ఇస్రో ప్రయోగంలో ఊహించని అంతరాయం.. నాలుగో దశలో తెగిపోయిన బంధం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2026 స్పేస్ క్యాలెండర్‌లో తలపెట్టిన మొట్టమొదటి ప్రయోగం 'PSLV-C62' పాక్షికంగా విఫలమైంది.;

Update: 2026-01-12 06:25 GMT

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2026 స్పేస్ క్యాలెండర్‌లో తలపెట్టిన మొట్టమొదటి ప్రయోగం 'PSLV-C62' పాక్షికంగా విఫలమైంది. ఆదివారం ఉదయం శ్రీహరికోటలోని షార్ (షార్) కేంద్రం నుండి గగనతలానికి దూసుకెళ్లిన ఈ రాకెట్ కీలకమైన నాలుగో దశలో సాంకేతిక లోపం తలెత్తడంతో తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.

ఏం జరిగింది?

నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం 10:17:30 గంటలకు PSLV-C62 నింగిలోకి ప్రయాణాన్ని ప్రారంభించింది. మొదటి మూడు దశలు శాస్త్రవేత్తలు అనుకున్నట్లుగానే అత్యంత విజయవంతంగా పూర్తి కావడంతో అందరిలోనూ ఆశలు చిగురించాయి. అయితే సుమారు 18 నిమిషాల ప్రయాణం తర్వాత రాకెట్ నాలుగో దశ PS4 స్టేజ్ ప్రారంభమైన వెంటనే గ్రౌండ్ స్టేషన్‌తో కమ్యూనికేషన్ తెగిపోయింది. దీంతో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడం సాధ్యపడలేదు.

ఇస్రో చైర్మన్ ప్రకటన

ఈ పరిణామంపై ఇస్రో చైర్మన్ నారాయణన్ అధికారికంగా స్పందించారు. "మూడో దశ వరకు ప్రయోగం సాఫీగానే సాగింది. కానీ నాలుగో దశలో ఎదురైన సాంకేతిక అవాంతరం వల్ల శాటిలైట్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం డేటాను విశ్లేషిస్తున్నాం, లోపానికి గల ఖచ్చితమైన కారణాలను త్వరలోనే వెల్లడిస్తాం" అని ఆయన పేర్కొన్నారు.

ప్రమాదంలో 'అన్వేష' (ఈఓఎస్ -ఎన్1) లక్ష్యాలు

ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైనది ఈఓఎస్-ఎన్1 (అన్వేష) భూపరిశీలన ఉపగ్రహం. హైపర్‌స్పెక్ట్రల్ టెక్నాలజీతో రూపొందించిన ఈ శాటిలైట్ దేశానికి ఎంతో కీలకం. దీంతో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలు కూడా ఈ ప్రయోగంలో భాగమయ్యాయి. అన్వేష ఉపగ్రహం ప్రధానంగా దేశ సరిహద్దుల్లో శత్రువుల కదలికలను కనిపెట్టేందుకు..దేశ రక్షణ రంగానికి అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఉద్దేశించినది.. వరదలు, తుపాన్ల వంటి సమయాల్లో తక్షణ డేటా సేకరించేందుకు ఉపయోగించనున్నారు.

ఏడాది ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగలడంతో ఇస్రో శాస్త్రవేత్తలు కొంత నిరాశకు గురైనప్పటికీ వైఫల్యానికి గల కారణాలను విశ్లేషించి తదుపరి ప్రయోగాలను పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పీఎస్ఎల్వీ వరుస విజయాలకు ఈ సాంకేతిక లోపం ఒక చిన్న అడ్డంకి మాత్రమేనని త్వరలోనే మరింత బలంగా పుంజుకుంటామని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News