వృద్ధి ఓకే.. కానీ, 'విధ్వంసం' ప‌రిస్థితి ఏంటి: చంద్ర‌బాబు

రాష్ట్రంలో ఆర్ధికంగా నిలకడైన వృద్ధి నమోదు చేస్తున్నామ‌ని.. కానీ.. ఆర్థిక స‌మ‌స్య‌లు, వైసీపీ చేసిన విధ్వంసాలు వంటివి వెంటాడుతున్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు.

Update: 2026-08-11 18:10 GMT

రాష్ట్రంలో ఆర్ధికంగా నిలకడైన వృద్ధి నమోదు చేస్తున్నామ‌ని.. కానీ.. ఆర్థిక స‌మ‌స్య‌లు, వైసీపీ చేసిన విధ్వంసాలు వంటివి వెంటాడుతున్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. ఇటీవల కాలంలో ప్ర‌తినెలా ఆర్థిక శాఖ‌పై స‌మీక్షిస్తున్న చంద్ర‌బాబు.. నివేదిక‌ల‌ను ఇస్తున్నారు. నెల‌వారీగా జ‌రుగుతున్న ఖ‌ర్చులు, వ‌స్తున్న ఆదాయం, మిగులు, త‌గులు ఇలా.. అన్ని వివ‌రాల‌ను ఆయ‌న సేక‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జూలై నెలవారీ ఆర్ధిక నివేదికపై సీఎం స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌తి శాఖ‌, రంగానికి సంబంధించిన అన్ని వివ‌రాల‌ను ఆయ‌న తెలుసుకున్నారు.

గడచిన రెండేళ్లుగా జాతీయ వృద్ధి రేటు కంటే ఆంధ్రప్రదేశ్ వృద్ధిరేటు మెరుగ్గా నమోదు అవుతోందని అభిప్రాయప‌డ్డారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వాస్తవ వృద్ధి రేటు 2023-24లో 6.5 శాతం నమోదు చేస్తే 2025-26 ఆర్ధిక సంవత్సరంలో 9.9 శాతానికి పెరిగిందని ఇది ఒక‌ ర‌కంగా మేలేన‌ని పేర్కొన్నారు. ఇక‌, రాష్ట్రంలోని వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదు అవుతున్నట్టు నెలవారీ ఆర్ధిక నివేదిక పేర్కొందన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రణాళికా విభాగం అధికారులు జూలై ఆర్ధిక నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు కు అందించారు.

2025-26 రెండో త్రైమాసికంలో వ్యవసాయ రంగం 13.5 శాతం మేర వృద్ధి నమోదు చేయ‌డం ప‌ట్ల సీఎం హ‌ర్షం వ్య‌క్తం చేశారు. పారిశ్రామిక రంగం 10.6 శాతం మేర, సేవా రంగం 9.9 శాతం వృద్ధితో ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలి చాయని పేర్కొన్నారు. కానీ, ఇదేస‌మ‌యంలో వైసీపీ మిగిల్చినఅప్పులు, ఆర్థిక సమ‌స్య‌లు మాత్రం కొంత‌కాలం వెంటాడుతూనే ఉంటాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ.. అభివృద్ధి-సంక్షేమాన్ని ఎక్క‌డా ఆప‌కుండా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చాల్సిన బాధ్య‌త ఉంద‌న్నారు.

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా నెల‌కొన్న ఎల్ నినో లాంటి సంక్షోభ సమయంలోనూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను చేరు కునేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికా విభాగం అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను స‌మ‌గ్రంగా వినియోగించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తామ‌న్నారు. త‌ద్వారా ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు రాకుండా, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

Tags:    

Similar News