ప్రజల కోసం.. ప్రజల మధ్య.. 'అజిత్' ఓ శకం!
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) చీఫ్ అజిత్ పవార్ దుర్మరణం చెందారు.;
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) చీఫ్ అజిత్ పవార్ దుర్మరణం చెందారు. అయితే.. ఆయన మరణం దిగ్భ్రాంతికరమే అయినా.. యాదృచ్ఛికంగా.. ఆయనను మెచ్చిన నియోజకవర్గంలోను... ఏడుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలు ఆశీర్వదించిన నియోజకవర్గంలోనే అజిత్ తుదిశ్వాస విడిచారు. అంతేకాదు.. ఏ నియోజకవర్గం ప్రజల కోసం ఆయన శ్రమించారో.. ఏ నియోజకవర్గంలో ఆయనకు బలమైన మద్దతు ఉందో.. అదే నియోజకవర్గం పరిధిలో ప్రమాదం జరిగి.. అజిత్ తుదిశ్వాస విడవడం.. మరింత విషాదకరం.
బారామతి.. అంటే.. వ్యక్తిగతంగా అజిత్ పవార్‌కు కలిసి వచ్చిన నియోజకవర్గం. ఇక్కడ నుంచి ఆయన పార్లమెంటుకు కూడా ఎన్నికయ్యారు. తొలిసారి ఆయన పార్లమెంటు ఎన్నికలకే పోటీ చేశారు. ఇక, ఆ తర్వా త.. ఇదే బారామతీ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఆయన పోటీ చేసి.. 40 ఏళ్లుగా విజయం దక్కించుకుంటున్నారు. నిజానికి చెప్పాలంటే.. అజిత్ పవార్... ఒక శకం. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆయన పెద్ద సంచలనం కూడా. బాబాయి.. శరద్ పవార్ స్థాపించిన ఎన్‌సీపీలో చేరి అడుగులు వేసిన అజిత్.. తర్వాత అనేక సవాళ్లుగా మారారు.
2023లో ఎన్సీపీని తనదైన శైలిలో తన పార్టీగా మార్చుకున్నారు. ఇది పెద్ద వివాదం కూడా అయింది. అప్పటి మహా అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. కాంగ్రెస్‌తో పొత్తుకు రెడీ అయిన ఎన్సీపీని విడగొట్టి.. తనదిగా మార్చుకున్నారు. ఆ తర్వాత ఆయన బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఇలా విజయం దక్కించుకున్న అజిత్ పవార్.. ప్రస్తుత బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర సర్కారు (మహాయుతి-మహాకూటమి) లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు.
ఎందుకెళ్లారు?
ప్రస్తుతం మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఎన్సీపీ అభ్యర్థుల తరఫున బారామతిలో ప్రచారం చేసేందుకు అజిత్ పవార్ అక్కడకు వెళ్లారు. ఇదే ఆయనకు శాపంగా మారింది. ఇటీవల కూడా.. ఆయన పార్టీ పరంగానే కాకుండా.. రాజకీయ పరంగా కూడా చర్చల్లో నిలిచారు. ఆయన కుమారుడు ప్రభుత్వ భూముల వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై ఒకపక్క వివాదం జరుగుతున్నా.. కూటమిలో ఆయన కొనసాగుతున్నారు.
త్వరలోనే అజిత్‌కు ఉద్వాసన పలకనున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇక, తన సొంత బాబాయితో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చిన అజిత్.. అదే పార్టీని సొంతం చేసుకున్నా.. ఇటీవల ఓ వేదిక సాక్షిగా బాబాయితో చేతులు కలిపారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రచారంలో ఉన్న అజిత్.. దుర్మరణం.. ఎన్సీపీలో ఒక శకాన్ని అంతం చేసిందనే చెప్పాలి.