ఆ ముగ్గురికీ ఇచ్చి ప‌డేసిన వివాదాల క్వీన్ కంగ‌న‌

తాజా ఇంటర్వ్యూలో కంగన మాట్లాడుతూ.. ఒక న‌టిగా లేదా నిర్మాత‌గా తన ప్రమాణాలు అంత తక్కువగా లేవంటూ ఈ ముగ్గురు దిగ్గజాలపై సెటైర్లు వేశారు. కరణ్ జోహార్ వంటి వారు ఇండస్ట్రీని ఏలుతున్న తీరును కంగ‌న‌ ఎండగట్టారు.;

Update: 2026-03-01 07:11 GMT

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. వివాదాల క్వీన్ కంగనా రనౌత్ మరోసారి తన పాత శత్రువులపై విరుచుకుపడ్డారు. హిందీ చిత్ర పరిశ్రమలో `నెపోటిజం మాఫియా`గా అభివర్ణించే కరణ్ జోహార్, ఆదిత్య చోప్రాల‌పై తీవ్రంగా విరుచుకుప‌డుతూనే, త‌న స్నేహితుడు అని చెప్పుకునే అనురాగ్ కశ్యప్ ని టార్గెట్ చేయ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆ ముగ్గురిపై కంగన చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా మారాయి. గతంలో త‌న శ‌త్రువుల‌పై విమర్శల దాడులు కొన‌సాగించిన‌ క్వీన్ ఇప్పుడు మరోసారి తనదైన శైలిలో విరుచుకుప‌డ‌డం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తాజా ఇంటర్వ్యూలో కంగన మాట్లాడుతూ.. ఒక న‌టిగా లేదా నిర్మాత‌గా తన ప్రమాణాలు అంత తక్కువగా లేవంటూ ఈ ముగ్గురు దిగ్గజాలపై సెటైర్లు వేశారు. కరణ్ జోహార్ వంటి వారు ఇండస్ట్రీని ఏలుతున్న తీరును కంగ‌న‌ ఎండగట్టారు. ముఖ్యంగా ప్రతిభ ఉన్న బయటి వ్యక్తులను తొక్కేస్తున్నారంటూ కంగ‌న చేసిన విమ‌ర్శ‌లు పాత గాయాలను మళ్ళీ రేపాయి. కంగన తన కెరీర్ ఆరంభం నుండి ఈ ప్ర‌ముఖుల‌తో ఏదో ఒక విషయంలో గొడవపడుతూనే ఉన్నారు.. కానీ ఈసారి వివాదాల క్వీన్ మాట‌ల తూటాల్లో వాడి వేడి మరింత పెరిగింది.

లొంగ‌దీసుకోవాల‌ని చూసారు!

ముఖ్యంగా కరణ్ జోహార్‌ను `నెపోటిజం జెండా మోసే వ్యక్తి`గా గతంలోనే అభివర్ణించిన కంగన.. ఇప్పుడు ఆయన నిర్మించే చిత్రాల నాణ్యతను కూడా ప్రశ్నించారు. అలాగే యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రాతో తనకున్న విభేదాలను కంగ‌న‌ మరోసారి గుర్తు చేశారు. తనను `లొంగదీసుకోవాలని చూసిన వారు` ఇప్పుడు ఎక్కడున్నారో చూసుకోమని హెచ్చరిస్తూ.. స‌ద‌రు వ్య‌క్తుల‌ అహంకారాన్ని దెబ్బతీసేలా మాట్లాడారు. ఇండస్ట్రీలో ఒకరిద్దరు వ్యక్తుల చేతుల్లోనే అధికారం ఉండకూడదని కంగ‌న వాదించారు.

మిత్రుడికి కూడా కోటింగ్:

మరోవైపు ఒకప్పుడు తనకు మిత్రుడిగా ఉన్న అనురాగ్ కశ్యప్‌ను కూడా కంగన వదలలేదు. ఆయన సిద్ధాంతాలు, సినిమాలు ఇప్పుడు దిగజారిపోయాయని కంగ‌న‌ ఎద్దేవా చేశారు. అనురాగ్ కశ్యప్ వంటి వారు కేవలం సోషల్ మీడియాలో నీతులు చెబుతారని.. కానీ వాస్తవంలో వారు కూడా మాఫియాలో భాగమేనని ఆరోపించారు. ఈ ముగ్గురు కలిసి బాలీవుడ్ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని.. వారి వద్దకు వెళ్లి అవకాశాలు అడిగేంత తక్కువ స్థితిలో తాను లేనని కుండబద్దలు కొట్టారు.

ప‌దే ప‌దే టార్గెట్ అయ్యారు...

కంగన ఈ ముగ్గురిని పదే పదే టార్గెట్ చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని త‌న మద్దతుదారులు భావిస్తున్నారు. తాను న‌టించిన‌ `ఎమర్జెన్సీ` వంటి చిత్రాల విడుదలకు అడ్డంకులు సృష్టించడం.. త‌న‌ను ఒంటరిని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని గట్టిగా నమ్ముతున్నారు కంగ‌న‌. అందుకే ఎప్పుడు అవకాశం దొరికినా `మూవీ మాఫియా ముఠా` అంటూ విరుచుకుపడుతున్నారు.

ఈ దెబ్బ‌కు ఫినిష్...

మొత్తానికి కంగనా రనౌత్ ఫిరంగి దాడి ఇప్పుడు బాలీవుడ్‌లో మరో యుద్ధానికి తెరలేపింది. కరణ్, ఆదిత్య చోప్రా, అనురాగ్ ఈ విమర్శలపై స్పందిస్తారా లేదా మౌనంగానే ఉండిపోతారా? అనేది వేచి చూడాలి. కంగన మాత్రం తన పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని.. ఇండస్ట్రీలో మార్పు వచ్చే వరకు తాను గొంతు ఎత్తుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ వివాదాల క్వీన్ దెబ్బకు ఆ ముగ్గురు సినీపెద్ద‌లు మరోసారి డిఫెన్స్‌లో పడ్డారనే చెప్పాలి.

Tags:    

Similar News