పిఠాపురం రాజకీయ కాక !

ఇక వంగా గీత అయితే భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. తన పుట్టింటి వారు అంతా ఉండేది పిఠాపురంలోనే అని చెప్పారు.

Update: 2026-06-22 17:16 GMT

పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని 2024 ఎన్నికల ముందూ తరువాత ఏపీ అంతా ఊగేలా స్లోగన్స్ చేసింది జనసైన్యం. పిఠాపురం అలా ఏపీ ఆంతా హాట్ టాపిక్ తొలిసారి అయింది. ఆ క్రెడిట్ కచ్చితంగా పవన్ కళ్యాణ్ దే. ఎందుకంటే ఆయన వెండితెర మీద పవర్ స్టార్. ఆయన ఫాలోయింగ్ అన్నది ఊహాతీతం. ఆయన క్రేజ్ అన్నది అద్భుతం. అందుకే పిఠాపురం అన్న ఒక అసెంబ్లీ నియోజకవర్గం టాక్ ఆఫ్ ది స్టేట్ అయింది. అది పవన్ అక్కడ నుంచి పోటీ చేయాలని ఎంచుకుని నిలిచి గెలిచిన తరువాత జరిగిన డెవలప్మెంట్స్ గానే వీటిని చూడాల్సి ఉంది.

పొలికేక గా మారింది :

పిఠాపురం నుంచి పవన్ పోటీ చేసి గెలిచారు. ఆయన ఆ తరువాత ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇక రెండేళ్ళ కూటమి పాలనలో కాపులకు న్యాయం జరగడం లేదని వైసీపీ కాపులంతా ఒక చోట చేరి మీటింగ్ పెట్టారు. అది కోనసీమ జిల్లా వేదికగా జరిగింది. ఈ మీటింగ్ తరువాత రాజకీయ ప్రకంపనలు ఒక రేంజిలో సాగుతున్నాయి. జనసేన కాపులు వర్సెస్ వైసీపీ కాపులు అన్నట్లుగా రాజకీయం రంజుగా సాగుతోంది. ఈ మీటింగ్ తరువాత వైసీపీ నాయకురాలు వంగా గీత మీడియాతో మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారు. పవన్ కులాన్ని తక్కువ చేయకూడదని అన్నారు. కాపులు ఎక్కువగా ఉన్నారనే కదా పిఠాపురం ఎంచుకుని పోటీ చేశారు అని ఆమె కామెంట్స్ చేశారు. అదే ఇపుడు ఏపీలో రాజకీయ పొలికేక గా మారిపోయింది.

పంతం నానాజీ ఫైర్ :

మరో వైపు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే జనసేన నేత పంతం నానాజీ అయితే హాట్ కామెంట్స్ చేశారు. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే తప్పేంటి అన్నారు. వంగా గీతది పిఠాపురం అమ్మ గారి ఊరా నాన్న గారి ఊరా అని ప్రశ్నించారు. అసలు ఎవరు ఎక్కడ నుంచి అయినా పోటీ చేయవచ్చు అని రాజ్యాంగంలో ఉందని అన్నారు. జగన్ పులివెందుల నుంచి బయటకు వచ్చి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తే తమ సత్తా ఏమిటో చూపిస్తామని పంతం నానాజీ రాజకీయ పంతమే పూనారు. ఈ సందర్భంగా ఆయన ఆవేశంలో జగన్ మీద అనుచిత వ్యాఖ్యలే చేశారు.

భగ్గుమన్న వైసీపీ :

పంతం నానాజీ వ్యాఖ్యలతో వైసీపీ నేతలు అంతా భగ్గుమంటున్నారు. పంతం నానాజీ మీద 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు అయిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు జగన్ వంటి నేత మీద మాజీ సీఎం మీద పంతం నానాజీ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు అని మండిపడ్డారు. జనసేన తమతో సవాల్ చేసే ముందు ఒంటరిగా పోటీకి దిగాలని ఆయన అన్నారు. పొత్తులతో వచ్చి గెలవడం కాదని ఎద్దేవా చేశారు. పదిహేనేళ్ల పాటు కూటమి పొత్తులో ఉంటామని జనసేన చెప్పడమే జగన్ అంటే భయం ఏంటో తెలియచేస్తోందని మళ్లీ సవాళ్ళు ఎందుకని ఆయన ప్రశ్నించారు.

నా మరణం పిఠాపురం గడ్డ మీదనే :

ఇక వంగా గీత అయితే భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. తన పుట్టింటి వారు అంతా ఉండేది పిఠాపురంలోనే అని చెప్పారు. తనది నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన రాజకీయం అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశాను అని అలాగే ఎంపీగా ఎమ్మెల్యేగా నెగ్గిన తనను జగన్ పిలిచి కాకినాడ ఎంపీగా పోటీ చేయించారని గుర్తు చేసుకున్నారు. తన మరణం కూడా పిఠాపురంలోనే అని పిఠాపురంతో తన అనుబంధాన్ని ఎవరూ ప్రశ్నించజాలరని ఆమె ఎమోషనల్ గా కామెంట్స్ చేశారు. మొత్తం మీద చూస్తే పిఠాపురం చుట్టూ రాజకీయ కాక అంటుకుంది. మరి ఇది ఏ మలుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News