ఐసీసీ 2024 వన్డే టీమ్.. 'ప్రపంచ కప్ ఫైనలిస్ట్' లలో ఒక్కరికీ చోటు లేదు

Virat Kohli and Rohit Sharma are the only two players to have scored more than 50 centuries in ODIs;

Update: 2025-01-24 12:41 GMT

వన్డేల్లో 27 ఏళ్ల తర్వాత శ్రీలంక చేతిలో సిరీస్ ఓటమి.. టెస్టుల్లో చరిత్రలో లేని విధంగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3తో క్లీన్ స్వీప్.. ఆపై ఆస్ట్రేలియాలో 1-3తో పరాజయం పాలైన టీమ్ ఇండియాకు కు ఊహించని షాక్.. వన్డే ప్రపంచ కప్ ఫైనలిస్ట్ అయిన మన జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) ప్రకటించిన 2024 జట్టులో ఒక్కరికీ చోటు దక్కలేదు.

వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన రోహిత్ శర్మ, 50పైగా సెంచరీలు చేసిన విరాట్ కోహ్లి వంటి ఆటగాళ్లున్న జట్టును ఐసీసీ కనీసం పట్టించుకోలేదు.

2024కు గాను ప్ర‌క‌టించిన ఐసీసీ వన్డే జట్టులో ఒక్క భారత ఆటగాడికీ చోటు లేదు. విచిత్రం ఏమంటే.. త్వరలో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించని శ్రీలంక నుంచి న‌లుగురు, వెస్టిండీస్ నుంచి ఒక ఆట‌గాడికి ఐసీసీ జట్టులో చోటుద‌క్కింది. లంక ఆట‌గాడు చ‌రిత్ అస‌లంక ఏకంగా ‘2024 మెన్స్‌ వన్డే టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్’ కు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అతడు 16 వ‌న్డేల్లో 50.2 స‌గ‌టుతో 605 ప‌రుగులు చేశాడు. కాగా, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్ నుంచి ముగ్గురేసి ఆటగాళ్లను ఐసీసీ ఎంపిక చేసింది.

ఆడింది మూడు ఓడింది రెండు

2024లో భారత్ మూడంటే మూడు వ‌న్డేలే ఆడింది. ఇవి కూడా శ్రీలంక‌తోనే కావడం గమనార్హం. హెడ్ కోచ్‌ గా గౌతమ్ గంభీర్ కు ఇదే తొలి సిరీస్. ఒక మ్యాచ్ టై కాగా.. రెండింటిలో భార‌త్ ఓడింది.

కాగా, 2023 నవంబరులో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు చేరిన భారత్.. 2024లో జరిగిన టి20 ప్ర‌పంచ‌క‌ప్ ను గెలిచింది.

భారత్ కే కాదు..

ఐసీసీ 2024 పురుషుల వన్డే జట్టులో ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్ ఆట‌గాళ్ల‌కూ చోటు ద‌క్క‌కపోవడం గమనార్హం. 2004 నుంచి ఐసీసీ వ‌న్డే టీమ్‌ ను ప్ర‌క‌టిస్తూ వ‌స్తోంది. వీటిలో ఒక్క భార‌త ఆట‌గాడు కూడా లేక‌పోవ‌డం ఇది రెండోసారి మాత్ర‌మే. 2021లో తొలిసారి భార‌త ఆట‌గాళ్ల‌కు చోటు ద‌క్క‌లేదు.

ఇదీ 2024 ఐసీసీ పురుషుల వన్డే జట్టు

చరిత్‌ అసలంక (కెప్టెన్‌)(శ్రీలంక‌), రహ్మానుల్లా గుర్బాజ్‌ (అఫ్గానిస్థాన్‌), నిస్సంక‌(శ్రీలంక‌), కుశాల్‌ మెండిస్‌ (కీపర్‌-శ్రీలంక), షెర్ఫేన్‌ రూథర్‌ ఫోర్డ్‌ (వెస్టిండీస్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్ (అఫ్గానిస్థాన్‌), హసరంగ (శ్రీలంక‌), షాహీన్‌ షా అఫ్రిది (పాకిస్థాన్‌), హరీస్‌ రవూఫ్‌ (పాకిస్థాన్‌), అల్లా ఘజన్‌ఫర్ (అఫ్గానిస్థాన్‌).

Tags:    

Similar News