‘‘ఏపీ వేగం చూసి కేంద్రమే ఆశ్చర్యపోయింది’’ - మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
ప్రపంచ స్థాయి పాలసీలను కేంద్రం రూపొందిస్తుదని, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యతను రాష్ట్రాలకు అప్పగిస్తోందని మంత్రి వివరించారు.
మన దేశం ట్రిలియన్ డాలర్ ఎకానమీ దిశగా పయనిస్తున్న తరుణంలో, కేంద్రం అందిస్తున్న అవకాశాలను రాష్ట్రాలు ఎంత వేగంగా అందిపుచ్చుకుంటున్నాయనేదే అభివృద్ధికి కీలకమని ఏపీ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో రిపబ్లిక్ టీవీ సమ్మిట్ కు హాజరైన ఆయన ప్రధాని మోదీ ప్రోత్సాహాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధాని రాష్ట్రాలకు ఒక స్పష్టమైన విజన్ తో దిశానిర్దేశం చేస్తున్నారని కొనియాడారు. ప్రపంచ స్థాయి పాలసీలను కేంద్రం రూపొందిస్తుదని, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యతను రాష్ట్రాలకు అప్పగిస్తోందని మంత్రి వివరించారు. అయితే, ఆ విజన్‌ను ఆచరణలోకి తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ చూపిస్తున్న వేగం అసాధారణమైనదని ఆయన ఉద్ఘాటించారు.
నిధులు, ప్రాజెక్టుల కోసం వేచి చూడటం లేదు
ఎక్కువ మంది ఎంపీలు ఉంటేనే కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు వస్తాయా? అనే ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ప్రాజెక్టులు ఎంపీల సంఖ్య మీద ఆధారపడి రావని, రాష్ట్రాల పనితీరు, వేగం మీద ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం ప్రాజెక్టులను ప్రకటించినప్పుడు, దేశంలో ఏ రాష్ట్రం అత్యంత వేగంగా స్పందిస్తుందో, ప్రాజెక్టును అమలు చేయడానికి వనరులను సిద్ధంగా ఉంచుతుందో, కేంద్రం వారికే ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
మా వేగం ఇదే..
తమ ప్రభుత్వ పనితీరుకు ఒక బలమైన ఉదాహరణను ఆయన గుర్తు చేశారు: కేంద్రం రక్షణ శాఖకు సంబంధించి ఒక ప్రాజెక్టును చేపట్టబోతోందని తెలియగానే, దేశంలోని ఇతర రాష్ట్రాలు స్పందించే లోపే మేము రంగంలోకి దిగాం. కేవలం 37 రోజుల్లోనే 600 ఎకరాల భూమిని సేకరించి, రూపాయి ఖర్చు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి భూమి అప్పగించాం. ఫలితంగా ఆ ప్రాజెక్టు ఏపీకి దక్కింది. ఇది మా వేగానికి, నిబద్ధతకు నిదర్శనం" అని లోకేష్ వివరించారు.
ప్రధాని మోదీ రాష్ట్రాల మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీని కోరుకుంటున్నారని లోకేష్ వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాలు నిద్రిస్తున్న సమయంలో మేము మేల్కొని, కేంద్రానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నాం. కేంద్ర మంత్రికి ఫోన్ చేసి 'మీ ప్రాజెక్టుకు కావాల్సిన భూమి మా దగ్గర రెడీగా ఉంది, మా రాష్ట్రానికి రండి అని ఆహ్వానిస్తున్నాం. కేంద్రం ఇస్తున్న విజన్‌ని వాడుకుంటూ, దేశంలోనే వేగంగా దూసుకుపోతున్న రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు లభిస్తోందని లోకేశ్ చెప్పారు. అభివృద్ధిలో రాజీ లేని పరుగు ఇదే అని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.