లక్ష జీతం ఉన్నా సేవింగ్స్ సున్నా.. బెంగళూరులో ఎందుకిలా..!
ప్రధానంగా ఐటీ ఉద్యోగులకు స్వర్గదామంగా బెంగళూరు ఉందని అంటారు. ఐటీ జాబ్ చేయాలనుకునేవాళ్లు చాలా మంది తెలుగువారు సైతం ముందు హైదరాబాద్ లో కోర్సు పూర్తి చేసి, బెంగళూరు బస్సు ఎక్కేస్తుంటారని చెబుతారు.;
ప్రధానంగా ఐటీ ఉద్యోగులకు స్వర్గదామంగా బెంగళూరు ఉందని అంటారు. ఐటీ జాబ్ చేయాలనుకునేవాళ్లు చాలా మంది తెలుగువారు సైతం ముందు హైదరాబాద్ లో కోర్సు పూర్తి చేసి, బెంగళూరు బస్సు ఎక్కేస్తుంటారని చెబుతారు. ఇక పెళ్లైన తర్వాత సిలికాన్ వ్యాలీలో కాపురం.. ఇంటి అద్దెలు.. కిరాణా ఖర్చులు.. రవాణా ఖర్చులు.. మొదలైనవి అన్నీ కలిపి ఇప్పుడు సగటు మధ్యతరగతి వ్యక్తి నెలకు రూ.లక్ష సంపాదిస్తున్నా సేవింగ్స్ సున్నాగా మారిన పరిస్థితి అనే విషయం సంచలనంగా మారింది.
అవును... బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ రోజు రోజుకీ పెరిగిపోతుందని అంటున్నారు. ఈ విషయంలో అన్నింటికంటే ముందు ఉన్నది ఇంటి అద్దె కాగా.. ఆ తర్వాత కిరాణా ఖర్చులు, పిల్లలుంటే స్కూలు ఫీజులు, పెద్ద వాళ్లుంటే మెడికల్ ఖర్చులు, రవాణా ఖర్చులు... ఏ విధంగా చూసుకున్నా ఓ మధ్య తరగతి కుటుంబం సిలికాన్ వ్యాలీలో ఓ మోస్తరు కంఫర్టబుల్ గా బ్రతకాలంటే.. కచ్చింతంగా లక్ష రూపాయల వరకూ ఖర్చవుతుందని.. ఆ పైన వచ్చే ఆదాయమే సేవింగ్స్ లోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.
ఇందులో ముందుగా బ్యాచిలర్స్ విషయానికొస్తే... ప్రాథమిక బడ్జెట్ లో అద్దె రూ.18 నుంచి రు.25 వేల వరకూ ఉంటుందని చెబుతున్నారు. ఇక మిగిలిన లైఫ్ స్టైల్ పై ఆధారపడి మిగతా ఖర్చులు ఉంటాయి. ఇక.. ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు ఉండే (ఓ మధ్యతరగతి) కుటుంబం విషయానికొస్తే.. ప్రైమరీ బడ్జెట్ లో రూ. 35 నుంచి రూ.45 వేల వరకూ ఉండగా.. కాస్త కంఫర్ట్ బుల్ జోన్ విషయానికొస్తే డబుల్ బెడ్ రూమ్ అద్దె రూ.55 వేల నుంచి రు.80 వేల వరకూ ఉన్న పరిస్థితి.
సరే... ప్రైమరీ బడ్జెట్ లోనే లెక్కేసుకుని సరాసరిన నెలకు రూ.40,000 ఇంటి అద్దె అనుకుంటే... ఇక మిగిలిన ఖర్చులు కూడా సిలికాన్ వ్యాలీ స్థాయిలోనే ఉన్నాయని అంటున్నారు. ఇందులో కిరాణా సరుకులకు రూ.10,000.. ఎలక్ట్రికల్, వాటర్, ఇంటర్నెట్ వంటి యుటిలిటీస్ ఖర్చు రూ.5,000 వరకూ ఉంటుందని చెబుతున్నారు. ఇక రవాణా విషయానికొస్తే సరాసరిన రోజుకు రూ.150 నుంచి రూ.200 వేసుకున్నా... రూ.5,000 తప్పదని చెబుతున్నారు.
ఇంట్లో స్కూలు పిల్లలు ఉంటే సరాసరిన ఒక బిడ్డకు నెలకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకూ ఖర్చయ్యేలా ఫీజుల మోత మోగుతుందని అంటున్నారు. ఇక వినోదం ఖర్చు.. ఎప్పుడైనా బయటకు వెళ్లి ఓ మోస్తరు రెస్టారెంట్ లో భోజనం.. వీకెండ్స్ లో సాయంత్రం పూట సరదాగా ఫ్రెండ్స్ తోనో, కొలీగ్స్ తోనో చీర్స్ అంటే.. వీటికి దుస్తులు, పాదరక్షల షాపింగ్ కూడా తోడైతే... వెరసి... రూ.1,00,000 వరకూ కనీసం ఖర్చవుతుందని అంటున్నారు.
వీటిలో ఎంత తగ్గించుకున్నా... ఇంటి అద్దె తప్పదు, కిరాణా తప్పదు, యుటిలిటీస్, స్కూల్ ఫీజులు ఏవీ తగ్గించుకున్నా తగ్గేవి కాని పరిస్థితి. మహా అయితే క్యాబ్ లో వెళ్లేవారు మెట్రోలోనో, బస్సుల్లోనో వెళ్లగలరు! కారు లో వెళ్లేవారు.. అది ఆపి షేర్ ఆటోలో ప్రయాణించగలరు! ఓ మోస్తరు మిడిల్ బడ్జెట్ రెస్టారెంట్ కి వెళ్లేవారు.. ప్రైమరీ బడ్జెట్ హోటల్ తోనే సరిపెట్టుకోవచ్చు! ఎంత చేసినా.. ఓ జంట, అటు పిల్లలు కానీ, ఇటు ఫ్యామిలీతో కానీ ఉన్నంతలో సర్ధుకుని బ్రతకాలంటే రూ.లక్ష మినిమం అని చెబుతున్నారు!
అంటే... బెంగళూరులో సేవింగ్స్ చేసే అవకాశం రావాలంటే వేతనం రూ.లక్షకు పైగానే ఉండాలన్నమాట. ఇక వర్కింగ్ కపుల్ అయితే ఒకరి జీతాన్ని సేవింగ్స్ గా మార్చుకోవచ్చన్నమాట! దూరపు కొండలు నునుపు అన్నా.. పరుగెత్తి పాలు తాగడం అనుకున్నా.. కెరీర్ లో గ్రోత్ ఉండాలంటే సిలికాన్ వ్యాలీలో ఈ మాత్రం ఖర్చులు తప్పవు అనేది మరికొందరి మాట!