రుషికొండ ప్యాలెస్ దశను మార్చేలా కూటమి డెసిషన్
| విశాఖలోని రుషికొండ ప్యాలెస్‌ను అంతర్జాతీయ స్థాయి లగ్జరీ హోటల్‌గా మార్చాలని ఏపీ కూటమి ప్రభుత్వం భావిస్తోంది. పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. టాటా, లీలా ప్యాలెస్ సహా తొమ్మిది సంస్థలు ఆసక్తి చూపినట్లు సమాచారం. అంతకుముందు నాలుగు నెలల పాటు ప్రజల సందర్శనకు ప్యాలెస్‌ను తెరవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
విశాఖలో రుషికొండ మీద వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపుగా నాలుగు వందల కోట్లకు పైగా ఖర్చుతో తొమ్మిది నుంచి పది ఎకరాలలో నిర్మించిన ప్యాలెస్ విషయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. దీంతో ఈ ప్యాలెస్ దశ దిశ మొత్తం మారిపోతాయని అంటున్నారు. రానున్న కాలంలో ఈ రుషికొండ ప్యాలెస్ కళకళలాడడం మాత్రమే కాదు, జనాలతో కిటకిటలాడడం తధ్యమని అంటున్నారు. ఇంతకీ కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది అంటే దీనిని పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ తరహాలో అంతర్జాతీయ స్థాయి స్టార్ హోటల్ గా మార్చాలని అనుకుంటోంది. ఈ మేరకు బిడ్లను పిలిచి అందులో ఎంపిక అయిన ప్రైవేటు సంస్థలకు ఈ ప్యాలెస్ ని అప్పగించాలని చూస్తోంది అని అంటున్నారు.
లగ్జరీ హొటల్ గా :
విశాఖ చూస్తే నంబర్ వన్ సిటీగా ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ఎన్నో ప్రభుత్వ ప్రైవేట్ పరిశ్రమలు విశాఖ చుట్టూ వస్తున్నాయి. అలాగే దేశంలోని ప్రముఖులు వీవీఐపీలు విశాఖకు తరచూ వస్తున్నారు. అలాగే పర్యాటకులు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని బ్రహ్మాండమైన లగ్జరీ హోటల్ గా రుషికొండను మార్చాలని చూస్తోంది అని అంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆతిథ్య రంగంలో ప్రముఖులను ఈ ప్యాలెస్ అప్పగించేందుకు ఆహ్వానిస్తోంది. అయితే ఇప్పటికే హొటల్ రంగంలో దిగ్గజ సంస్థలు అయినవి ఈ ప్యాలెస్ ని తీసుకోవడానికి ముందుకు వచ్చినట్లుగా చెబుతున్నారు. అందులో టాటా గ్రూప్, ది లీలా ప్యాలెస్, అట్మాస్ఫియర్ కోర్ వంటి ప్రముఖ సంస్థలతో కలిపి మొత్తం తొమ్మిది కంపెనీలు తమ సంసిద్ధతను వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
మరింతగా విస్తరించాలని :
ఇక ఈ రుషికొండ ప్యాలెస్ ని ఇలాగే కాకుండా మరింతగా విస్తరించాలన్నది కూడా ప్రభుత్వం ఆలోచనగా ఉంది. అందుకే మరో నాలుగు ఎకరాలను కూడా ఈ ప్యాలెస్ దక్కించుకున్న సంస్థలకు కేటాయిస్తారు అని అంటున్నారు. దాంతో ఈ హొటోల్ తో పాటు అక్కడ అదనంగా దాదాపు 150 వరకూ సూపర్ లగ్జరీ గదులను నిర్మించేలా చర్యలు చేపడతారు. ఇలా చేయడం వల్ల జాతీయ అంతర్జాతీయ పర్యాటకులు వచ్చినపుడు వారికి బస చేసేందుకు వీలుగా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే పర్యాటక రంగానికి ఈ ప్రాజెక్ట్ ఊతం ఇస్తుందని కూడా అంచనా వేస్తున్నారు.
ఆదాయమార్గంగా :
ఒక వైపు విశాఖ టూరిజానికి ఊతంగా ఉండేలా చూసుకుంటూనే మరో వైపు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఈ ప్యాలెస్ ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పీపీపీ విధానం ఎంచుకుంది అని అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన దాని ప్రకారం చూస్తే ఈ ప్యాలెస్ కొంత మేరకే ఉపయోగపడుతుంది. అందుకే అదనంగా మరో నాలుగు ఎకరాలు ఇవ్వడం ద్వారా రూపురేఖలను మరింతంగా మార్చాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఇవన్నీ బిడ్ ద్వారా దక్కించుకున్న సంస్థ చేపడుతుంది.
ముందుగా సందర్శకుల కోసం :
ఇదిలా ఉంటే రుషికొండ మీద ప్యాలెస్ అనే అంశం జనాలలో నలుగుతూ వస్తోంది. విశాఖలో ఉన్న వారికి కూడా దీనిని చూసే భాగ్యం అయితే ఇంతవరకు దక్కలేదు. అందుకే కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ని పీపీపీకి ఇచ్చే ముందు విశాఖ వాసులతో పాటు సందర్శకులు అందరికీ చూపించాలని అనుకుంటోంది. నాలుగు నెలల పాటు ప్రజా సందర్శనకు ఈ ప్యాలెస్ ని తెరచి ఉంచుతారు. అందుకోసం ప్రత్యేకంగా ప్రవేశ రుసుము నిర్ణయించే అవకాశం ఉందని అంటున్నారు. దీని వల్ల సాధారణ ప్రజలు, పర్యాటకులు ఈ ప్యాలెస్ ని చూస్తారు అని అంటున్నారు. ఇక సందర్శన వేళలతో పాటు టికెట్ ఎంత విధించాలన్న దాని మీద స్పష్టత వచ్చాక ఈ ప్యాలెస్ తెరచుకుంటుంది అని అంటున్నారు.