పాత్ర కోసం ఎంతకైనా: 'పెద్ది' కోసం చరణ్- మహావతార్ కోసం విక్కీ
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులు ఎంతోమంది ఉన్నా.. ఎంచుకున్న పాత్ర కోసం నెలల తరబడి శ్రమిస్తూ తమ శరీరాకృతిని సైతం మార్చుకునే నటులు చాలా అరుదుగా ఉంటారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులు ఎంతోమంది ఉన్నా.. ఎంచుకున్న పాత్ర కోసం నెలల తరబడి శ్రమిస్తూ తమ శరీరాకృతిని సైతం మార్చుకునే నటులు చాలా అరుదుగా ఉంటారు. టాలీవుడ్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్... బాలీవుడ్‌లో టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ ఈ తరహా అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తారు. ఇరు పరిశ్రమల్లో ఎంతో కష్టపడే స్వభావం ఉన్న ఈ ఇద్దరు హీరోలు.. నిజ జీవితంలో మంచి స్నేహితులు కూడా కావడం విశేషం. ఇటీవల ఈ ఇద్దరూ తాము నటించే పాన్-ఇండియా సినిమాల కోసం తీవ్రంగా శ్రమించడం చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారింది.
దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన `పెద్ది` చిత్రం కోసం రామ్ చరణ్ ఎంతగా కష్టపడ్డారో కళ్లారా చూసాం. చరణ్ అహోరాత్రలు శ్రమించి వెయిట్ గెయిన్ అయి సరికొత్త లుక్‌లోకి మారారు. పాత్రలో స్వాభావికత కోసం, గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాకి తగ్గట్టుగా చరణ్ తన శరీరాకృతిని మలుచుకున్నారు. మరోవైపు బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ కూడా తన తదుపరి పౌరాణిక చిత్రం `మహావతార్` కోసం దాదాపు 25 కేజీలకు పైగా బరువు పెరగడానికి సిద్ధమవుతున్నారు. `పెద్ది` చిత్రం కోసం రామ్ చరణ్ పడిన కష్టాన్ని తలపించేలా ఇప్పుడు విక్కీ కౌశల్ కూడా అదే స్థాయిలో శ్రమిస్తుండటం గమనార్హం.
`మహావతార్` సినిమాలో విక్కీ కౌశల్ అత్యంత పరాక్రమవంతుడైన విష్ణుమూర్తి అవతారం `పరశురాముడి` పాత్రలో కనిపించనున్నారు. పురాణాల్లో పరశురాముడిని విల్లు, గొడ్డలి (పరశువు) చేతబట్టిన శక్తిమంతుడిగా, అమరత్వంతో కూడిన మహోన్నత వ్యక్తిగా వర్ణించారు. ఆ దివ్యమైన, బలిష్టమైన రూపానికి న్యాయం చేసేందుకే విక్కీ ఈ భారీ మేకోవర్‌కు శ్రీకారం చుడుతున్నారు. గతంలో `ఛావా` సినిమాలోని ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్ర కోసం తన బరువును 80 కేజీల నుండి 105 కేజీలకు పెంచిన విక్కీ.. ఈ సారి పరశురాముడి పాత్ర కోసం అంతకుమించి బలిష్టంగా మారేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
ఈ భారీ రూపాంతరం కోసం విక్కీ కౌశల్ మరోసారి తన పాత ఫిట్‌నెస్ కోచ్ తేజస్ లల్వానీతో జతకట్టారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచే మొదలయ్యే ఈ శిక్షణలో భాగంగా స్క్వాట్స్, డెడ్‌లిఫ్ట్స్, బెంచ్ ప్రెస్ వంటి కాంపౌండ్ ఎక్సర్‌సైజులపై దృష్టి సారించనున్నారు. అలాగే న్యూట్రిషనిస్ట్ ఆల్కేష్ శరోత్రీ పర్యవేక్షణలో రోజూవారీ క్యాలరీల వినియోగాన్ని 250 నుండి 500 క్యాలరీల వరకు పెంచి.. ప్రోటీన్లు, పొడిపప్పులు, డైరీ ఉత్పత్తులతో కూడిన ప్రత్యేక డైట్ తీసుకోనున్నారు. కండరాల రికవరీ కోసం రోజుకు 8 గంటల నిద్ర - ప్రతి మజిల్ గ్రూప్‌కు 48 గంటల విశ్రాంతిని కేటాయించనున్నారు.
చిత్ర పరిశ్రమలో సాంకేతికత ఎంత పెరిగినా ఒక నటుడు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి పడే కష్టమే ఆ సినిమాను విజయతీరాలకు చేరుస్తుంది. టాలీవుడ్‌లో `పెద్ది` చిత్రం కోసం రామ్ చరణ్ చూపించిన డెడికేషన్, బాలీవుడ్‌లో `మహావతార్` కోసం విక్కీ కౌశల్ పడుతున్న శ్రమ సినిమాపై వారికున్న ఫ్యాషన్ ని తెలియజేస్తోంది. రామ్ చరణ్, విక్కీ కౌశల్ వంటి అంకితభావం ఉన్న నటులు.. రెండు వేర్వేరు చిత్ర పరిశ్రమల్లో భారతదేశపు గొప్ప కథలను వెండితెరపై ఆవిష్కరించేందుకు పడుతున్న ఈ తపన నిజంగా ప్రశంసనీయం.