ఈడీ విచారణకు హాజరు కాని వైసీపీ ఎంపీ

Update: 2023-03-18 13:39 GMT
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఒంగోలు వైసీపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను మార్చి 18న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. కవిత తమ విచారణకు సహకరించకపోవడంతో ముందు మాగుంట శ్రీనివాసులరెడ్డి వైపు నుంచి మద్యం కుంభకోణం కేసును నరుక్కురావాలని ఈడీ భావిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే మార్చి 18న ఈడీ విచారణకు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హాజరు కాలేదు. ఈడీ ఆదేశాల మేరకు మార్చి 18న శనివారం ఉదయం 11 గంటలకే ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం మాగుంట శ్రీనివాసులరెడ్డి వెళ్లాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం 1.30 గంటల వరకు కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈడీ విచారణకు మాగుంట వెళ్తారా? లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

కాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత సైతం ఈడీ విచారణకు హాజరుకాకుండా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఆమె పిటిషన్‌ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో మార్చి 20 విచారణకు రావాలని కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.

దేశవ్యాప్తంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే సుమారు 10 మందికి పైగా అరెస్టు అయ్యారు. ఇదే కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని గతేడాది అక్టోబర్‌లోనే సీబీఐ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయనతోపాటూ.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను కూడా సీబీఐ ప్రశ్నించింది. ఫిబ్రవరిలో ఈడీ రంగంలోకి దిగి రాఘవను అందుపులోకి తీసుకుంది.

మధ్యవర్తుల ద్వారా ఢిల్లీలోని కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి లంచాలు ఇచ్చారని మాగుంట రాఘవపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11న రాఘవరెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు.. ఆయన సరిగా సహకరించట్లేదనే ఉద్దేశంతో అరెస్టు చేశారు.

కాగా సౌత్‌ గ్రూప్‌ కు సంబంధించి అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌ చంద్రారెడ్డి, ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబు, రాఘవరెడ్డి ఇప్పటివరకూ అరెస్ట్‌ అయ్యారు. కాగా మాగుంట రాఘవ విషయానికొస్తే.. బాలాజీ డిస్టిలరీస్‌ కాకుండా, ఏంజెల్‌ షాంపైన్‌ ఎల్‌ఎల్పీ, తమిళనాడు డిస్టిలరీ ఇండస్ట్రియల్‌ ఆల్కహాల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వంటి ఇతర కంపెనీలు మాగుంట కుటుంబానికి సంబంధించిన రెండు కీలక సంస్థలపై సీబీఐ దృష్టి సారించిందని చెబుతున్నారు. మద్యం తయారీ, పంపిణీలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.

ఈ వ్యవహారంలో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు. ఇదంతా ఉత్తర భారతదేశ వ్యాపారుల కుట్ర అని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈడీ మాత్రం విచారణ సాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే మార్చి 18న శనివారం వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో ఈడీ ఎలా స్పందిస్తుదనేది ఆసక్తికరంగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News