కేన్స్2025.. తన లుక్ తో క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య
ఐశ్వర్యారాయ్ అందాల గురించి, ఆమె ఫ్యాషన్ ఎంపికల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి ఈవెంట్ కు అయినా ఐశ్వర్య హాజరైందంటే అందరూ ఆమె గురించి, ఆమె ఫ్యాషన్ గురించే మాట్లాడుకునేలా చేయడం తన స్పెషాలిటీ.;
ఐశ్వర్యారాయ్ అందాల గురించి, ఆమె ఫ్యాషన్ ఎంపికల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి ఈవెంట్ కు అయినా ఐశ్వర్య హాజరైందంటే అందరూ ఆమె గురించి, ఆమె ఫ్యాషన్ గురించే మాట్లాడుకునేలా చేయడం తన స్పెషాలిటీ. రీసెంట్ గా ఐశ్వర్య కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025కు హాజరై మరోసారి అందరి చూపునూ తనవైపుకు తిప్పుకోవడంతో పాటూ అందరినీ తన లుక్ తో ఎట్రాక్ట్ చేస్తోంది.
ఐశ్వర్య మొదటిసారి 2002లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లోకి అడుగుపెట్టింది. అప్పట్నుంచి ఆమె ప్రతీ సంవత్సరం రెడ్ కార్పెట్ పై చేసే హంగామా అంతా ఇంతా కాదు. ప్రతీ ఏడాదీ ఐశ్వర్య తన కాస్ట్యూమ్స్ తో వార్తల్లో నిలుస్తూనే వస్తుంది. ఐశ్వర్యా రాయ్ ను ఇలాంటి ఈవెంట్స్ లో మరింత అందంగా చూపించడానికి ఎంతోమంది ఫ్యాషన్ దిగ్గజాలు సైతం ప్రయత్నిస్తూ ఉంటారు.
ఐశ్వర్య లాంటి సెలబ్రిటీ తమ బట్టలను ధరించిందంటే వారికి కూడా ఎక్కువ డిమాండ్, క్రేజ్ ఏర్పడుతుందనే ఉద్దేశంలో ఎంతోమంది ఫ్యాషనిస్టులు ఆమె వెంటపడుతుంటారు. ప్రతీసారీ తన ఫ్యాషన్ ఎంపికలతో తన గురించి మాట్లాడుకునేలా చేసిన ఐశ్వర్యా రాయ్ ఈ ఇయర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై కనిపించి మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈసారి ఐశ్వర్య భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా వైట్ శారీలో మెరిసింది. నుదుటిన సింధూరం పెట్టుకుని వైట్ శారీలో ఐశ్వర్య కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఐశ్వర్య 2002లో కూడా ఇలానే తొలిసారి చీరకట్టులో కేన్స్ ఫెస్టివల్ కు హాజరైంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఐశ్వర్య ధరించిన శారీను డిజైన్ చేయగా, దాంతో పాటూ మెడలో 500 క్యారెట్ల మొజాంబిక్ కెంపులు, డైమండ్స్ తో రూపొందించిన నెక్లెస్ ను కూడా ఐశ్వర్య ధరించి తన లుక్ ను మరింత రాయల్ లుక్ గా మరల్చుకుంది.
అయితే ఈసారి ఐశ్వర్య నుదుటిన సిందూరం పెట్టుకుని హాజరవడానికి కారణం రీసెంట్ గా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఉగ్ర వాదులపై చేసిన ఆపరేషన్ సిందూర్ అని అంటున్నారు. ఆపరేషన్ సిందూర్ కు ప్రతీకగానే ఐశ్వర్య ఇలా నుదుటిన సిందూర్ తో వచ్చిందని కొందరు భావిస్తుండగా, గత కొన్నాళ్లుగా ఐశ్వర్య తన భర్త అభిషేక్ బచ్చన్ నుంచి విడిపోతుందని వస్తున్న వార్తలకు చెక్ పెట్టడానికే ఐశ్వర్య ఈ విధంగా నుదుటిన సిందూర్ ను ధరించిందని మరికొందరంటున్నారు.