ఆ ఐదుగురు బీఆర్ ఎస్‌లోనే: స్పీకర్ కీలక ఉత్తర్వులు
తెలంగాణలో గత కొంత కాలంగా రాజకీయ వివాదంగా మారిన జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ ప్రసాదరావు కీలక ఉత్తర్వులు జారీ చేశారు.;
తెలంగాణలో గత కొంత కాలంగా రాజకీయ వివాదంగా మారిన జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ ప్రసాదరావు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ మారారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మందిలో ఐదుగురు ఎమ్మెల్యేలు.. అలా చేయలేదని.. వారంతా బీఆర్ ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ప్రసాదరావు కీలక ఉత్తర్వు లు ఇచ్చారు. అదేసమయంలో ఆ ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను ఆయన కొట్టివేశారు. వీరిని అన్ని కోణాల్లోనూ విచారించామని.. ఎక్కడావారు పార్టీ మారినట్టుగా రుజువులు లేవన్నారు. ఈ నేపథ్యంలోనే వారి అనర్హత పిటిషన్లను కొట్టి వేస్తున్నట్టు తెలిపారు.
గత 2023 ఎన్నికల తర్వాత.. బీఆర్ ఎస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే.. బీఆర్ ఎస్ తరఫున విజయం దక్కించుకున్న పది మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌కు అనుకూలంగా మారారు. వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ.. బీఆర్ ఎస్ పార్టీ తొలుత స్పీకర్‌కు, తర్వాత.. హైకోర్టుకు.. ఇక్కడా జాప్యం జరుగుతున్న నేపథ్యంలో తుదకు సుప్రీంకోర్టుకు వెళ్లింది. మొత్తంగా గతంలోనే విచారణ జరిపిన కోర్టు.. నాలుగు వారాల్లోగా సదరు ఎమ్మెల్యేల విషయంపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఆ సమయంలోనూ జాప్యం కావడంతో మరింత సమయం ఇచ్చింది.
ఈ పరిణామాల క్రమంలో పార్టీ మారారని ఆరోపణలుఎదుర్కొంటున్న బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల్లో 10 మంది.. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్‌లకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వారిని విచారణకు పిలిచారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరిలు వివిధ కారణాలతో స్పీకర్ విచారణకు హాజరు కాలేదు. మరో 8 మంది మాత్రం స్పీకర్ విచారణకు వచ్చి వివరణ ఇచ్చారు. వీరిలో ఐదుగురికి సంబంధించి తాజాగాబుధవారం స్పీకర్ ప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు.
తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీలు పార్టీ మారలేదని స్పష్టం చేశారు. వారంతా బీఆర్ ఎస్‌లోనే కొనసాగుతున్నారని స్పీకర్ స్పష్టం చేశారు. ఇక, మిగిలిన ఐదుగురిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లను విచారించాల్సి ఉందన్నారు. మరో ముగ్గరు కాలే యాదయ్య, పోచారం, సంజయ్‌లకు సంబంధించి గురువారం నిర్ణయం వెలువరిస్తామన్నారు. ఇదిలావుంటే.. ఈ నెల 19న సుప్రీంకోర్టులో ఈ కేసు మరోసారి విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
న్యాయ పోరాటం చేస్తాం: బీఆర్ ఎస్
తాజాగా స్పీకర్ ప్రసాదరావు ఇచ్చిన తీర్పు, ఉత్తర్వులపై తాము అధ్యయనం చేయనున్నట్టు బీఆర్ ఎస్ పార్టీ స్పష్టం చేసింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపింది. అయితే.. తీర్పు పూర్తిపాఠం అందాల్సి ఉందని.. ఏయే కారణాలతో వారు బీఆర్ ఎస్‌లో ఉన్నారని స్పీకర్ నిర్ణయించారో తెలుసుకోవాల్సి ఉందని పార్టీ తెలిపింది. అనంతరం.. దీనిపై న్యాయ పోరాటం చేయనున్నట్టు పేర్కొంది.