చెవిరెడ్డిని దూరంపెట్టిన జగన్..? ఈ ప్రచారం నిజమేనా?!

అంతేకాకుండా గత ఎన్నికల్లో చెవిరెడ్డి పోటీ చేసిన ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యామ్నాయం చూస్తున్నారని, చెవిరెడ్డిని ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరికి మాత్రమే పరిమితం కావాలని అధినేత ఆదేశించారని అంటున్నారు.;

Update: 2026-03-14 14:30 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మధ్య దూరం పెరిగిందా? సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం ఈ అనుమానానికి కారణమవుతోంది. ఏపీ మద్యం స్కాంలో అరెస్టు తర్వాత జైలుకు వెళ్లిన చెవిరెడ్డి బెయిలుపై బయటకు వచ్చాక పార్టీ అధినేత జగన్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని, కానీ, చెవిరెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, ఆయన అంతరంగిక బృందంలోని కీలక నేతగా చలామణీ అయిన చెవిరెడ్డిని దూరం పెట్టాల్సిన అవసరం ఏంటి? ఈ ప్రచారంలో నిజమెంత? అన్న విషయాలపై పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ జరుగుతోంది.

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజవర్గానికి చెందిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలతోపాటు పార్టీ తరపున చేసే సర్వేలు అన్నీ చెవిరెడ్డి పర్యవేక్షించేవారు. అయితే ఇటీవల ఈ బాధ్యతలు నుంచి చెవిరెడ్డిని తప్పించినట్లు వైసీపీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలను పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవరెడ్డికి అప్పగించాలని, ఆ విషయాలను చెవిరెడ్డి పట్టించుకోవద్దని జగన్ చెప్పారని అంటున్నారు. ఈ విషయాన్ని కూడా జగన్ నేరుగా చెప్పలేదని, పార్టీ నేతల ద్వారా ఆయా బాధ్యతల నుంచి చెవిరెడ్డి దూరంగా ఉండాలని సూచించినట్లు చెబుతున్నారు.

అంతేకాకుండా గత ఎన్నికల్లో చెవిరెడ్డి పోటీ చేసిన ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యామ్నాయం చూస్తున్నారని, చెవిరెడ్డిని ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరికి మాత్రమే పరిమితం కావాలని అధినేత ఆదేశించారని అంటున్నారు. అయితే ఈ మార్పులపై జగన్ తో మాట్లాడేందుకు చెవిరెడ్డి ప్రయత్నిస్తున్నా, అధినేత అవకాశం ఇవ్వడం లేదని అంటున్నారు. దీనికి కారణం చెవిరెడ్డికి అధికార టీడీపీలోని కొందరు ఎమ్మెల్యేలతో ఉన్న సంబంధాలే అంటున్నారు. ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం మార్కాపురం జిల్లా పరిధిలోకి వెళ్లిన ఓ నియోజకవర్గ ఎమ్మెల్యేతో చెవిరెడ్డి చాలా చనువుగా ఉంటున్నారని జగన్ రెడ్డికి ఫిర్యాదులు వెళ్లాయని అంటున్నారు. ఈ కారణంగానే ఒంగోలు పార్లమెంటు బాధ్యతలతోపాటు పార్టీలోని కీలక వ్యవహారాల నుంచి చెవిరెడ్డిని తప్పించినట్లు చెబుతున్నారు.

తనకు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న నేతలు ఏ దశలోనూ, ఏ రూపంలోనూ ప్రత్యర్థులతో సంబంధాలు ఏర్పరుచుకోకూడదన్న ఆలోచనలో అధినేత జగన్ ఉన్నారని అంటున్నారు. ఈ కోణంలోనే చెవిరెడ్డిని దూరం పెట్టి, మిగిలిన వారికి గట్టి సందేశం ఇవ్వాలని ఆయన భావించినట్లు చెబుతున్నారు. చెవిరెడ్డి తన సొంత నియోజకవర్గంలో రాజీ లేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేతో పోరాడుతున్నారని, కానీ మిగిలిన చోట్ల ఆయన టీడీపీ నేతలతో రాజీ ధోరణి ప్రదర్శిస్తున్నారని జగన్ కు ఫిర్యాదులు వెళ్లాయంటున్నారు. ఈ విధానం వల్ల భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని, ఆ ఆలోచనతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అందుకే ఎప్పుడూ జగన్ వెంట కనిపించే చెవిరెడ్డి ప్రస్తుతం తారసపడటం లేదని టాక్ నడుస్తోంది.

Tags:    

Similar News