హైదరాబాద్‌లో సైలెంట్ పనికానిచ్చే కొత్త ట్రెండ్ ‘హుష్ డేటింగ్’

అదే‘హుష్ డేటింగ్’. ప్రేమ, స్నేహం, బంధాల విషయంలో గతంలో ఉన్న పద్ధతులకు భిన్నంగా, అత్యంత గోప్యంగా సాగే ఈ సరికొత్త రిలేషన్ షిప్ స్టైల్ గురించి తెలుసుకుందాం.;

Update: 2025-12-17 17:30 GMT

అప్పట్లో మన తాతలు, తండ్రుల కాలాల్లో ఒకసారి మనువాడామంటే చచ్చేదాకా వాళ్లే కలిసి ఉండేది. కానీ మారిన ఈ కాలంలో బంధాలు కలకాలం నిలవాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. ఇగోలు, పెద్ద ఉద్యోగాలు, ఆర్థిక స్వాతంత్ర్యం, లగ్జరీ పెంపకాలతో జంటలు కలిసి ఉండడం నానా కష్టమవుతోంది. రెండు నిమిషాల్లో మ్యాగీ అయినట్టు ఇన్ స్టంట్ బంధాలు, విడిపోవడాలు జరుగుతున్నాయి. సెలబ్రెటీల నుంచి సామాన్యుల దాకా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది.

అయితే ఇప్పుడు హైదరాబాద్ యువతలో కొత్త ట్రెండ్ హాట్ టాపిక్ గా మారింది. అదే‘హుష్ డేటింగ్’. ప్రేమ, స్నేహం, బంధాల విషయంలో గతంలో ఉన్న పద్ధతులకు భిన్నంగా, అత్యంత గోప్యంగా సాగే ఈ సరికొత్త రిలేషన్ షిప్ స్టైల్ గురించి తెలుసుకుందాం.

హైదరాబాద్ యువత మధ్య తాజాగా వినిపిస్తున్న ఈ కొత్త పదం పేరు ‘హుష్ డేటింగ్’. పేరుకు తగ్గట్టే ఇది హుష్ ఎవరికీ తెలియకుండా సోషల్ మీడియాలో హడావుడి లేకుండా కనీసం సన్నిహిత మిత్రులకు కూడా చెప్పకుండా సాగించే డేటింగ్ స్టైల్ ఇది. కమిట్ మెంట్ లేని రిలేషన్ షిప్స్ , ప్రైవసీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం ఈ ట్రెండ్ లోని ప్రధాన సూత్రాలు.

హుష్ డేటింగ్ ఎందుకు పెరుగుతోంది?

నేటి వేగవంతమైన ప్రపంచంలో యువత రకరకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ ట్రెండ్ పెరగడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. ‘ఎప్పుడు పెళ్లి’? ఎవరితో తిరుగుతున్నావ్.? వంటి ప్రశ్నల నుంచి సమాజపు జడ్జ్ మెంట్స్ నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఈ రహస్య మార్గాన్ని ఎంచుకుంటున్నారు. వ్యక్తిగత ఎదుగుదలకు, కెరీర్ కు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ‘నో లేబుల్’ బంధాలకు మొగ్గు చూపుతున్నారు. ప్రతి విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కంటే.. తమ వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచుకోవడమే సురక్షితమని భావిస్తున్నారు.

హుష్ డేటింగ్ ఎలా ఉంటుంది?

సాధారణ డేటింగ్ కు, దీనికి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. దీంట్లో ఇన్ స్టాగ్రామ్ స్టోరీలు, ఫేస్ బుక్ స్టేటస్ లు ఉండవు. జంటగా దిగిన ఫొటోలు పోస్ట్ చేయరు. ఒకరిపై ఒకరికి పెద్దగా అంచనాలు ఉండవు. ఫలితంగా ఒత్తిడి లేని స్వేచ్ఛ ఉంటుంది. రద్దీగా ఉండే పబ్లిక్ ప్రదేశాల కంటే ఏకాంతంగా ఉండే ప్రదేశాలకే ప్రాధాన్యతనిస్తారు. ‘మన బంధానికి పేరు ఏంటి’ అనే ప్రశ్నను వీలైనంత వరకూ దాటవేస్తారు.

హైదరాబాద్ యువత ఏమంటోంది?

ఐటీ రంగం, స్టార్టప్ కల్చర్ ఎక్కువగా ఉన్న హైదరాబాద్లో ఆధునిక భావాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ‘జీవితాన్ని ఆస్వాదించాలి. వెంటనే బంధాలకు పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు’ అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ‘సీక్రెట్ రిలేషన్ షిప్స్’ కంటే స్పష్టత ఉన్న బంధాలే మానసిక ప్రశాంతతను ఇస్తాయి’ అని అభిప్రాయపడుతున్నారు.

హుష్ డేటింగ్అనేది మారుతున్న కాలానికి, మారుతున్న మనుషుల విధానానికి ఒక ప్రతిబింబం.. ఇది కొందరికి సౌకర్యంగా అనిపించవచ్చు. కానీ అవగాహన లేకపోతే భావోద్వేగపరమైన ఇబ్బందులకు దారితీయవచ్చు. ఏ బంధంలోనైనా పరస్పర గౌరవం, స్పష్టత ఉండడం ముఖ్యం. ట్రెండ్ ను గుడ్డిగా ఫాలో అవ్వడం కంటే మన మనసుకు ఏది సరైనదో ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే నిజమైన పరిణతిగా చెప్పొచ్చు.

Tags:    

Similar News