రూ.5 కోట్లు ఎక్కువ పెట్టి ఉంటే... సత్య సర్వనాశనం!
బాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను రూపొందించిన దర్శకుల్లో అనురాగ్ కశ్యప్, రామ్ గోపాల్ వర్మ ముందు ఉంటారు.;
బాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను రూపొందించిన దర్శకుల్లో అనురాగ్ కశ్యప్, రామ్ గోపాల్ వర్మ ముందు ఉంటారు. వీరిద్దరూ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. బాలీవుడ్ పై కోపంతో వీరిద్దరూ పూర్తిగా సౌత్ సినిమాలు చేస్తున్నారు. వీరు హిందీ సినిమాలతో దూరంగా ఉన్నప్పటికీ వీరికి బాలీవుడ్‌తో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. అందుకే రెగ్యులర్‌గా బాలీవుడ్ మీడియాలో వీరిద్దరూ కనిపిస్తూ ఉన్నారు. ఎక్కువ శాతం వీరిద్దరు వేరు వేరుగా మీడియాలో హాట్ టాపిక్‌గా ఉంటారు. కానీ తాజాగా వీరిద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇద్దరు ఫైర్ బ్రాండ్ డైరెక్టర్స్ ఒకే ఇంటర్వ్యూలో కనిపించడంతో హాట్ టాపిక్‌గా మారింది.
ఇండియా టీవీ ఫిల్మీ హస్టిల్‌లో అనురాగ్ కశ్యప్, రామ్ గోపాల్ వర్మ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి వారు కామెంట్స్ చేశారు. హిట్ సినిమాలను ఎక్కువగా ఫాలో అవుతున్నారని, ఒక సినిమా హిట్ అయితే, అదే ఫార్ములాతో మరిన్ని సినిమాలను తీసుకు రావడం, అదే జోనర్‌లో ఎక్కువ బడ్జెట్‌తో సినిమాను చేయడం వంటివి చేస్తున్నారు. తద్వారా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని వీరిద్దరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ట్రై చేయాలి అనుకునే వారికి బాలీవుడ్‌లో స్కోప్ లేకుండా పోయిందని, అన్ని చోట్ల కూడా ఏదో ఒక ఫార్ములాను తీసుకుని మేకింగ్ చేస్తున్నారని వీరు అన్నారు.
రామ్ గోపాల్ వర్మ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... బాహుబలి సినిమా తర్వాత అన్ని భాషల ఫిల్మ్ మేకర్స్ భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతే కాకుండా బాహుబలి తరహాలో భారీ వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఉండే విధంగా స్క్రిప్ట్ ను ఎంపిక చేస్తున్నారు. కథ అనుసారంగా కాకుండా ఇష్టానుసారంగా బడ్జెట్‌ను ఖర్చు చేయడం ద్వారా నిర్మాతలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. అనవసరంగా వీఎఫ్ఎక్స్ కి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్న వారు చాలా మంది ఉన్నారని వర్మ చెప్పుకొచ్చాడు. తాను చేసిన సత్య సినిమాకు మరో రూ.5 కోట్లు ఎక్కువ ఖర్చు చేసి ఉంటే కచ్చితంగా సినిమా ఫలితం అనేది సర్వనాశనం అయ్యే ఉండేదని వర్మ అన్నాడు.
మరో దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ... ఇటీవల కాలంలో సినిమాల్లో హింసాత్మక సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. యానిమల్ సినిమా విషయానికి వస్తే హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. రక్తపాతం సన్నివేశాలు శృతి మించి ఉన్నాయి. యానిమల్ సినిమాకు యాక్షన్ సన్నివేశాలు శృతి మించడం కలిసి వచ్చింది. అందుకే ఆ సినిమా రూ.900 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. అదే ఫార్ములను చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు వాడుతున్నారు.
అవసరం ఉన్నా.. లేకున్నా కూడా యాక్షన్ సన్నివేశాలను బలవంతంగా చొప్పించే ప్రయత్నంను చాలా మంది చేస్తున్నారు. వారు ఎంచుకుంటున్న రూటు చూసి నాకు భయం వేస్తుందని అన్నాడు. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై ఈ ఇద్దరు దర్శకులు అసహనం వ్యక్తం చేశారు. అనురాగ్ కశ్యప్ నటుడిగా సౌత్ సినిమాలు చేస్తున్నాడు. తెలుగు లోనూ ఈయన ఒక సినిమాను చేస్తున్నాడు. ముందు ముందు మరిన్ని సినిమాలు సౌత్‌లోనే చేసే అవకాశాలు ఉన్నాయి.