నటులంతా ఇంట్లో పనిలేకుండా కూర్చుని, కరోనా సంక్షోభం ముగిస్తే బాగుండు అని వేచి చూస్తున్నారు. వాస్తవానికి, పెద్ద హీరోలు, సెలబ్రిటీలు కొన్ని నెలలు పని లేకపోయినా ఉండగలుగుతారు. కాని చిన్న చిన్న పాత్రలు వేసే కళాకారులు వారి కుటుంబాలను పోషించడానికి పగలురాత్రి కష్టపడుతున్నారు. దేశంలో నెలలు గడిచిపోతున్న ఈ మహమ్మారి రోజురోజుకి పెరుగుతూనే ఉంది. పేదలు.. కార్మికులు.. ఆర్టిస్టులు.. చిన్న సినిమాల నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం సినిమా షూటింగులకు అనుమతి ఇచ్చినా కొన్ని నిబంధన విధించింది. కానీ కొన్ని సినిమాలు షూటింగ్స్ ప్రారంభించినా ఇప్పుడు మళ్లీ ఆపే ఆలోచనలో పడ్డాయట. ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. బయటికి రావాలంటే భయపడిపోతున్నారు. అయితే రాను రాను పరిస్థితి ఎలా ఉంటుందో ఊహకు కూడా అందడం లేదు. ఎలాంటి సినిమా నిర్మాతలు అయినా జాగ్రత్తలు తప్పనిసరి. కానీ ప్రొడక్షన్ ఖర్చు భారీగా మీద పడుతుంది. ఒకవేళ కస్టపడి సినిమా తీసినా థియేటర్లో రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. ఇంతకాలం పెద్ద సినిమాల నిర్మాతలతో పాటు చిన్న సినిమాల నిర్మాతలు కూడా ఉత్సాహంగా ఎదురు చూసారు. కానీ మహమ్మారి వలన మళ్లీ షూటింగ్స్ ఆపేద్దామనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి బడా నిర్మాతలు తట్టుకుంటారు.. కానీ చిన్న నిర్మాతలే కాస్త వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారట.
Tags:    

Similar News