నాడూ.. నేడు తగ్గేదేలే.. అమెరికా ఆంక్షలు ఎన్ని పెట్టినా.. రష్యా విషయంలో తగ్గని భారత్
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కల్పించే చట్టం ముందుకు వచ్చింది.
అమెరికా–భారత్ సంబంధాల్లో మరోసారి వాణిజ్య ఒత్తిళ్లు చర్చనీయాంశంగా మారాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కల్పించే చట్టం ముందుకు వచ్చింది. ఈ చట్టం ప్రకారం రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాలపై గరిష్ఠంగా 100 శాతం వరకు టారిఫ్ విధించే అవకాశం ఉంది. భారత్, చైనా వంటి పెద్ద రష్యన్ ఆయిల్ కొనుగోలుదారులు ఈ పరిణామంతో ప్రభావితమయ్యే అవకాశముంది. అయితే ఇది ప్రస్తుతం భారత్‌పై ఆటోమేటిక్‌గా 100 శాతం టారిఫ్ అమలులోకి వచ్చిందనే అర్థం కాదు. అమెరికా అధ్యక్షుడి నిర్ణయం.. తదుపరి ప్రక్రియ కీలకం.
1998లోనూ ఇదే తరహా ఒత్తిడి
ఇది భారత్ ఎదుర్కొంటున్న తొలి అమెరికా ఆంక్షల సవాల్ కాదు. 1998 మేలో పోఖ్రాన్-2 అణు పరీక్షలు నిర్వహించిన తర్వాత అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ ప్రభుత్వం భారత్‌పై ఆర్థిక, సైనిక, సాంకేతిక పరమైన ఆంక్షలు విధించింది. అమెరికా విదేశీ సాయం, రక్షణ పరికరాల విక్రయాలు, కొన్ని రకాల రుణాలు, సాంకేతిక ఎగుమతులపై ఆంక్షలు విధించినట్లు అప్పటి అమెరికా ప్రభుత్వ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆంక్షలు విధించడంతో భారత్ తన వ్యూహాత్మక నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. అణు సామర్థ్యం దేశ భద్రతకు అవసరమనే దృక్పథంతో భారత్ ముందుకు సాగింది. ఆంక్షల ప్రభావం ఉన్నప్పటికీ అమెరికాతో చర్చల మార్గాన్ని కూడా పూర్తిగా మూసివేయలేదు. ఇదే సమయంలో అంతర్జాతీయ పరిణామాలు కూడా మారాయి.
చివరికి ఆంక్షలు తొలగించిన అమెరికా
1998లో విధించిన ఆంక్షలు ఒక్కసారిగా కాకుండా దశలవారీగా సడలించబడ్డాయి. చివరకు 2001 సెప్టెంబర్ 22న అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ భారత్‌పై మిగిలిన అణు పరీక్షల సంబంధిత ఆంక్షలను తొలగించారు. అమెరికా అధికారిక రికార్డుల ప్రకారం ఆంక్షలు కొనసాగించడం తమ జాతీయ ప్రయోజనాలకు అనుకూలం కాదనే నిర్ణయానికి అమెరికా వచ్చింది. ఇక్కడే 1998–2001 పరిణామాలు ప్రస్తుత పరిస్థితికి ఒక చారిత్రక నేపథ్యాన్ని ఇస్తున్నాయి. అప్పట్లో విషయం అణ్వాయుధాలు, జాతీయ భద్రత అయితే.. ఇప్పుడు విషయం ఇంధన భద్రత, చమురు ధరలు, సరఫరా స్థిరత్వం.
రష్యా చమురు ఎందుకు కీలకం?
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యన్ క్రూడ్‌పై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో రష్యా తన చమురును ఇతర మార్కెట్లకు మళ్లించింది. భారత్ కూడా ధర, సరఫరా లభ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రష్యా నుంచి భారీగా క్రూడ్ కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం రష్యా చమురు భారత్‌కు కీలక సరఫరా వనరుగా మారింది.
భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు కావడంతో అంతర్జాతీయంగా చమురు ధరల్లో వచ్చే మార్పులు నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఒక్కసారిగా తగ్గిస్తే ప్రత్యామ్నాయ సరఫరాదారులను వెతకాల్సి ఉంటుంది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే దిగుమతి బిల్లు, రూపాయి, ద్రవ్యోల్బణంపై కూడా ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది.
భారత్ ముందున్న అసలు సవాలు ఇదే
అందుకే ప్రస్తుత పరిస్థితిని కేవలం “అమెరికా వర్సెస్ భారత్”గా చూడటం కంటే.. భారత్‌కు ఎదురవుతున్న ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాలు, దౌత్య సంబంధాల మధ్య సమతుల్యతగా చూడాల్సి ఉంటుంది. భారత్ ఇప్పటికే అమెరికాకు తన ఇంధన భద్రత ప్రాధాన్యతను స్పష్టం చేసింది. కొత్త అమెరికా చట్టం వల్ల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉందని కూడా న్యూఢిల్లీ హెచ్చరించింది. అదే సమయంలో అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగించాలన్న ఆసక్తిని భారత్ వ్యక్తం చేస్తోంది.
నాడు అణ్వాయుధాలు.. నేడు ఇంధన భద్రత
1998లో భారత్ తీసుకున్న నిర్ణయం దేశ భద్రతను కేంద్రంగా చేసుకున్న వ్యూహాత్మక నిర్ణయం. 2026లో రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ ఎదుర్కొంటున్న సవాలు మాత్రం ఆర్థిక, ఇంధన భద్రతకు సంబంధించినది. రెండు సందర్భాల్లోనూ ఒక సామాన్య అంశం కనిపిస్తుంది.. బయటి ఒత్తిళ్ల మధ్య దేశ ప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలన్న ప్రశ్న. అయితే 1998లో జరిగిన పరిణామాలను 2026 పరిస్థితులకు యథాతథంగా అన్వయించడం సరైంది కాదు. అప్పటి అంతర్జాతీయ వ్యవస్థ, భారత ఆర్థిక పరిస్థితి, అమెరికా–భారత్ సంబంధాలు, ప్రస్తుత ప్రపంచ ఇంధన మార్కెట్.. అన్నీ పూర్తిగా ఒకేలా లేవు.
కాబట్టి ఇప్పుడు భారత్ తన స్వంత స్వంతంత్ర విదేశాంగ విధానంగా నిబ్బరంగా ముందుకెళుతోంది.. రష్యా చమురు కొనుగోళ్ల వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను, అమెరికాతో వాణిజ్య సంబంధాలను, అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను, దేశీయ ఇంధన అవసరాలను ఒకేసారి పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సిన సంక్లిష్ట వ్యూహాత్మక సమీకరణం. 1998 చరిత్ర ఒక విషయం మాత్రం గుర్తుచేస్తుంది. అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ భారత్–అమెరికా సంబంధాలు చివరకు మళ్లీ పునరుద్ధరించబడ్డాయి. ఇప్పుడు కూడా పరిణామాలు ఎలా మలుపుతిరుగుతాయన్నది రాబోయే చర్చలు, అమెరికా నిర్ణయాలు, ప్రపంచ చమురు మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది.