ఓసీ ఓట్లను వైసీపీ వద్దనుకుంటుందా?

Update: 2020-09-05 09:10 GMT
గత ఎన్నికల్లో ఏపీలో 175 స్థానాలకుగాను ఏడింట ఆరొంతుల సీట్లు గెలిచిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల అండ కలిసి వచ్చింది. జగన్ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలోనే కొన్నివర్గాల్లో అసంతృప్తి కనిపిస్తోందట. తండ్రి అడుగుజాడల్లో నడుస్తానని జగన్ ఎప్పుడూ చెబుతుంటారు. కానీ వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కులంతో సంబంధం లేకుండా పేదవర్గాలందరికీ పథకాలు అందేవని, ఇప్పుడు వైసీపీ పాలనలో మాత్రం తమలాంటి వారికి ఏ ప్రయోజనాలు లేవని కొన్ని వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయని అంటున్నారు.

రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం, కృష్ణా జిల్లాలో కమ్మ సామాజికవర్గం, గోదావరి జిల్లాల్లో రాజులు, కమ్మ, కాపులు, ఏపీవ్యాప్తంగా 13 జిల్లాల్లో వైశ్య, బ్రాహ్మణ సామాజికవర్గాల్లోని మెజార్టీ ప్రజలు వైసీపీ వైపు నిలబడ్డారు. కానీ ఏడాదిలోనే జగన్ ప్రభుత్వం తీరుపట్ల దుమ్మెత్తి పోస్తున్నారట. దాదాపు 22 శాతం నుండి 25 శాతం వరకు ఉన్న ఓసీలకు ఈ ప్రభుత్వంలో ఎలాంటి పథకాలు అందడం లేదని వాపోతున్నారట. రిజర్వేషన్ల అంశాన్ని పక్కన పెడితే ఓసీల్లో ఎంతోమంది పేదలు, నిరుపేదలు ఉన్నారు. ఓసీల్లో 'ఉన్నవారి' గురించి పక్కన పెడితే పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి వారు 85 శాతం వరకు ఉండవచ్చు.

ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమకు ఎలాంటి పథకాలు లేకపోవడంతో ఓసీ పేదలు ఈ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారట. వైయస్ సీఎంగా ఉన్నప్పుడు కులం అంశం లేకుండా పేదవర్గాలకు అందరికీ పథకాలు అందేవని, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని, తమకు ఎంతోకొంత ప్రయోజనం చేకూరుతుందని నమ్మి ఓటు వేస్తే, వైసీపీ తమను వాడుకొని వదిలేసినట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఐదింట నాలుగొంతులకు పైగా పేదలు ఉన్న ఓసీ వర్గాల్లోని వారికి ప్రయోజనంచేకూరే విధంగా స్కీంలు లేకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల సమయంలో తమకు మేలు జరుగుతుందని భావించామని, కానీ జగన్ అధికారంలోకి వచ్చాక తమకు ఒరిగిందేమీ లేదని, అసలు ఓసీ ఓట్లు జగన్‌ కు, వైసీపీకి అవసరం లేదా అని స్థానిక నాయకులను ప్రశ్నిస్తున్నారట. కులాలతో సంబంధం లేకుండా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరుతున్నారు.
Tags:    

Similar News