ఎడిటోరియల్ ఇచ్చినా అద్భుత సంగీతం- గ్రేట్ మామ !
1917 మార్చి 14 తమిళనాడులో ఒక అయ్యర్ కుటుంబంలో పుట్టిన కేవీ మహదేవన్ చదివింది ఏడు వరకే. కానీ సరిగమపదని అన్న ఏడు స్వరాలతో ఆరు దశాబ్దాల పాటు దక్షిణ భారతీయ చలన చిత్ర సంగీత ప్రపంచాన్ని తనదైన శైలిలో ఊపేశారు.;
కృష్ణన్ కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ అంటే సినీ సంగీత ప్రియులకు ఆయన ఎవరో తెలియదు. అదే కేవీ మహదేవన్ అంటే మాత్రం మన మామ కదా అని ఎంతో ఆనంద పడతారు. అరవై దశకంలో వచ్చిన మంచి మనసులు మూవీలో మామ మామా అన్న పాటకు మ్యూజిక్ చేసి బంపర్ హిట్ కొట్టిన తరువాత కేవీ మహదేవన్ పేరు మామగా ముద్దుగా అంతా పిలుచుకోవడం అలవాటు అయిపోయింది. 1917 మార్చి 14 తమిళనాడులో ఒక అయ్యర్ కుటుంబంలో పుట్టిన కేవీ మహదేవన్ చదివింది ఏడు వరకే. కానీ సరిగమపదని అన్న ఏడు స్వరాలతో ఆరు దశాబ్దాల పాటు దక్షిణ భారతీయ చలన చిత్ర సంగీత ప్రపంచాన్ని తనదైన శైలిలో ఊపేశారు.
పాటకు ట్యూన్ కట్టే నేర్పరి :
సాధారణంగా మ్యూజిక్ చేసే వారు రెండు పద్ధతులు ఎంచుకుంటారు. ముందు తాము ట్యూన్ ఇచ్చి పాట రాయమని గీత రచయితలను కోరుతారు. ఆ విధంగా చేయడం వల్ల లిరిసిస్టులకు ఒక రకమైన సవాల్ అని అంటారు. పరిధి పరిమితులు విధించడం వల్ల మంచి సాహిత్యం కూడా తగ్గిపోతుంది అన్న అపప్రధ ఉంది. అయితే ఇది కూడా హిట్ ఫార్ములాగానే చలామణీ అవుతోంది. ఈ విధంగా రాసి సాహితీ విలువలకు పట్టం కట్టిన మేటి ఘనాపాటీలుగా వేటూరి సుందరరామ్మూర్తి రాజశ్రీ లాంటి వారు ఉన్నారు. అయితే మామ మహదేవన్ మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకమని చెబుతారు. ఆయన గీత రచయితకు పూర్తి స్వేచ్చ ఇస్తారు. పాట రాసిన తరువాతనే ట్యూన్ కట్టడం మహదేవన్ స్పెషాలిటీ.
ఆయనను మించిన వారు లేరు :
అది ఎంత పెద్ద పొడవాటి గీతం అయినా చందస్సులు సమాసాలతో కూడినదైనా కూడా మామ వాటిని తీసుకుంటారు. దానికి తగిన అందమైన అద్భుతమైన సంగీతాన్ని సన్నివేశానికి సాహిత్య భావానికి తగినట్లుగా కూర్చడంతో కేవీ మహదేవన్ ది గ్రేట్ అని చెప్పాలి. చెల్లెలి కాపురంలో ఆడవే మయూరి పాట దీనికి ఒక నిలువెత్తు ఉదాహరణ. ఈ పాటలో కఠినమైన సమాసాలు ఎన్నో కనిపిస్తాయి. దానికి ఎవర్ గ్రీన్ ట్యూన్ కట్టి ఈ రోజుకీ ఒక అద్భుతమైన సాంగ్ గా నిలిచేలా మలచారు మామ. అందుకే ఈ విషయంలో ఆయనను మించిన వారు లేరని కూడా అంటే అతిశయోక్తి కాదు అన్నది సినీ సంగీత ప్రియుల కచ్చితమైన మాట.
ఎడిటోరియల్ ఇచ్చినా :
న్యూస్ పేపర్ లో ఎడిటోరియల్ ఎలా ఉంటుంది, వాక్యాలు పెద్దవిగా చిన్నవిగా సందర్భానుసారం సాగిపోతూ ఉంటాయి. అలాంటి ఎడిటోరియల్ ని ఇచ్చినా సూపర్ మెలేడీని ఇచ్చి లైఫ్ టైం నిలిచిపోయేలా మ్యూజిక్ చేయగల విద్య మహదేవన్ సొంతం అని ఆనాటి తరం ఎన్నో సార్లు అన్న సంఘటనలు ఉన్నాయి. అందుకే ఆత్రేయ మహదేవన్ కాంబినేషన్ సెట్ అయింది అని కూడా అంటారు. మనసు కవి ఆత్రేయ పాటలు అన్నీ మామూలు మాటలుగానే ఉంటాయి. మరి ఆ మాటలకు సంగీతాన్ని జత చేసి చిరకాలం నిలిచి పోయే ఎవర్ గ్రీన్ హిట్స్ ఇవ్వడం అంటే అది ఒక్క మామకే సాధ్యమని ఒప్పుకోక తప్పదు.
