'జుమాంజి 3' కొత్త ట్రైలర్‌పై నెటిజన్ల‌ హంగామా.. సోషల్ మీడియాలో రచ్చ!

హాలీవుడ్ పాపులర్ అడ్వెంచర్ ఫ్రాంఛైజీ `జుమాంజి` నుంచి ఇప్పుడు మరో కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Update: 2026-07-30 18:10 GMT

హాలీవుడ్ పాపులర్ అడ్వెంచర్ ఫ్రాంఛైజీ `జుమాంజి` నుంచి ఇప్పుడు మరో కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ వేగంగా వైరల్ అవుతుండటంతో దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రెడిట్, యూట్యూబ్ వేదికలుగా సినీ ప్రియులు ఈ ట్రైలర్‌ను విశ్లేషిస్తూ వేస్తున్న జోక్స్, కామెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ముఖ్యంగా రెడిట్ థ్రెడ్స్‌లో ఈ సినిమా కథాంశంపై నెటిజన్లు రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తూ కామెంట్ల‌తో చెల‌రేగుతున్నారు. ఈసారి పాత్రలు జుమాంజి గేమ్‌లోకి వెళ్తున్నాయా లేక జుమాంజీయే బయటి ప్రపంచంలోకి వస్తోందా? అని ఒక నెటిజ‌న్ ప్రశ్నించగా... ఈ సినిమాలో రెండూ జరుగుతున్నాయని మరొకరు సమాధానమిచ్చారు. అంతేకాకుండా.. హీరో డ్వేన్ జాన్సన్ (ది రాక్) నటనపై భిన్నమైన వాదనలు నడుస్తుండగా... నటుడు జాక్ బ్లాక్ విభిన్న పాత్రలను ఇమిటేట్ చేస్తున్న తీరుకి ఈసారి ఆస్కార్ నామినేషన్ ఇచ్చినా తప్పులేదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మరొకవైపు యూట్యూబ్ కామెంట్ సెక్షన్ అయితే కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ సినిమాలో డ్వేన్ జాన్సన్ పాత్రను చూసి ``అడవి రాక్ దగ్గర ఉంది కానీ, రాక్ అడవిలో లేడు`` అంటూ నెటిజన్లు ఫన్నీ జోక్స్ వేస్తున్నారు. అలాగే గతంలో కెవిన్ హార్ట్ చేసిన రోస్టింగ్ కి ప్రతీకారంగానే ఈ సినిమాలో రాక్ అతన్ని ఒక చిన్న పిల్లాడి పాత్రలో, తనను ఒక తల్లి పాత్రలో నటించేలా ప్లాన్ చేశాడంటూ కామెంట్స్ అదరగొడుతున్నాయి.

ఈ సినిమాలో గేమ్ క్యారెక్టర్లు నిజ ప్రపంచంలోకి వచ్చి `999 పింగ్` నెట్‌వర్క్ ఉన్నట్టు నడవడం, ప్రవర్తించడం అనే కాన్సెప్ట్ ఫ్రాంఛైజీకి సరికొత్త ఆకర్షణగా నిలిచిందని ప్రేక్షకులు భావిస్తున్నారు. డిసెంబర్ 25 క్రిస్మస్ కానుకగా `జుమాంజి: ఓపెన్ వరల్డ్`తో పాటు `అవేంజర్స్: డూమ్స్‌డే` కూడా రాబోతుండటంతో ఈ బాక్సాఫీస్ వార్ వల్ల తమ జేబులు ఖాళీ అవ్వడం ఖాయమని అభిమానులు మీమ్స్ డిజైన్ చేస్తున్నారు.

సాధారణంగా ఒకే తరహా పాత్రలు చేస్తారనే పేరున్న ది రాక్, జాక్ బ్లాక్ వంటి నటులు ఈ చిత్రంలో పిల్లలుగా, తల్లులుగా తమ యాక్టింగ్ వేరియేషన్స్ చూపించడం విశేషం. మొత్తం మీద ఈ చివరి గేమ్‌లో రచ్చ మామూలుగా ఉండేలా లేదని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. మరి ఈ క్రేజీ అడ్వెంచర్ ట్రైలర్‌లో ఉన్న ఉత్కంఠ సినిమా ఆద్యంతం ఉంటుందా లేదా అన్న‌ది వేచి చూడాలి.


Full View


Tags:    

Similar News