ఇంజనీరింగ్ తర్వాత డాక్టర్ కోర్సు.. అదెలా అనుకుంటున్నారా?
కలలకు వయసుతో సంబంధం లేదని, దృఢ సంకల్పం ఉంటే ఎంతటి క్లిష్టమైన లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని నిరూపించారు ఆకృతి గోయల్
కలలకు వయసుతో సంబంధం లేదని, దృఢ సంకల్పం ఉంటే ఎంతటి క్లిష్టమైన లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని నిరూపించారు ఆకృతి గోయల్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆమె తన చిన్ననాటి కోరికను నెరవేర్చుకునేందుకు 32 ఏళ్ల వయసులో నీట్ పరీక్షలో మంచి ర్యాంకు తెచ్చుకుని వైద్య విద్యలో చేరారు. దాదాపు పది నెలల కఠోర శ్రమతో నీట్ పరీక్షకు ప్రిపేర్ అయిన ఆకృతి గోయల్ సక్సెస్ సాధించారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడి, మంచి కెరీర్ గడుపుతున్నప్పటికీ.. వైద్య వృత్తిపై ఉన్న మక్కువను చంపుకోలేక ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.
కెరీర్ పరంగా అన్ని సౌకర్యాలు ఉన్నా, లోపల ఏదో వెలితి. సమాజానికి నేరుగా సేవ చేయాలనే బలమైన కోరికతో ఆమెను ఇంజనీర్ ఉద్యోగం నుంచి వైద్య రంగం వైపు అడుగులు వేసేలా చేసిందని అంటున్నారు. పదేళ్ల విరామం తర్వాత మళ్ళీ పుస్తకాలు పట్టుకోవడం, అందునా అత్యంత కఠినమైన 'నీట్' పరీక్షకు సిద్ధమవ్వడం అంత సులభమైన విషయం కాదు. అయినా, వెనకడుగు వేయకుండా పట్టుదలతో రంగంలోకి దిగి విజయం సాధించిన ఆకృతి గోయల్ చాలా మందికి ఆదర్శంగా మారారని కితాబు అందుకుంటున్నారు. కేవలం పది నెలల్లోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూనే, మరోవైపు కఠినమైన నీట్ కు ప్రిపేర్ అయ్యారు.
పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడి చదివి ఫలితం సాధించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులపై పట్టు సాధించడానికి ఎంతో క్రమశిక్షణతో కూడిన అధ్యయనాన్ని అలవాటు చేసుకున్నారు. సాంకేతిక రంగంలో అలవాటైన లాజికల్ థింకింగ్‌ను, వైద్య శాస్త్ర విశ్లేషణకు అన్వయిస్తూ ముందుకు సాగారు. నిరంతర కృషితో, అనుకున్న లక్ష్యాన్ని పది నెలల కాలంలోనే చేరుకున్నారు. నీట్ పరీక్షలో అర్హత సాధించి, తాను అనుకున్న వైద్య వృత్తిలో అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఒక స్థిరమైన కెరీర్‌ను వదిలి, ఎంతో రిస్క్‌తో కూడిన వైద్య విద్యను ఎంచుకోవడం వెనుక ఉన్న సంకల్ప బలం, వయసును అడ్డుగా భావించే వారికి ఒక గట్టి సమాధానంగా నిలిచారు ఆకృతి గోయల్.
కసి ఉంటే ఏదైనా సాధ్యమేనని, సరైన ప్రణాళికతో ప్రయత్నిస్తే విజయం వరించడం ఖాయమని ఆమె సక్సెస్ స్టోరీ నిరూపిస్తోంది. చిన్నతనం నుంచి మెడిసన్ చదవాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ అనుకోని పరిస్థితుల్లో ఇంజనీరింగ్ దిశగా వెళ్లాల్సివచ్చిందని ఆకృతి తెలిపారు. బిట్స్ పిలానీలో ఎంఎస్సీ ఎకనామిక్స్, బిటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎటక్ట్రికల్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. క్యాంపస్ లో ఉద్యోగం వచ్చినా వెళ్లకుండా, స్వయంగా ఇంటర్వ్యూల ద్వారా స్టార్టప్ ల్లో ఉద్యోగాలు సంపాదించారు. ఆ తర్వాత హీలోఫీ అనే స్టార్టప్ లో లీడర్ షిప్ పాత్రను పోషిస్తూ ఆ సంస్థ సీఈవోతో కలిసి మిలియన్ డాలర్ల ప్రాజెక్టులను విజయవంతంగా హ్యాండిల్ చేశారు.
ఇక వరుసగా నైట్ షిఫ్టులు, విపరీతమైన ఒత్తిడి కారణంగా 2020లో ఆకృతి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని చెబుతున్నారు. ఆ తర్వాత కోవిడ్ లాక్ డౌన్ రావడంతో తన ఉద్యోగాన్ని వదిలేసి, తన చిన్ననాటి కల అయిన డాక్టర్ కోర్సు చదవాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అయితే కొన్నాళ్లు ఉద్యోగం చేయడమే కాకుండా, అప్పటికే 30 ఏళ్లు పైబడటంతో డాక్టర్ అవ్వడం అసాధ్యమంటూ చుట్టుపక్కల వారు నిరుత్సాహ పరిచినా ఆమె వెనక్కి తగ్గలేదని అంటున్నారు. పదేళ్ల తర్వాత పుస్తకాలు పట్టిన ఆకృతి పది నెలలు పాటు కఠోరంగా శ్రమించి 2021లో నీట్ లో అర్హత సాధించి వైద్య విద్యలో ప్రవేశించారు. ప్రస్తుతం ఢిల్లీలో హిందూరావు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.