చిత్రం చెప్పే కథ : సామాన్య కార్యకర్తలా సీఎం..!

ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి 4వ సారి సీఎం. తెలుగుదేశం పార్టీకి సర్వ సైన్యాధ్యక్షుడు చంద్రబాబు;

Update: 2026-01-28 07:08 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి 4వ సారి సీఎం. తెలుగుదేశం పార్టీకి సర్వ సైన్యాధ్యక్షుడు చంద్రబాబు. 1995లో టీడీపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు ఇప్పటికీ అదే హోదాలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో టీడీపీకి అధ్యక్షుడిగానే కాదు దేశంలో అత్యంత సుదీర్ఘకాలం పాటు ఒక పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన రికార్డు చంద్రబాబుదే. అలాంటి నేత సామాన్య కార్యకర్తలా ప్రవర్తించడం అంటే విశేషమే. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కమిటీల శిక్షణ తరగతుల్లో చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో మంగళవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో టీడీపీ పార్లమెంటు కమిటీల శిక్షణ తరగతులు జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 నిమిషాల వరకు ఈ కార్యక్రమం జరిగింది. మంత్రి నారా లోకేశ్ ఉదయం నుంచి పార్టీ కార్యాలయంలోనే ఉండగా, సీఎం చంద్రబాబు సమావేశాల మధ్యలో ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. అయితే ఇలా వచ్చిన చంద్రబాబు సమావేశాన్ని ఉద్దేశించి కాసేపు ప్రసంగించి వెళ్లిపోలేదు. తాను కూడా ఒక సామాన్య కార్యకర్తగా అందరి మధ్య కూర్చొని ట్రైనర్లు ఏం చెబుతున్నారో శ్రద్ధగా తెలుసుకున్నారు.

మంగళగిరి పార్టీ ఆఫీసులో జరిగిన ఈ శిక్షణ తరగతులకు రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి సుమారు 1050 మంది హాజరయ్యారు. వర్క్ షాపు జరుగుతున్న ప్రతి గదికి వెళ్లిన చంద్రబాబు చివరి వరుసలో కూర్చొని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్న విషయాలను శ్రద్ధగా విన్నారు. నాలుగోసారి సీఎంగా పనిచేస్తున్నా, పార్టీ కార్యకర్తలా చంద్రబాబు తమ మధ్యే కూర్చోవడం తమకు స్ఫూర్తినిస్తోందని కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ శిక్షణ శిబిరంలో మంత్రి పయ్యావుల కేశవ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.

పార్టీ ఆవిర్భావంపై తరగతులు తీసుకునే బాధ్యతను మంత్రి కేశవ్ కు అప్పగించారు. దీనిపై కేశవ్ క్లాసు జరుగుతుండగా, చంద్రబాబు ఆ గదికి వెళ్లారు. పయ్యావుల ప్రసంగం చాలా ఆసక్తికరంగా ఉండటంతో చంద్రబాబు ఆ గదిలో చాలాసేపు ఉండిపోయారు. టీడీపీ ఆవిర్భావం నాటి పరిస్థితులు, పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ కు ఉన్న జనాదరణ, లక్ష్మీపార్వతి ప్రవేశం, ఎన్టీఆర్ పదవీచ్యుతుడు కావడం, పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని చంద్రబాబు దక్కించుకుని పార్టీని ముందుకు నడిపిన తీరుపై కేశవ్ చక్కగా వివరించారు. ఆర్థిక మంత్రి ప్రసంగాన్ని విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు బాగా చెప్పారంటూ ప్రశంసించారు.

Tags:    

Similar News