OTP చెప్పిన వెంటనే ఖాతా ఖాళీ.. యూట్యూబర్ ఆవేదన!

ఫోన్ కాల్ అటెండ్ చేయగానే వరుసగా మెసేజ్‌లు వచ్చి నిమిషాల వ్యవధిలోనే ఖాతాలోని డబ్బులన్నీ ఖాళీ అయ్యాయని చెప్పారు.

Update: 2026-07-30 12:20 GMT

ప్రముఖ యూట్యూబర్ దొర సాయి తేజ అర్ధరాత్రి పోస్ట్ చేసిన ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఒక్క OTP, ఆ వెంటనే వచ్చిన ఒక ఫోన్ కాల్ వల్ల తన అకౌంట్ నుంచి ఏకంగా రూ.15 లక్షలు మాయమయ్యాయని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. నెలల తరబడి కష్టపడి సంపాదించిన సొత్తు క్షణాల్లో ఆవిరైపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ ఘటన వెనుక ఉన్న విశ్లేషణ ఏంటో చూద్దాం.

అర్ధరాత్రి వీడియో.. కలవరపడే ఆవేదన:

సాయి తేజ పోస్ట్ చేసిన వీడియోలో ఆయన ముఖంలో స్పష్టంగా ఆందోళన కనిపిస్తోంది. ఫోన్ కాల్ అటెండ్ చేయగానే వరుసగా మెసేజ్‌లు వచ్చి నిమిషాల వ్యవధిలోనే ఖాతాలోని డబ్బులన్నీ ఖాళీ అయ్యాయని చెప్పారు. ఇక తన ఫ్యామిలీ, టీమ్ భవిష్యత్తు ఏమవుతుందోనని పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తున్నాయని చెప్పారు. ఈ వీడియో బయటకు రాగానే నెటిజన్లు, ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.

అనుమానాలు.. విశ్లేషణలు:

అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్క ఫోన్ కాల్ మాట్లాడగానే లేదా OTP రాగానే రూ.15 లక్షలు ఎలా పోతాయనేది సాంకేతికంగా పెద్ద ప్రశ్న. ఇక ఏదైనా మాల్వేర్ లింక్ క్లిక్ చేశారా, స్క్రీన్ షేరింగ్ యాప్ ఏమైనా ఇన్స్టాల్ అయ్యిందా? అనే కోణంలో సైబర్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక మరోవైపు, ఇటీవల కాలంలో ప్రమోషన్స్ కోసం ఇలాంటి స్టంట్స్ ఎక్కువవుతున్నందున, ఇది నిజంగా జరిగిన సైబర్ నేరమా లేక ఏదైనా ప్రమోషనల్ వీడియోనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అప్రమత్తత ఉన్పప్పటికీ ఆగని నేరాలు:

పోలీసులు, బ్యాంకింగ్ అధికారులు ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరగాళ్లు సరికొత్త దారుల్లో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇక సెలబ్రిటీలు, ఐటీ నిపుణులు సైతం ఈ సైబర్ వలలో చిక్కుకోవడం గమనార్హం. ఇక కేవైసీ అప్‌డేట్, లాటరీ, రివార్డ్ పాయింట్ల పేరుతో నమ్మించి డిజిటల్ దోపిడీకి పాల్పడుతున్నారు. సైబర్ క్రిమినల్స్ ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారో ఈ సంఘటన మరొకసారి గుర్తుచేస్తోంది.

చట్టపరమైన చర్యలు అవసరం:

డబ్బులు పోయిన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ కు ఫిర్యాదు చేయడం లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో రిపోర్ట్ చేయడం చాలా ముఖ్యం. ఇక దొర సాయి తేజ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.

దొర సాయి తేజ వీడియో వెనుక ఉన్న అసలు నిజం ఏంటో త్వరలోనే బయటపడాల్సి ఉంది. ఇది నిజమైన మోసమైనా లేక ఏదైనా కాన్సెప్ట్ వీడియో అయినా, ఒక విషయం మాత్రం స్పష్టం. మన డిజిటల్ భద్రత మన చేతుల్లోనే ఉంది. ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా వచ్చే తెలియని లింక్‌లు, OTPల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండటమే సైబర్ మోసాల నుంచి తప్పించుకునే ఏకైక మార్గం.

Tags:    

Similar News