చిన్న తప్పులకు పెద్ద శిక్ష.. ‘రీ నీట్’పై విమర్శలు వెల్లువ

దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన రీ నీట్' పరీక్ష సందర్భంగా జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వ్యవహరించిన తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

Update: 2026-06-22 13:41 GMT

దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన రీ నీట్' పరీక్ష సందర్భంగా జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వ్యవహరించిన తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, అవకతవకలతో పరీక్షల వ్యవస్థనే అపహాస్యం చేసిన ఎన్టీఏ, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీ-నీట్ పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు వ్యవహరించిన తీరు, ఒకటి, రెండు నిమిషాల ఆలస్యానికే విద్యార్థులను గేట్ల బయట నిలిపివేయడంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. నీట్ పరీక్షల నిర్వహణలో ఘోరంగా విఫలమైన ఎన్టీఏ విద్యార్థుల విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించడం కరెక్టు కాదని అంటున్నారు. రకరకాల కారణాల వల్ల నిమిషం, రెండు నిమిషాలు ఆలస్యం అవుతుందని, అందుకే పెద్ద శిక్షలు విధిస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మే 3న జరిగిన పరీక్ష రద్దు కావడానికి మళ్లీ 40 రోజుల తర్వాత రీ నీట్ నిర్వహణకు కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని నిలదీస్తున్నారు.

నీట్ పరీక్ష అంటేనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఒక పెద్ద కల. ఏళ్ల తరబడి కష్టపడి సిద్ధమైన ఈ పరీక్షా సమయానికి చేరుకోవడంలో సాంకేతిక కారణాలు లేదా ట్రాఫిక్ సమస్యలు వంటి అవాంతరాలు ఎదురవ్వడం సహజమని అంటున్నారు. కానీ, ఎన్టీఏ నిబంధనల పేరుతో విద్యార్థులపై ఎటువంటి కనికరం చూపడం లేదని అంటున్నారు. కనీసం ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే, పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని భద్రతా సిబ్బంది తేల్చిచెప్పడం మానవతా దృక్పథం లేని చర్యగా విమర్శకులు అభివర్ణిస్తున్నారు. గూగుల్ మ్యాప్స్ చూపిన తప్పుడు మార్గాల్లో పడి దారి తప్పడం లేదా అనుకోని ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకోవడం వంటి కారణాల వల్ల ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు గేట్ల వద్ద కన్నీరుమున్నీరుగా విలపించినా, అధికారుల మనసు కరగకపోవడం శోచనీయని అంటున్నారు.

ఆదివారం జరిగిన రీనీట్ పరీక్ష సందర్భంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇటువంటి హృదయవిదారక ఘటనలు వెలుగుచూశాయి. మేడ్చల్ జిల్లా కీసరలోని పరీక్షా కేంద్రం వద్ద తన కూతురిని లోపలికి అనుమతించాలని కోరుతూ ఓ తండ్రి ఏకంగా సెక్యూరిటీ సిబ్బంది పాదాలపై పడి వేడుకోవడం, జగిత్యాలలో మరో తల్లి తన బిడ్డ భవిష్యత్తు కోసం ప్రాధేయపడటం వంటి దృశ్యాలు చూసిన వారిని కలచివేసాయి. హైదరాబాద్‌లోని జేఎన్టీయూ వంటి ప్రతిష్టాత్మక కేంద్రాల వద్ద కూడా ఇదే విధమైన పరిస్థితి కనిపించిందని అంటున్నారు. తమ తప్పులను సరిదిద్దుకునే క్రమంలో నిర్వహించిన ఈ రీ-నీట్ పరీక్షలో, ఎన్టీఏ తన పద్ధతిని మార్చుకుంటుందని భావించిన వారికి మళ్లీ నిరాశే ఎదురైందని అంటున్నారు.

ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి వ్యవస్థాగత లోపాలతో లక్షలాది మంది విద్యార్థుల నమ్మకాన్ని, భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన ఎన్టీఏ, ఇప్పుడు నిమిషం నిబంధనను కఠినంగా అమలు చేయడంపై మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల మేధస్సును పరీక్షించాల్సిన పరీక్షా సంస్థ, వారి సహనాన్ని, కన్నీళ్లను పరీక్షించడం ఏమాత్రం సమర్థనీయం కాదని విద్యావేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటున్న సమయంలో, ఇలాంటి మొండి వైఖరిని కొనసాగిస్తే విద్యార్థుల ఆశలు అడియాసలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎన్టీఏ ఇప్పటికైనా తన నిబంధనలను పునఃసమీక్షించుకుని, విద్యార్థుల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు.

Tags:    

Similar News