సంగీతంలో AI ప్రమాదాలతో తస్మాత్ జాగ్రత్త
ఇటీవలి కాలంలో ఏఐ సాంకేతికత అన్ని రంగాలపైనా ప్రభావం చూపుతోంది. ఇది లక్షల్లో ఉద్యోగాలను తొలగిస్తోంది.;
ఇటీవలి కాలంలో ఏఐ సాంకేతికత అన్ని రంగాలపైనా ప్రభావం చూపుతోంది. ఇది లక్షల్లో ఉద్యోగాలను తొలగిస్తోంది. అన్ని పరిశ్రమల్లో ఆందోళనలకు కారణమవుతోంది. మ్యూజిక్ ఇండస్ట్రీపైనా దీని ప్రభావం స్పష్ఠంగా కనిపిస్తోంది. అయితే, ఏఐ సాంకేతికతను ఉపయోగించి అరకొర జ్ఞానంతో మిడిసిపాటు ప్రమాదకరమని ఇప్పుడు ఆస్కార్ విజేత, స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ వ్యాఖ్యానించారు. ఏఐ ఉపయోగించి డర్టీ పాటల్ని అందిస్తున్నారని, ప్రముఖ గాయకుల స్వరాలను ఏఐలో సృష్టిస్తున్నారని, దీనిని నియంత్రించాలని రెహమాన్ పిలుపునిచ్చారు. ఏఐ వినియోగంతో శ్రోతల్లో గందరగోళం తలెత్తుతుందని కూడా ఆయన అన్నారు.
ఆసక్తికరంగా గతంలో రెహమాన్ `లాల్ సలామ్` కోసం `తమిరి యెజుడా..` పాటకు ఇద్దరు దివంగతులైన సీనియర్ గాయకుల స్వరాల్ని ఏఐలో రీక్రియేట్ చేసారు. దీనిపై చాలా విమర్శలొచ్చాయి. మరణించిన గాయకుల స్వరాలను పునరుద్ధరించడానికి ఏఐను ఉపయోగించడంలో నైతికపరమైన చిక్కులను నెటిజనులు ప్రశ్నించారు.
అందుకే ఇప్పుడు ఏఐ సాంకేతికత వినియోగంలో బాధ్యత, సున్నితత్వం, జాగ్రత్తల గురించి రెహమాన్ నొక్కి చెబుతున్నారు. లాల్ సలామ్‌లో దివంగత గాయకుల గొంతులను పునరుద్ధరించడానికి AIని ఉపయోగించడానికి వారి కుటుంబీకుల అనుమతి తీసుకున్నామని, దానికి పరిహారం చెల్లించామని కూడా రెహమాన్ తెలిపారు. సంగీతంలో ఏఐపై జాగ్రత్త వహించాలని రెహమాన్ కోరారు. ఏఐ వినియోగంతో చాలా చిక్కులు ఉన్నాయని ఆయన అన్నారు. ఏఐని మంచికి ఉపయోగించాలని చెడు కోసం ఉపయోగించకూడదని రెహమాన్ సూచించారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. తదుపరి మణిరత్నం `థగ్ లైఫ్`కి రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ 5న భారతదేశం అంతటా థియేటర్లలో విడుదల కానుంది.