నిజంగా రూ.120 కోట్ల డీల్‌ వదులుకున్నారా?

కానీ ఆమీర్‌ ఖాన్‌ మాత్రం ఈ సినిమా థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం తీశాను, ఎన్ని కోట్లు ఇచ్చినా ఓటీటీ హక్కులను నాలుగు వారాల తర్వాత ఇచ్చేది లేదని చెప్పాడట.;

Update: 2025-06-18 09:38 GMT

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమీర్‌ ఖాన్‌ 'సితారే జమీన్‌ పర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జూన్‌ 20న విడుదల కాబోతున్న ఈ సినిమాను ఓటీటీలో ఇప్పట్లో విడుదల చేయరట. ఈ విషయాన్ని స్వయంగా ఆమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాను కేవలం థియేటర్‌లో స్క్రీనింగ్‌ చేయడం కోసం తీశామని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమా థియేటర్‌లో ఈ సినిమాను చూసినట్లయితేనే మంచి ఫీల్‌ ఉంటుంది అని అమీర్‌ పేర్కొన్నారు. థియేట్రికల్‌ రిలీజ్ అయిన దాదాపు ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కి వస్తుందని ఆయన పేర్కొన్నాడు. ఈ సినిమాలో ఆయన హీరోగా నటించడం మాత్రమే కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించాడు.

ఆర్‌ ఎస్‌ ప్రసన్న దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఆమీర్‌ ఖాన్‌ సూపర్‌ హిట్‌ సినిమా అయిన తారే జమీన్‌ పర్‌ కి సీక్వెల్‌ అంటూ ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో ఈ సినిమా ఒక సినిమాకు రీమేక్ అనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఆమీర్‌ ఖాన్‌ నటించిన సినిమా కావడంతో దేశ వ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి. దశాబ్ద కాలంగా ఆమీర్‌ ఖాన్‌కి హిట్‌ పడలేదు. ఆయన హిట్‌ కోసం చకోరా పక్షి మాదిరిగా ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాతో అయినా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమీర్‌ ఖాన్‌ ఈ సినిమాకు షాడో డైరెక్ట్‌గానూ వ్యవహరించాడని తెలుస్తోంది. మొత్తానికి ఆమీర్‌ ఖాన్‌ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుని ఉన్నాడు.

ఈ మధ్య కాలంలో చాలా మంది నిర్మాతలు విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీ స్ట్రీమింగ్‌కి హక్కులు ఇచ్చేస్తున్నారు. కొందరు నిర్మాతలు ఏకంగా మూడు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమీర్‌ ఖాన్‌ మాత్రం ఈ సినిమాను ఎనిమిది వారాల వరకు స్ట్రీమింగ్‌ కు ఇచ్చేది లేదని అన్నాడట. ప్రముఖ ఓటీటీ సంస్థ ఒకటి ఈ సినిమాకు ఏకంగా రూ.120 కోట్ల ఆఫర్‌ ఇచ్చిందట. థియేట్రికల్‌ రిలీజ్ అయిన మూడు లేదా నాలుగు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కి ఇస్తే రూ.120 కోట్లు ఇస్తామని డీల్‌ ఆఫర్‌ చేసిందట. కానీ ఆమీర్‌ ఖాన్‌ మాత్రం ఈ సినిమా థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం తీశాను, ఎన్ని కోట్లు ఇచ్చినా ఓటీటీ హక్కులను నాలుగు వారాల తర్వాత ఇచ్చేది లేదని చెప్పాడట.

ప్రస్తుతం ఈ విషయం గురించి హిందీ మీడియాలో ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది. సోషల్‌ మీడియాలో ఒక వర్గంకు చెందిన బాలీవుడ్‌ మీడియా ప్రముఖంగా ఈ విషయం గురించి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇదంతా కూడా మేకర్స్ పీఆర్‌ స్ట్రాటజీ అనే వారు ఉన్నారు. బాలీవుడ్‌లో ఈ తరహా ప్రచారం ఈ మధ్య కాలంలో ఎక్కువ అయింది. అందుకే ఇందులో నిజం ఎంత అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే అన్ని కోట్ల ఆఫర్‌ను ఆమీర్‌ ఖాన్‌ తిరష్కరించాడు అంటే కచ్చితంగా ఆయన రియల్‌ సూపర్ స్టార్‌ అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎనిమిది వారాల తర్వాతే చేయాలని సినీ ప్రేమికులు కోరుతున్నారు. కేవలం ఈ సినిమాకు మాత్రమే కాకుండా అన్ని సినిమాలను కూడా విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయాలని నెటిజన్స్ కోరుతున్నారు.

Tags:    

Similar News