ఏపీలో త్వరలో కొత్త రాజకీయ పార్టీ.. మాజీ ఐపీఎస్ సంచలనం!
అవును... ఏపీలో త్వరలో ఓ కొత్త రాజకీయ పార్టీ రాబోతుందనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.;
దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ.. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీతో జతకట్టి మిగిలిన పార్టీలు బండి నడిపిస్తుంటాయనే సంగతి తెలిసిందే! అప్పుడప్పుడూ తృతీయ ఫ్రంట్ అనే మాటలు వినిపించినా.. అది ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని చెబుతుంటారు. ఆ సంగతి అలా ఉంటే.. ప్రస్తుతం ఏపీలో చిన్న చితకా చాలా పార్టీలే ఉన్నప్పటికీ.. టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీలే ఓట్లు, సీట్లలో ప్రభావం చూపిస్తుంటాయి.
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ, కమ్యునిస్టులూ రింగు తిప్పినా.. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ వచ్చి, కాంగ్రెస్ లో విలీనమైపోయింది. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే.. ఏపీలో త్వరలో మరో రాజకీయ పార్టీ రాబోతుందని అంటున్నారు. అలా అని ఉన్న పార్టీతో విసుగు చెందినవారో.. లేక, పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారో కాదు సుమా.. ఆయనో మాజీ ఐపీఎస్ అధికారి. గతంలో వార్తల్లో ఎక్కువగా నిలిచిన ఉన్నతాధికారి!
అవును... ఏపీలో త్వరలో ఓ కొత్త రాజకీయ పార్టీ రాబోతుందనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. విజయవాడలోని సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సంక్రాంతి ఆత్మీయ కలయికలో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన ఈమేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా.. రాష్ట్ర పురోగతి కోసం తన ఆలోచనలకు తగ్గట్టుగా ఉండే వారితో కలిసి త్వరలోనే ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని.. గత ఏప్రిల్ 13న రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించానని.. అప్పటి నుంచి అదే పనిమీద ఉన్నానని.. అందుకు తగిన ఆర్థిక శక్తిని సమకూర్చుకుని.. త్వరలోనే పార్టీ పెడతాను అని ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటించారు. దీంతో.. ఈ ప్రకటన సంచలనంగా మారింది.
ఇదే సమయంలో... తాను పెట్టబోయే పార్టీకి సంబంధిచి అభిప్రాయాలు, ఆలోచనలు, భావాలను స్వేచ్ఛగా చెప్పేందుకు విజయవాడలో ఓ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఏబీవీ తెలిపారు. అమెరికా లాంటి దేశాలు చిన్న దేశాలపై దాడులు చేస్తున్న ఈ సమయంలో భారతదేశం బలంగా నిలబడాని.. కార్పొరేట్ శక్తులు అభివృద్ధి చెందడం మాత్రమే దేశాభివృద్ధి కాదని, ప్రజలందరూ అభివృద్ధి చెందాలని అభిప్రాయపడ్డారు.