వేణుస్వామి మరో పిచ్చి స్టేట్మెంట్
వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.;
వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాంసం, మద్యం, ఆధ్యాత్మిక ఆచారాలపై ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. కరోనా కాలం నుంచి ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయని, గతంలో మాంసాహారం తినని కొన్ని వర్గాల వారు కూడా తినడం మొదలుపెట్టారని వేణుస్వామి వ్యాఖ్యానించారు.
అయితే కరోనా మహమ్మారి సమయంలో వైద్యులు సూచించడంతోనే చాలామంది మాంసం తిన్నారని, అంతకు ముందు తినమని చెప్పేవారు, ఎప్పుడూ తినని వారు కూడా ఆ సమయంలో మార్కెట్ లో దొరకనంతగా తిన్నారని అన్నారు. డాక్టర్లు చెప్పారు కాబట్టే తిన్నామని అప్పుడు చాలా మంది చెప్పుకున్నారని, కానీ చివరకు తిన్నారా లేదా అనేదే అసలు విషయం కదా అని వేణు స్వామి తెలిపారు.
ఆ తర్వాత దేవుళ్లు, దేవతల విషయాలపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాంసం, మద్యం అలవాటు లేని దేవుళ్లు అసలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. రాముడు క్షత్రియుడని, ఆయన మాంసం తినలేదా అంటూ మాట్లాడారు. చాలా మంది దేవతలు కూడా సురాపానం తీసుకున్నారని చెప్పారు. సురాపానం అంటే మద్యం, సారా అంటూ వ్యాఖ్యానించారు.
అప్పట్లో ఇప్పటిలా అనేక మద్యం కంపెనీలు లేవని, అందుకే ఒకటే సురాపానం ఉండేదని అన్నారు. ఇప్పుడూ పూల నుంచి తీసే సారానే ఉంటుందని, కాలక్రమంలో రుచులు మారాయని వ్యాఖ్యానించారు. అయితే తనను టార్గెట్ చేయడానికి ఏదో ఒక అంశం కావాలనే ఉద్దేశంతో విమర్శలు చేస్తున్నారని వేణుస్వామి ఆరోపించారు. దశమహావిద్యలు తెలుసుకోవాలంటే కామాఖ్య దేవాలయానికి వెళ్లాలని, దానికి భారీ ఖర్చు అవుతుందని చెప్పారు.
సుమారు రూ.30 వేల ఖర్చు చేసి అక్కడ ఏం జరుగుతుందో తెలిస్తే తనపై స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు. తన మాటలను నమ్మేవారు నమ్ముతారని, నమ్మని వారు నమ్మరని, తనకు అందులో పట్టింపు లేదని వేణుస్వామి చెప్పారు. తాను తన లక్ష్యం ప్రకారమే ముందుకు వెళ్తున్నానని అన్నారు. చాలా మందికి దశమహావిద్యలపై అవగాహన ఉందని తెలిపారు. కానీ మీడియా వల్ల తనకు తెలియకుండానే పబ్లిసిటీ లభిస్తోందని చెప్పారు.
వామాచార పూజలు కావాలనుకునేవారు తన దగ్గరకే వస్తారని, ఉచిత ప్రచారం తనకు లాభంగా మారిందని తెలిపారు. అమ్మవారే అన్నీ నిర్ణయిస్తుందని, హిందూ శాస్త్రాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే శిక్షిస్తుందని, తన జోలికి వస్తే అమ్మవారే చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వేణుస్వామి చేసిన మాంసం, మద్యం అంశాలపై చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనేక మంది నెటిజన్లు మండిపడుతున్నారు. ఆధ్యాత్మిక వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమయ్యాయి. మరేం జరుగుతుందో వేచి చూడాలి.