వైసీపీకి 80 కోట్ల విరాళాలు..!

Update: 2019-10-17 07:21 GMT
ప్ర‌స్తుత ఏపీ అధికార పార్టీ వైసీపి అధినేత జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ స‌మ‌యంలో పార్టీని ఆర్థికంగా న‌డిపించేందుకు - కార్యాల‌యాల నిర్వ‌హ‌ణ ఖ‌ర్చుల‌కు సంబంధించి వివిధ సంస్థ‌ల నుంచి విరాళాల‌ను సేక‌రించారు. అదేస‌మ‌యంలో జ‌గ‌న్ ప్రారంభించిన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి కూడా కొంద‌రు స్వ‌చ్ఛందంగా విరాళాలు స‌మ‌ర్పించారు. అయితే, ప్ర‌స్తుతం కేంద్రం తీసుకువ‌చ్చిన చ‌ట్టం ప్ర‌కారం రాజ‌కీయ పార్టీల‌కు అందుతున్న విరాళాల వివ‌రాల‌ను వార్షిక ప‌ద్ధ‌తిలో ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో వైసీపీకి 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో అందిన విరాళాల వివ‌రాల‌ను పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - రాజ్య‌స‌భ స‌భ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డి ఎన్నిక‌ల సంఘానికి అఫిడ‌విట్ రూపంలో స‌మ‌ర్పించ‌డంతో ఆయా విరాళాల వివ‌రాలు వెలుగు చూశాయి.  మొత్తం వైసీపీకి 80 కోట్ల పైచిలుకు నిధులు విరాళాలుగా అందాయి. అత్యధికంగా ప్రుడెంట్‌ ఎన్నికల ట్రస్టు రూ.27 కోట్లు విరాళంగా ఇచ్చింది.  సీఎం జ‌గ‌న్‌ కే చెందిన సండూర్‌ విద్యుత్‌ కంపెనీ రూ.75 లక్షలు - క్లాసిక్‌ రియాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.కోటి విరాళంగా ఇచ్చాయి.

తూర్పు గోదావరి జిల్లాలోని ఆండ్రూ మినరల్స్‌ సంస్థ రూ.9.5 కోట్లు వైసీపీకి ఇచ్చింది. ఆ సంస్థకు సంబంధించి ఆండ్రూ ఉషా రాణి రూ.30 లక్షలు - ఆండ్రూ పద్మకోటి - సత్యవతి రూ.35 లక్షలు - సుజాత ఆండ్రూ రూ.30 లక్షలు - ఆండ్రూ శ్రీనివాస్‌ రూ.20 లక్షలు - రమేశ్‌ బాబు ఆండ్రూ రూ. 35 లక్షలు విరాళంగా ఇచ్చారు. హర్కర కార్తీక్‌ చక్రవర్తికి చెందిన లక్ష్మీ గణేశ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ సంస్థ (హైదరాబాద్‌) రూ.28 లక్షలు - ఆయనకు చెందిన మరో కంపెనీ హర్కర ఐరన్‌ స్టీల్‌ అండ్‌ సిమెంట్‌ సంస్థలో డైరెక్టర్‌ గా ఉన్న స్వాతి హర్కర రూ.10 లక్షలు - కరీంనగర్‌ లోని మణికంఠ ఎంటర్‌ ప్రైజెస్‌ రూ.10 లక్షలు వైసీపీకి ఇచ్చారు.

విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రూ.2 కోట్లు - ఆయనకు చెందిన ఎంవీవీ బిల్డర్స్‌ సంస్థ రూ.9 కోట్లు.. మొత్తం 11 కోట్లు ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మ‌డిగా.. 44.95 ల‌క్ష‌లు - కే రామ‌సుబ్బారెడ్డి 24 ల‌క్ష‌లు - టీఈసీ సోలార్ ఇండియా 50 ల‌క్ష‌లు - శుభ‌గృహ ప్రాజెక్టు 1.35 కోట్లు - చాంపియ‌న్ లాండ్ జోన్ కోటి రూపాయ‌లు - ఇండ‌సింగ్ డెవ‌ల‌ప‌ర్స్‌(బెంగ‌ళూరు) 5 కోట్లు - హైద‌రాబాద్ వాట‌ర్ సొల్యూష‌న్ 25 ల‌క్ష‌లు - వీసీఆర్ మైనింగ్ 30 ల‌క్ష‌లు  విరాళంగా అప్ప‌ట్లో ఇచ్చారు.
Tags:    

Similar News