వారి గురించి దేవుడిని ప్రార్థిస్తా : రెహమాన్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన సుదీర్ఘ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి విడాకులు తీసుకునేందుకు సిద్ధం అయిన సమయంలో చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు;
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన సుదీర్ఘ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి విడాకులు తీసుకునేందుకు సిద్ధం అయిన సమయంలో చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు. ఈ వయసులో రెహమాన్ విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏంటో అంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన వారు చాలా మంది ఉన్నారు. వేరే అమ్మాయి ప్రేమలో ఉన్న రెహమాన్ భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడని కూడా కొందరు కామెంట్ చేశారు. మొత్తానికి రెహమాన్ విడాకుల విషయమై చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు. ఆయన మాత్రం ట్రోల్స్ గురించి పెద్దగా పట్టించుకోకుండా, తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ తనపై వచ్చిన విమర్శలపై, తనను ట్రోల్ చేసిన వారి గురించి స్పందించాడు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి జీవితాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అనుకుంటారు. వారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆసక్తిని కనబర్చుతూ ఉంటారు. వారిని ఆకాశానికి ఎత్తే విధంగా ప్రశంసించడంతో పాటు, కొన్ని సార్లు విమర్శిస్తూ ఉంటారు. సెలబ్రెటీల జీవితంలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా సహజం. నేను కూడా జీవితంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని నాకు తెలుసు. నేను ఒకరి గురించి తప్పుగా మాట్లాడితే వారు నా గురించి తప్పుగా మాట్లాడుతారని తెలుసు. నా కుటుంబంను ఎవరైనా విమర్శిస్తే నేను తీసుకోలేను. అందరికీ కుటుంబాలు ఉంటాయి. అందుకే నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడను. ఎవరైనా నా గురించి తప్పుగా మాట్లాడితే వారిని సరైన మార్గంలో నడిపించమని దేవుడిని ప్రార్థిస్తాను అన్నాడు.
తన వైవాహిక జీవితంలో అనుకోని కుదుపుపై రెహమాన్ స్పందించాడు. వైవాహిక జీవితం 30 ఏళ్లకు చేరుతుందని సంతోషిస్తున్న సమయంలోనే అనూహ్యంగా మార్పు వచ్చింది. కలిసి ఉండలేమని జీవితంలో ఇకపై కలిసి ముందుకు నడవలేమని తెలిసింది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో విడిపోవాల్సి వచ్చిందని రెహమాన్ అన్నాడు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో మా ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులు అంతా మా వ్యక్తిగత విషయాల పట్ల గోప్యతను అర్థం చేసుకుని, అన్ని విధాలుగా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. త్వరలోనే ప్రస్తుత పరిస్థితులు అన్నీ సర్ధకుంటాయని ఆశిస్తున్నాను అంటూ రెహమాన్ చెప్పుకొచ్చారు.
ఆస్కార్ అవార్డ్ గ్రహీత రెహమాన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆయన గతంలో సౌత్ సినిమాలతో పోల్చితే నార్త్ సినిమాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన సౌత్ సినిమాలకు ఎక్కువ వర్క్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న 'పెద్ది' సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. అంతే కాకుండా ధనుష్ హీరోగా రూపొందుతున్న ఒక సినిమాకు సైతం రెహమాన్ సంగీతాన్ని అందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ సంగీత దర్శకుడిగా మాత్రం ఆయన జోరు కంటిన్యూ అవుతూనే ఉంది.