'ఆచార్య'తో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు 'గాడ్ ఫాదర్' రైట్స్..?

Update: 2022-05-05 03:30 GMT
మెగా తండ్రీకొడుకులు చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటించిన ''ఆచార్య'' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బయ్యర్లకు భారీ నష్టాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

మూడు దశాబ్దాలు టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉన్న మెగాస్టార్.. 1100 కోట్లకు పైగా వసూళ్ళు అందుకున్న సినిమాలో భాగమైన మెగా పవర్ స్టార్.. వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ కొట్టి అపజయం ఎరుగని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కలిసి చేసిన 'ఆచార్య' పై మొదటి నుంచీ అందరిలో అంచనాలున్నాయి.

గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆచార్య' సినిమాకు మొదటి ఆటతోనే నెగెటివ్ టాక్ రావడంతో.. నాలుగో రోజుకే థియేటర్స్ నుండి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. వీకెండ్ ముగియకుండానే షోలు క్యాన్సిల్ అవడంతో.. ఇది చిరంజీవి కెరీర్ లోనే మాయని మచ్చ అని సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ దృష్ట్యా 'ఆచార్య' సినిమాను భారీ రేట్లకు కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అన్ని ఏరియాల్లోనూ నష్టాలు తప్పవని అర్థం అవుతోంది. అయితే ఇప్పుడు కొరటాల అండ్ టీమ్ బయ్యర్లను ఆదుకోవాలని నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తోంది.

'ఆచార్య' సినిమాని రిలీజ్ చేసిన ప్రాంతాల్లో నైజాం - సీడెడ్ భారీ డెఫిసిట్ లు కనిపిస్తున్నాయి. వెస్ట్ - ఈస్ట్ - నెల్లూరు - గుంటూరు ప్రాంతాల బయ్యర్లకు ఎంతో కొంత వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. రెస్టాఫ్ ఇండియా - ఓవర్సీస్ లెక్కలు ఉండనే ఉన్నాయి. సెటిల్ మెంట్ చేయాలనుకుంటే.. అన్నీ కలిపి 30 - 40 కోట్లు దాకా ఇవ్వాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

'ఆచార్య' సినిమా నిర్మాణానికి దాదాపు 100 కోట్లు అయిందని సమాచారం. ఈ రెండేళ్లలో వడ్డీలు 50 కోట్ల వరకూ ఉన్నాయి. దర్శక హీరోలు రెమ్యునరేషన్ తీసుకోలేదు కాబట్టి.. వాళ్ళ ఖర్చులు మరియు ఇతరత్రా లెక్కలు కలుపుకొని 20 కోట్ల వరకూ ఉండొచ్చు. ఇలా మొత్తం సినిమాకు 170 కోట్ల వరకు లెక్క తేలుతోంది.

అయితే ఈ సినిమా బిజినెస్ 210 కోట్ల వరకు చేసిందని ప్రచారంలో ఉంది. అంటే మేకర్స్ దాదాపు 30 - 40 కోట్లు మిగులు ఉంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని బయ్యర్లకు సర్దుబాటు చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇకపోతే 'ఆచార్య' సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు చిరంజీవి కూడా అండగా నిలవాలని నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగా వాళ్ళకి తన నెక్స్ట్ సినిమా 'గాడ్ ఫాదర్' రైట్స్ ఇవ్వాలని చిరు ప్లాన్ చేస్తున్నారట. కానీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఆ హక్కులను తీసుకోవడానికి ఇష్టపడటంలేదట. ఆచార్యకు పరిహారం ఇస్తే అదే చాలని అంటున్నారట.
Tags:    

Similar News