అతిధి దేవో భవ కాదు...రావద్దో భవ !

కానీ ఇపుడు గ్యాస్ బండ ఏకంగా వంటింటినే గురి పెట్టడంతో బంధువులు వస్తున్నారు జాగ్రత్త అన్న హెచ్చరికల సౌండ్ గట్టిగా వినిపిస్తోంది.;

Update: 2026-03-14 18:30 GMT

అతిధులను మన సంప్రదాయంలో దేవుళ్ళుగా అభివర్ణిస్తూంటారు. ప్రతీ ఇల్లూ వచ్చీ పోయే చుట్టాలు బంధువులు అతిధులతో కళకళలాడాలని మనస్పూర్తిగా అంతా కోరుకునేవారు. అయితే గత కాలంలో ప్రతీ లోగిలీ బంధువులతో కిటకిటలాడేది. నవీన తరంలో ఆ వచ్చే పోయే వారి జాబితా బాగా తగ్గిపోయింది. అయినా సరే దగ్గర బంధువుల రాకపోకలు తప్పనిసరి. వీకెండ్స్ లో వారు రావడం అంతా కలసి ముచ్చట్లు పెట్టుకోవడం జరుగుతోంది. కానీ ఇపుడు గ్యాస్ బండ ఏకంగా వంటింటినే గురి పెట్టడంతో బంధువులు వస్తున్నారు జాగ్రత్త అన్న హెచ్చరికల సౌండ్ గట్టిగా వినిపిస్తోంది.

అంతా గ్యాస్ అంటూ :

అవును ఇపుడు అంతా గ్యాస్ మహిమ. బంధుత్వాలు స్నేహితులు ఎవరైనా గ్యాస్ పుణ్యామాని ఏ ఇంటి గడప తొక్కే అవకాశాలు అయితే లేవని అంటున్నారు. ఉన్న వారికే పొయ్యి మీద గ్యాస్ చాలడం లేదని వేడి నిట్టూర్పులు విడుస్తున్నారు. దాంతో ఇక కొత్తగా ఎవరైనా వస్తే అది అదనపు భారంగా మారుతుందని అంటున్నారు. అందుకే ఈ గ్యాస్ కొరత తీరేవరకు అయినా మా ఇంటికి రావద్దు స్వామీ అని వేడుకుంటున్నారుట.

కిచెన్ లో యుద్ధం :

ఎక్కడో గల్ఫ్ కంట్రీస్ లో యుద్ధం జరుగుతోంది అనుకుంటే పొరపాటు. ఆ ప్రభావం నేరుగా వంట గదికే వచ్చి పెద్ద శబ్దం చేస్తోంది. దాంతో సగటు జీవికి సాపాటు కోసం తిప్పలు తప్పేలా లేవు. గ్యాస్ గండంతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులు మాత్రం అలా లేవని అంటున్నారు. దాంతో ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంతో ఇంధన మార్కెట్ మీద తీవ్రమైన ప్రభావమే చూపిస్తోంది అని అంటున్నారు. గ్యాస్ సిలిండర్ కోసం ఏజెన్సీల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. దాంతో వంటింట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ ని చాలా పొదుపుగా ఇంకా చెప్పాలీ అంటే అపురూపంగా చూసుకుంటున్నారు

బయటకు పోయినా ఇంతే :

పోనీ ఎవరైనా వస్తే ఇంట్లో ఇంత వండి పెట్టడానికి గ్యాస్ కొరత ఉందని హొటళ్ళ నుంచి తెప్పించాలనుకున్నా అవి కూడా బంద్ అయి ఇబ్బంది పెడుతున్నాయి. చాలా హొటళ్ళలో ఐటెంస్ తగ్గించేశారు, చాలా వరకూ పాక్షికంగా నడుపుతున్నారు. ఇంకా మరి కొన్ని మూసేశారు. ఉన్న అరకొర హొటళ్ళలో అహార పదార్ధాల మీద గ్యాస్ టాక్స్ ప్రత్యేకంగా వడ్డించి వాయించేస్తున్నారు. దాంతో ఈ దారుణమైన పరిస్థితులలో తమకే రెండు పూటలా కంచం లేవడం కష్టంగా ఉంది కాబట్టి బంధువులారా దయచేసి ఇప్పట్లో రావద్దు అని నిక్కచ్చిగా నిర్దాక్షిణ్యంగా చెప్పేసే సీన్ కనిపిస్తోందిట.

పండుగలకే దెబ్బ :

ఇక చూస్తే హిందువులకు ఎంతో ప్రీతిపాత్రమైన ఉగాది పండుగ ముందు ఉంది. అలాగే ముస్లిమ్స్ కి రంజాన్ పండుగ ఉంది. ఈ నేపధ్యంలో గ్యాస్ షాక్ ఇస్తోంది. దాంతో పండుగ పూట ఎలా గడిచేది అని అంతా తల పట్టుకుంటున్న పరిస్థితి ఉంది. హిందువుల పండుగల వేళ పిండి వంటలు తప్పనిసరి. ఇపుడు వాటి సంగతి పక్కన పెడితే పప్పన్నం అయినా తినగలమా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక గ్యాస్ వినియోగం అయ్యేలా ఉగాది శ్రీరామ నవమి సహా అనేక పండుగలు ముందు ఉన్నాయని వాపోతున్నారు. మరి ఆ సమయానికి అయినా గ్యాస్ కష్టాలు తీరితే అదే పది వేలు అని అంటున్నారు.

Tags:    

Similar News