ఫిబ్రవరి బాక్సాఫీస్.. ఇలా జరిగిందేంటి?
ఎన్నో సినిమాలు షెడ్యూల్ అవ్వడంతో దాదాపు ఫిక్స్ అయిపోయారు. కానీ ఫిబ్రవరి మాత్రం ఆశలు తారుమారు చేసింది.;
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఈ ఏడాది జనవరి ఇచ్చిన జోష్ మామూలుగా లేదు. వరుస విజయాలతో థియేటర్లు కళకళలాడాయి. విభిన్న కథలతో వచ్చిన సంక్రాంతి సినిమాలతోపాటు వివిధ చిత్రాలు మంచి వసూళ్లు సాధించడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లలో ఓ రేంజ్ లో ఉత్సాహం నెలకొంది. అలా 2026 భారీ హిట్స్ తో దూసుకెళ్తుందని అంతా అంచనా వేశారు.
అదే సమయంలో ఫిబ్రవరి లో కూడా జనవరి ఇచ్చిన జోష్ కొనసాగుతుందని అందరూ భావించారు. ఎన్నో సినిమాలు షెడ్యూల్ అవ్వడంతో దాదాపు ఫిక్స్ అయిపోయారు. కానీ ఫిబ్రవరి మాత్రం ఆశలు తారుమారు చేసింది. వరుసగా సినిమాలు విడుదలైనప్పటికీ ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా కంటెంట్ లేకపోవడం అందుకు ప్రధాన కారణం.
గత నెలలో వచ్చిన సినిమాలన్నింటిలో యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ఒక్కటే పర్లేదనిపించినా పెద్దగా కలెక్షన్లు సాధించలేకపోయింది. రీసెంట్ గా రెండు రోజుల క్రితం శ్రీ విష్ణు హీరోగా వచ్చిన విష్ణు విన్యాసం ప్రస్తుతం మోస్తరు టాక్ తో నడుస్తోంది. మిగతా చిత్రాలన్నీ మాత్రం బాక్సాఫీస్ వద్ద తేలిపోయాయి. అనుకున్న రేంజ్ లో అస్సలు వసూళ్లు సాధించలేకపోయాయి.
అయితే సీనియర్ దర్శకుడు గుణశేఖర్ గ్యాప్ తర్వాత తీసిన యుఫోరియాపై ఉన్న హైప్ బాక్సాఫీస్ వద్ద కనబడలేదు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ఫంకీ మూవీపై మంచి అంచనాలు ఉన్నా రిజల్ట్ అనుకున్నట్లు రాలేదు. అర్జున్ సర్జా సీతా పయనం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. హానీ మూవీ ఆశించిన స్థాయిలో అలరించలేదు. డీసెంట్ టాక్ వచ్చిన శ్రీ చిదంబరం గారు సినిమాకు కూడా థియేటర్లలో సరైన స్పందన దక్కలేదు.
ఆ తర్వాత సుహాస్ నటించిన హై బల్వంత్ మూవీ.. ఆడియన్స్ లో రిలీజ్ కు ముందే హైప్ క్రియేట్ చేసినా.. విడుదలయ్యాక పరిస్థితి మారిపోయింది. వారం రోజుల్లోనే థియేటర్ల నుంచి సినిమా మాయమైంది. వీటన్నింటితోపాటు అనేక చిన్న సినిమాలు వచ్చి వెళ్లిపోయినా ప్రేక్షకులకు గుర్తుండే స్థాయి ప్రభావం చూపలేకపోయాయి. అలా ఫిబ్రవరి అంతా డ్రైగా సాగిపోయిందని చెప్పాలి.
ఏదేమైనా ఫిబ్రవరి నెల టాలీవుడ్ బాక్సాఫీస్ ను పూర్తిగా నిరాశపరిచింది. ఒక్క సూపర్ హిట్ కూడా లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఇప్పుడు అందరి చూపు మార్చి నెలపై పడింది. రాబోయే పలు సినిమాలు బాక్సాఫీస్ కు మళ్లీ ఊపు తెస్తాయా లేదా అన్నది ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. కానీ ఫిబ్రవరి నెల మాత్రం టాలీవుడ్ కు డ్రై సీజన్ గానే మిగిలిపోయింది. మరి మార్చిలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.