ఇరాన్ (Vs) యుఎస్ : వారో జోన్‌లో చిక్కుకున్న‌ సినీతార‌ల్లో హైటెన్ష‌న్

వీరంతా తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తూ.. త్వరగా బయటపడాలని కోరుకుంటున్నారు.;

Update: 2026-03-01 05:44 GMT

ప్రస్తుతం పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలల మధ్య భారతీయ సెలబ్రిటీలు, ముఖ్యంగా సినీ తారలు చిక్కుకుపోవడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇరాన్ తో అమెరికా-ఇజ్రాయేల్ కూటమి భీకర పోరు న‌డుమ‌ గల్ఫ్ దేశాల గగనతలం యుద్ధ క్షేత్రంగా మారింది. విమాన సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోవడంతో షూటింగ్‌ల కోసం లేదా వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయా దేశాల మీదుగా ప్రయాణిస్తున్న మన తారలు ప్రాణభయంతో క్షణమొక యుగంగా గడుపుతున్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితులు భారతీయ సినీ పరిశ్రమను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి.

భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందని త‌న సోష‌ల్ మీడియా పోస్టులు చెబుతున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన పీవీ సింధు అక్కడ జరుగుతున్న క్షిపణి దాడులు,యు వైమానిక దాడుల ధాటికి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానాశ్రయం సమీపంలో వినిపిస్తున్న భారీ విస్ఫోటనాల శబ్దాలు తనను కలచివేస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. తన టీమ్‌తో కలిసి సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నానని.. ప్రస్తుత భయంకర వాతావరణం వర్ణనాతీతమని సింధు రాసిన సుదీర్ఘ నోట్ అభిమానులను కలిచివేస్తోంది. సింధు మాత్ర‌మే కాదు, ప‌లు విదేశీ విమానాశ్ర‌యాల‌లో చిక్కుకుపోయిన సినీతార‌లు, ఇత‌ర సెల‌బ్రిటీలు త‌మ ఆందోళ‌న‌ను సోష‌ల్ మీడియాల్లో పోస్టో చేయ‌డంతో భార‌త‌దేశంలో క‌ల‌వ‌రం మొద‌లైంది.

తెలుగు ప్రేక్షకులకు లెజెండ్, డిక్టేటర్ వంటి సినిమాలతో సుపరిచితురాలైన యువ‌క‌థానాయిక‌ సోనాల్ చౌహాన్ కూడా ఇదే యుద్ధ వలయంలో చిక్కుకున్నారు. ఒక ప్రైవేట్ ఈవెంట్ నిమిత్తం దుబాయ్‌కు వెళ్లిన సోనాల్ యుద్ధం మొదలైన వెంటనే అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. త‌ను ఉంటున్న హోటల్ పరిసర ప్రాంతాల్లోనే పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ప్రాణభయం నీడలో గడుపుతున్నాన‌ని సోనాల్ తెలిపారు. ప్రస్తుతం సోనాల్ అక్కడి భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ.. సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడానికి మార్గాలను వెతుకుతున్నారు. అలాగే `యముడికి మొగుడు` ఫేమ్ రిచా పనాయ్ కూడా ఒక షూటింగ్ షెడ్యూల్ కోసం వెళ్లి గగనతలం మూసివేయడంతో పశ్చిమాసియాలోనే చిక్కుబడిపోయారు.

వీరితో పాటు ఒడియా హీరో సురజ్ కుమార్, బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా త‌దిత‌రులు ఈ యుద్ధ మేఘాల మధ్య చిక్కుకున్నట్లు సమాచారం. సురజ్ కుమార్ విమానాల మళ్లింపు కారణంగా ఒక సురక్షితం కాని ప్రాంతంలో నిలిచిపోగా.. రణ్‌దీప్ హుడా తన షూటింగ్ నిమిత్తం వెళ్లిన చోటే ఉండిపోయారు. కేవలం నటీనటులే కాకుండా.. సుమారు 40 మందికి పైగా భారతీయ సినిమా సాంకేతిక నిపుణులు, లైట్ బాయ్స్, మేకప్ ఆర్టిస్టులు దుబాయ్, ఇరాన్ సరిహద్దుల్లో చిక్కుకుపోయి అల్లాడుతున్నారు. వీరంతా తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తూ.. త్వరగా బయటపడాలని కోరుకుంటున్నారు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత విదేశాంగ శాఖ (ఎంఇఏ) అత్యంత వేగంగా స్పందించడం గమనార్హం. దుబాయ్, టెహ్రాన్ (ఇరాన్), టెల్ అవీవ్‌లలో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ప్రారంభించింది. యుద్ధ క్షేత్రంలో ఉన్న సెలబ్రిటీలు, ఇతర పౌరులు ఎవరూ కూడా హోటల్ గదుల నుండి బయటకు రావద్దని, స్థానిక అధికారుల ఆదేశాలను క‌చ్చితంగా పాటించాలని కఠినమైన భద్రత సూచనలు జారీ చేసింది. భారత రాయబార కార్యాలయాలు నిరంతరం అక్కడ ఉన్న వారితో టచ్‌లో ఉంటూ వారికి ధైర్యాన్ని ఇస్తున్నాయి.

భారత ప్రభుత్వం ప్రస్తుతం ఒక భారీ `ఎయిర్ లిఫ్ట్` ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది. యుద్ధ పరిస్థితులు కాస్త సద్దుమణిగి, విమాన ప్రయాణాలకు అనుమతులు లభించిన వెంటనే, గతంలో చేపట్టిన `వందే భారత్` మిషన్ తరహాలో ప్రత్యేక విమానాల ద్వారా మన సినీ తారలను, ఇతర భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి రంగం సిద్ధమైంది. యుద్ధ క్షేత్రం నుండి మన సెలబ్రిటీలు ఎప్పుడు క్షేమంగా తిరిగి వస్తారా? అని దేశవ్యాప్తంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు.

Tags:    

Similar News