ఆరు దశాబ్దాల హిస్టరీ :
కేవీ మహదేవన్ తొలిసారిగా 1942 లో ఆనందన్ అనే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ఇక 1952 లో ఈయనకు మలయాళీ అయిన పుహళేందితో పరిచయం ఏర్పడింది. పుహళేంది మహదేవన్ తో కలిసి చివరి దాకా పనిచేశారు. తెలుగులో అయితే 1950 దశకం నుంచి కేవీ మహదేవన్ సంగీతం వినిపించడం ప్రారంభం అయింది. ఇక 1962 లో విడుదలైన మంచి మనసులు సినిమాలో ఈయన స్వరపరిచిన మామ మామ అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది. క్లాస్ అయినా మాస్ అయినా మహదేవన్ తన మ్యూజిక్ తో సూపర్ హిట్ చేయడం ఒక అలవాటుగా చేసుకున్నారు. అందుకే ఒకే సమయంలో అడవి రాముడు, శంకరాభరణం సినిమాలకు మ్యూజిక్ చేసి రెండు ఆల్బంస్ ని ఎవర్ గ్రీన్ చేయగలిగారు.
బాలు సహా వర్ధమానులకు కేరాఫ్ :
కేవీ మహదేవన్ కొత్త గాయనీ గాయకులకు చేయూతను ఇచ్చి ప్రోత్సహించేవారు. సినీ రంగంలోకి ప్రవేశించిన ఏడాదికే బాలుకు మహదేవన్ మ్యూజిక్ లో పాడే చాన్స్ వచ్చింది. 1968 లో వచ్చిన ప్రైవేట్ మాస్టర్ లో తొలి పాట మామ డైరెక్షన్ లో పాటలు పాడి శభాష్ అనిపించుకున్నారు ఆ మరుసటి ఏడాది ఘంటసాలతో కలసి బాలు తొలి పాట పాడే గొప్ప అవకాశం ఏకవీర సినిమా ద్వారా మామ కల్పించారు. ఇక ఘంటసాల కేవీ మహదేవన్ హిట్ కాంబినేషన్ అంటారు, అలాగే బాలు కేవీ మహదేవన్ కూడా సూపర్ కాంబోగా నిలిచింది. బాలు తరువాత వచ్చిన రామకృష్ణ జి ఆనంద్ వంటి గాయకులతో కూడా ఎన్నో పాటలను తన సంగీత దర్శకత్వంలో పాడించి వారిని ఎంకరేజ్ చేసిన మామ అంటే అందరికీ గౌరవంతో కూడిన భక్తి అని చెబుతారు.
నిదురించే తోటలో :
గుంటూరు శేషేంద్ర శర్మ తెలుగులో ప్రఖ్యాత కవి. ఆయన గేయాలు ఎన్నో రాశారు. అందులో ఒక దానిని మెచ్చిన దిగ్దర్శకుడు బాపు తన ముత్యాల ముగ్గు మూవీలో పాటగా పెట్టాలనుకున్నారు. నిదురించే తోటలో పాట ఒకటి వచ్చింది అంటూ సాగే ఆ గేయాన్ని కూడా రసరమ్యమైన సంగీతంతో చిరస్థాయిగా నిలిచే విరహ గీతంగా మార్చిన మామకు సరి సాటి ఎవరు లేరనే చెప్పాలి. అంతే కాదు పౌరాణికాలు జానపదాలు, సాంఘీకాలు చారిత్రాత్మక చిత్రాలు జానర్ ఏదైనా మామ సంగీతం ఒక పెట్టని కోటగా సినిమా విజయానికి దోహదపడింది.
స్టార్ల వెనక హీరో :
ఎన్టీఆర్ అక్కినేని క్రిష్ణ శోభన్ బాబు, కృష్ణంరాజు మోహన్ బాబు చిరంజీవి బాలకృష్ణ, నాగార్జున వెంకటేష్ ఇలా స్టార్లు అందరికీ చిరస్థాయిగా నిలిచే సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన కేవీ మహదేవన్ ఒక్క తెలుగులోనే 275కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు ఆయన చివరి దశలో నరాల బలహీనత వ్యాధితో బాధ పడ్డారు. మాట పడిపోయి మతిస్థిమితం కూడా కోల్పోయారని చెబుతారు. ఇక శ్వాస తీసుకోవడం కష్టమై 2001 లో తుది శ్వాస విడిచారు. ఇక కేవీ మహదేవన్ సంగీతం కూర్చిన చివరి సినిమా కబీర్ దాస్ 2003లో విడుదల అయింది.