ఏ ప్లేస్ లో ఆడడం ఇష్టం..? సంజూ మోహన్ లాల్ శాంసన్ రిప్లై అదుర్స్
అన్నీ ఓపెనర్ గానే చేశాడు. కానీ, అతడికి ఆ స్థానం ఖాయం కాదు. టెస్టు కెప్టెన్ శుబ్ మన్ గిల్ టి20ల్లోకి రావడంతో సంజూ త్యాగం చేయాల్సి వచ్చింది;
రెండు మ్యాచ్ లలో అసలు బ్యాటింగే రాలేదు... మరో మ్యాచ్ లో వన్ డౌన్... ఇంకో మ్యాచ్ లో ఐదో స్థానం.. చివరిగా జరిగిన మ్యాచ్ లో అసలు బ్యాటింగ్ కే దింపలేదు...! ఇదీ ఆసియా కప్ లో టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ పరిస్థితి..! దీంతో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పై అభిమానులు మండిపడుతున్నారు. మరి దీనికి సంజూ సమాధానం ఏమిటి..? అతడి ఆలోచనలు ఎలా ఉన్నాయి...? బుధవారం బంగ్లాదేశ్ తో మ్యాచ్ ముగిశాక కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం చూస్తే తెలుస్తోంది.
అన్ని స్థానాల్లోనూ...
సంజూ శాంసన్ టి20ల్లో మూడు సెంచరీలు కొట్టాడు. అన్నీ ఓపెనర్ గానే చేశాడు. కానీ, అతడికి ఆ స్థానం ఖాయం కాదు. టెస్టు కెప్టెన్ శుబ్ మన్ గిల్ టి20ల్లోకి రావడంతో సంజూ త్యాగం చేయాల్సి వచ్చింది. టి20 కెప్టెన్ సూర్య ఉండడంతో వన్ డౌన్ ఖాళీ లేదు. ఆ తర్వాత హైదరాబాదీ తిలక్ వర్మ కారణంగా నాలుగో స్థానంలోనూ అవకాశం రావడం లేదు. దీంతో ఐదో స్థానంలో దిగాల్సి వస్తోంది. ఆరు వికెట్లు కోల్పోయినప్పటికీ బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో ఆ చాన్స్ కూడా రాలేదు. గతంలోనూ సంజూ పలుసార్లు ఇలాంటి అనుభవం ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ ముగిశాక సంజూతో మంజ్రేకర్ మాట్లాడుతూ మూడు సెంచరీలు చేసిన నువ్వు అన్నీ ఓపెనర్ గానే చేశావని అనుకుంటా..? అసలు నీకు ఏ స్థానం కంఫర్ట్ అంటూ అడిగాడు.
నాకిష్టం వన్ డౌన్.. కానీ ఎక్కడైనా ఆడతా..
మంజ్రేకర్ అడిగిన దానిని ప్రశ్నగా అనుకుంటున్నానని చెబుతూ.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రస్తావన తెచ్చాడు శాంసన్. పరోక్షంగా తన బ్యాటింగ్ ప్లేస్ గురించి చర్చకు సమాధానమా? అన్నట్లుగా మాట్లాడాడు. ఇటీవలే మోహన్ లాల్ కు భారత చలన చిత్ర పరిశ్రమ అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు వచ్చిన సంగతిని గుర్తుచేశాడు. ఆయన 40 ఏళ్లుగా నటిస్తున్నారని, తాను పదేళ్లుగా టీమ్ ఇండియాకు ఆడుతున్నానని తెలిపాడు. కేవలం హీరో (ఓపెనర్) పాత్రలనే వేయాలను అనుకోవడం లేదని, కమెడియన్, విలన్ ఇలా విభిన్నమైన రోల్స్ పోషించాలని ఉందని అన్నాడు. ఓపెనర్ గానే ఆడతానని అనడం లేదని, తనకు ఇష్టమైన స్థానం వన్ డౌన్ అని శాంసన్ చెప్పుకొచ్చాడు. అయితే, మిగతా స్థానాల్లోనూ ఎందుకు ప్రయత్నాలు చేయకూడదు?.. నేను కూడా మంచి విలన్ అవుతా..! అంటూ.. ‘సంజూ మోహన్ లాల్ శాంసన్’ అని నవ్వేశాడు.
ఒక జవాబులో ఎన్ని కోణాలో...?
శాంసన్ ఇచ్చిన పై జవాబులో అనేక అంశాలు ఉన్నాయని అనిపిస్తోంది. ఉదాహరణకు బంగ్లాదేశ్ తో సూపర్ 4 మ్యాచ్ లో ఆల్ రౌండర్ శివమ్ దూబెను వన్ డౌన్ లో పంపారు. కానీ, సంజూను అసలు దింపనే లేదు. దీనిని పైకి చెప్పకున్నా.. తనకు వన్ డౌన్ అంటే ఇష్టమనే సంజూ వ్యాఖ్యల్లో తెలిసిపోతోంది. తనను కమెడియన్ తరహాలో ట్రీట్ చేస్తున్నారని.. విలన్ ను కూడా చేస్తున్నారని.. ఓపెనర్ ను కిందకు పంపింది కాక.. అసలు బ్యాటింగ్ ఇవ్వడం లేదనే అర్దం వచ్చేలా మాట్లాడాడు.