డాలర్ వీక్, ఇరాన్ రిస్క్... చమురు ధరలపై ప్రభావం ఏస్థాయిలో అంటే..!
ఇటీవల ఇరాన్ లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో.. టెహ్రాన్ పై వాషింగ్టన్ దాడులు ఉండొచ్చనే చర్చ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.;
ఇటీవల ఇరాన్ లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో.. టెహ్రాన్ పై వాషింగ్టన్ దాడులు ఉండొచ్చనే చర్చ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మరోవైపు తాజాగా పశ్చిమాసియాకు అమెరికా యుద్ధ విమానాల వాహక నౌక చేరుకోవడంతోపాటు పెద్ద ఎత్తున సైన్యం బయలుదేరుతుందంటూ కథనాలు వస్తున్నాయి. దీంతో.. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని అంటున్నారు.
మరోవైపు... ఉక్రెయిన్ తో ప్రాదేశిక సమస్య ఇంకా పరిష్కారం కాలేదని.. ఉక్రెయిన్ లో భూభాగం కోసం రష్యా డిమాండ్ ను అంగీకరించే వరకు యుద్ధానికి దీర్ఘకాలిక పరిష్కారం సాధించే ఆశ లేదని క్రెమ్లిన్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో... ఉక్రెయిన్ తో శాంతి చర్చల్లో పురోగతి ఉంటుందనే ఆశలపై రష్యా చల్లటి నీళ్లు చల్లిన పరిస్థితి. ఈ రెండు కీలక పరిణామాల నేపథ్యంలో ముడి చమురుకు మద్దతు లభించింది.. ఇందులో భాగంగా... ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
అవును... అటు ఇరాన్ పై అమెరికా దాడులకు సిద్ధమవుతుందనే సంకేతాలు.. రష్యా - ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఇప్పట్లో సఫలమయ్యే అవకాశాలు లేవనేలాంటి స్టేట్ మెంట్లు.. వీటికి తోడు యూఎస్ డాలర్ భారీగా బలహీనపడి నాలుగేళ్ల కనిష్టానికి చేరుకున్న నేపథ్యంలో... ఇవన్నీ కలిసి చమురు మార్కెట్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా... క్రూడ్ ఆయిల్ ధరలు నాలుగు నెలల గరిష్టానికి చేరుకున్నాయి.
ఇదే క్రమంలో... గత ఐదు నెలల్లో ఉక్రేనియన్ డ్రోన్, క్షిపణి దాడులు కనీసం 28 రష్యన్ శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకున్నాయని.. దీనివల్ల రష్యా ముడి చమురు ఎగుమతి సామర్థ్యాలు పరిమితం అయ్యాయని.. ప్రపంచ చమురు సరఫరాలు తగ్గాయని చెబుతున్నారు. అదే విధంగా... బాల్టిక్ సముద్రంలో కనీసం ఆరు రష్యన్ ట్యాంకర్లపై ఉక్రెయిన్ డ్రోన్లు, క్షిపణులు దాడి చేశాయని.. ఇవి కూడా ముడి చమురు ధరల పెరుగదలకు కీలక కారణాలని చెబుతున్నారు.
మరోవైపు.. దాదాపు నాలుగు సంవత్సరాలలో యూఎస్ డాలర్ దాని బలహీన స్థాయికి పడిపోయింది. ఈ క్రమంలో ప్రస్తుతం బ్లూమ్ బెర్గ్ డాలర్ స్పాట్ ఇండెక్స్ 98.00 మార్క్ దగ్గర ఉంది! అయితే.. ఈ బలహీనత స్థూల ప్రాథమిక అంశాల కంటే అమెరికా పాలనతో పెరుగుతున్న అసౌకర్యాన్ని ప్రతిబింబిస్తుందని నిపుణులు అంటున్నారు. డాలర్ పతనానికి జపనీస్ యెన్ పుంజుకోవడమూ ఒక కారణమని అంటున్నారు. ఈ నెల ప్రారంభంలో డాలర్ కు 160 వైపు బలహీనపడిన తర్వాత.. యెన్ బాగా పుంజుకుందని.. ఈ క్రమంలో డాలర్ కు దాదాపు 153కి బలపడిందని చెబుతున్నారు.
కాగా... బుధవారం వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్ కు $63కి పెరిగాయి. ఇది మునుపటి సెషన్ నుండి దాదాపు 3% లాభాన్ని పెంచి సుమారు నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. దీనికి పైన చెప్పుకున్న విషయాలతో పాటు, ఫలితంగా ఏర్పడిన పలు సరఫరా అంతరాయాలు కారణమయ్యాయని చెబుతున్నారు!