తరం తరం నిరంతరం ఒక జీవన వాహిని
పెద్దలకు విలువ ఇవ్వడం సాగిపోయే అనంత సాగరంలోని అలలను చూసి నేర్చుకోవాలి అవి ఒకదానికి ఒకటి అనుసంధానం అవుతూ ముందుకు పోతాయి.
మానవాళి ఉనికి యుగాల నాటిది. ఈ జీవన ప్రవాహం అనంతం, అది ఒక అద్భుతం. అసమానం. అలా సాగిపోతూనే ఉంటుంది. విశ్వ మానవుడు ఒక్కడే. అలలుగా అనేక రూపాలు సంతరించుకున్నా మనిషి రూపం ఈ భూమి మీద ఒక్కటే. అంతులేని సాగరానికి ఆ అంచూ ఈ అంచూ ఊహించలేనట్లుగానే మానవాళి ఆది అంతూ కూడా ఎవరి లెక్కకూ ఊహకు అందని వింతగానే చెప్పాలి. ఇక ప్రకృతిలో మనిషి భాగం. తాను వేరే అని అనుకుంటే అది తప్పే అవుతుంది. ప్రకృతికి వర్తించే సూత్రాలు అన్నీ మనిషికి కూడా వర్తిస్తాయి. తన రాక పోకల మధ్యన ఒక తీపి గుర్తుని మిగిల్చిపోవాలి. తన అనుభవాల సారం తరువాత తరానికి అందించాలి.
పెద్దల నుంచి వారసత్వం :
పెద్దలు అంటే వారిని ఎలా చూడాలి అన్నది అతి పెద్ద మీమాంస. ఎందుకంటే వయో వృద్ధులను కేవలం భారంగా మాత్రమే చూస్తారు. వారి అనుభవాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోరు. ఈ సృష్టిలో ఏ జాతి అయినా తన ముందు తరం నుంచి మొత్తానికి మొత్తంగా నేర్చుకుంటుంది. దానిని తన జీవిత గమంలో అమలులో పెడుతుంది. కానీ మనిషి మాత్రం తన సొంత ఆలోచనలతో ముందుకు సాగుతాడు. ఈ విషయంలో పెద్దల పట్ల ఆయన గౌరవం మర్యాద మన్నన అన్నది కాలలతో పాటు మారిపోతోంది. త్రేతాయుగంలో రాముడు తండ్రి మాటని నిలబెట్టి అడవులకు వెళ్ళారు. ద్వాపరయుగంలో పాండవులు తమ తల్లి కుంతి చెప్పిన మాటను జవదాటేవారు కాదు అని పురాణ గాధలు చెబుతాయి. కలియుగంలోనూ ముందు కాలం అంతా పెద్దలను గౌరవిస్తూనే సాగింది. తమ తండ్రి ఆశయాల కోసం తమ జీవితాలనె అర్పించిన తరాలని కూడా చూశారు.
కీలక మార్పులతో :
అయితే గడచిన వందేళ్ల కాలం ఒక ఎత్తుగా ఉంది. ఈ కాలం చేసే మాయా జాలంలో మనిషి కొట్టుకుపోతున్నాడు. దానికి నాగరికత అని పేరు పెట్టినా ఇటీవల కాలంలో ఆధునికత లేదా సాంకేతిక విప్లవం అని పేర్లు మార్చినా మనిషి మాత్రం మారిపోతూ వస్తున్నాడు. తన వెనకటితరాన్ని చాదస్తంగా చూస్తున్నాడు. వారు చెప్పేది అంతా ఒట్టి ట్రాష్ గా భావించే తరం అయితే బయలుదేరింది అని చెప్పాల్సి ఉంది. దాంతో నాటి విలువలు పద్ధతులు అయితే ఇపుడు ఏ మాత్రం కొనసాగించడం లేదు అనే చెప్పాల్సి ఉంది. అంతే కాదు వెనకటి అభిమానాలు ప్రేమలు కూడా మృగ్యమైపోతున్నాయి అన్న ఆవేదన అయితే అంతటా ఉంది.
నెమ్మదిగా జారిపోతున్న తరం :
ఇక చూస్తే వెనకటి తరం ఒకటి నెమ్మదిగా జారిపోతోంది. అందులో మెజారిటీ ఈ భూమి నుంచి సెలవు తీసుకున్నారు. కష్టపడి పనిచేయడం, తోటి వాడి కష్టాన్ని పంచుకోవడం, అందరికీ ప్రేమను పంచడం ఉమ్మడి కుటుంబాలుగా ఊళ్ళు వర్ధిల్లడం కులమతాలకు అతీతంగా అంతా కలసి మెలసి జీవించడం ప్రకృతిని ప్రేమించడం అతిగా ఆశలకు పోకపోవడం, మంచి ఆరోగ్యపు అలవాట్లు. సూర్యోదయానికి మందె లేవడం, రాత్రి పొద్దుకోకముందే పడుకోవడం, ఇంటికి వచ్చిన అతిధులను భోజన మర్యాదలు చేసి ఆదరించడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వీటిని తుచ తప్పకుండా పాటించిన తరంలో ఇపుడు మేలిమి గురుతులుగా ఒక్కటీ అరా మాత్రం మిగిలి ఉన్న వారు కనిపిస్తారు. కానీ వారి వారసత్వం అందిపుచ్చుకున్న వారు ఈ తరంలో అయితే భూతద్దంతో వెతికినా అసలు కనిపించారు.
అలలను చూసి నేర్చుకోవాలి :
పెద్దలకు విలువ ఇవ్వడం సాగిపోయే అనంత సాగరంలోని అలలను చూసి నేర్చుకోవాలి అవి ఒకదానికి ఒకటి అనుసంధానం అవుతూ ముందుకు పోతాయి. తమ ముందు వారి నుంచి తీసుకున్నది తరువాత వారికి అందించే గుణాన్ని కోల్పోవడం లేదు, అలాగే చెట్టు చేమలు జంతు జాలం అంతా పూర్వీకులను అనుసరిస్తూ పోతోంది. మనిషి మాత్రమే ఇలా ఉండడం బాధాకరం. ఒక గొలుసుకట్టుగా ఆచారాలు మర్యాదలు విలువలు కొనసాగాల్సిన అవసరం ఉంది. అవి తెగిపోతే ఏముంటుంది. ఎక్కడిది అక్కడే ఉండిపోతుంది. అపుడు విశ్వమానావళి ప్రస్థానం ప్రశ్నార్ధకంగా మారుతుంది. ఒక అందమైన అనుసంధానం అదృశ్యం అయ్యాక ఎవరికి వారుగా చివరికి ఎవరూ లేని వరుగా మనిషి మిగిలిపోక తప్పదు.
రాయబారిగా :
ప్రతీ మనిషి తాను ఎవరంటే రూంటే ఒక రాయబారి ఒక వారధి అని గుర్తు పెట్టుకోవాలి. తన ముందు తరం నుంచి తాను నేర్చుకోవాలి. తరౌవాత తరానికి ఆ వారసత్వాన్ని అందించాలి. భౌతికపరమైన సంపదను మాత్రమ కాదు జ్ఞాన సంపదను సాంశృక్తిక వారసత్వాన్ని పంచినపుడే మనిషి యుగాలుగా జీవిస్తున్నట్లు లెక్క. లేకపోతే దిగులు పడుతూ దిగజారి పోతున్నట్లుగా భావించాల్సిందే మరి.