జగన్ మంచి చేస్తున్నా కానీ.. పార్టీ పెద్ద వలన..!

Update: 2020-09-26 13:30 GMT
నో డౌట్. ఏపీ సీఎం జగన్ పాలన దక్షుడిగా నిరూపించుకున్నాడు. ఎంతో కష్టపడుతున్నారు. రాజధాని కూడా లేని రాష్ట్రం, అప్పుల్లో ఉన్నా కూడా సంక్షేమ పథకాలకు ఏలోటు లేకుండా చూసుకుంటున్నాడు. ప్రభుత్వం ఓకే.. మరి పార్టీ సంగతి. గత చంద్రబాబు కూడా పాలనను చూసుకొని పార్టీని వదిలిపెట్టడంతో దెబ్బతిన్నాడు. ఇప్పుడు వైసీపీ పార్టీలోనూ కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న ఆవేదన వారి నుంచి వినిపిస్తోంది.

ఏపీ సీఎం జగన్, దివంగత వైఎస్ఆర్ మీద అభిమానంతో ఏపీలో వైసీపీ గెలిచింది. ఇందులో జగన్ కష్టంతో పాటు వైసీపీ సోషల్ మీడియా కృషి ఉంది. ప్రతీ వైసీపీ కార్యకర్త ఎన్నికల్లో చేసిన పోరాటం వల్ల ఏపీ సీఎం జగన్ ఏకంగా చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా 51శాతం ఓట్లతో 151 సీట్లు సాధించి ఏకపక్ష విజయాన్ని నమోదు చేశాడు. వైసీపీ ఘన విజయం సమష్టి కృషి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఏపీ సీఎంగా జగన్ ప్రమాణం చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే తలంపుతో ఎక్కడా రాజీపడలేదు.. తను అనుకున్న నవరత్నాలు అమలు చేయాలని బడ్జెట్ లేకున్నా అప్పులు తెచ్చి మరీ ప్రజలకు నగదు బదిలీ లాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. కానీ పార్టీలో ఉన్న పెద్దలు, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఏపీ సీఎం జగన్ కు చెడ్డపేరు తీసుకొని వస్తున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు.

ముఖ్యంగా వైసీపీ రాష్ట్ర ఆఫీసులో కార్యకర్తలకు ఎవరూ అందుబాటులో ఉండడం లేదని వారంతా వాపోతున్నారు. ఎమ్మెల్యేలు వాళ్ల సొంత పనులకు వాడుకుంటున్నారని.. మంత్రులు అసలు జిల్లాలోనే అందుబాటులో ఉండడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హైకమాండ్ లో ఉన్న పెద్దలకు తమ బాధలు చెప్పుకోవాలని తాడేపల్లిలో ఉన్న వాళ్ల ఇంటి చుట్టూ కార్యకర్తలు తిరుగుతున్నారట.. కానీ హైకమాండ్ పెద్దలు మాత్రం కార్యకర్తలను అవమానిస్తూ దారుణంగా వాళ్ల అభిమానంను చులకనభావంతో చేస్తున్నారని వైసీపీ కార్యకర్తలకు అసలు పని కావడం లేదు అని సమాచారం. ఇలా చేస్తే కార్యకర్తలు ఏం కావాలని వాళ్లంతా ప్రశ్నిస్తున్నారు.

ఇవన్నీ ఏపీ సీఎంకు తెలుసా? లేక తెలియదా అని వాళ్లంతా ఆందోళనలో ఉన్నారట.. ఇలానే కొనసాగితే ఎన్నికల నాటికి వైసీపీకి ఏజెంట్స్ గా కూడా ఎవరూ మిగలరని కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్లే ఏజెంట్స్ గా కూర్చోవాలని హితవు పలుకుతున్నారు. వైసీపీ తరుఫున పనులు కానప్పుడు ఈ పార్టీలో మాకేం పని అని వాళ్లంతా అసహనం వ్యక్తం చేస్తున్నారట.. తాము పదేళ్లు ప్రతిపక్షంలో కష్టం అనుకోకుండా పనిచేస్తే ఈరోజు ఇంత దారుణంగా చులకన భావంతో మమ్మలను చూస్తారా అని కార్యకర్తలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.. ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం కార్యకర్తలను, పార్టీని పట్టించుకోకుంటే గత చంద్రబాబుకు జరిగినట్టే పార్టీ పుట్టి మునగడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News